హైదరాబాద్ మార్చ్ 26 (way2newstv.com)
రాష్ట్ర సాధన కోసం తెలంగాణాలో అనేకసార్లు ఉద్యమాలు జరిగాయి. ఐతే అప్పటి సమైక్య పాలకులు, కేంద్ర ప్రభుత్వాలు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడం వల్లనో, లేక ముందుండి నడిపించిన నాయకత్వం లాలూచీ పడటం వల్లనో, మరే ఇతర కారణాలతోనో ఉద్యమం చాలాసార్లు చతికిలపడింది. కానీ దేశ రాజకీయాల్లో గుణాత్మకమార్పు కోసం ప్రత్యర్థులకు గిరిగీసి బరిలోకి దిగాడు ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ నేతృత్వంలో మొదలైన ఉద్యమం అలా చప్పగా సాగలేదు, ఎప్పుడూ ఢీలా పడిపోలేదు. అది నిరంతర స్రవంతిలా, ఓ ఆరని జ్వాలలా, అశేష జనవాహినితో కూడిన మరో ప్రవాహంలా సాగింది. ప్రత్యర్థులు పన్నే కుయుక్తులకు ప్రతీసారీ గిరిగీసీ, వాటిని విజయవంతంగా తిప్పికొడుతూ, స్వపక్షంవాళ్ళను బరిలోకి దించుతో, కేసీఆర్ ఏకతాటిపై ఉద్యమాన్ని నడిపించారు. 4 కోట్ల తెలంగాణా ప్రజల 55 ఏళ్ల స్వరాష్ట్ర కలను నిజం చేశారు. అదే తరహాలో ఇప్పుడు జాతీయ పార్టీలకు కేసీఆర్ గుణాత్మక మార్పనే గిరిగీసాడు. తానే స్వయంగా దేశ రాజకీయాల బరిలోకి దిగాడు. 130 కోట్ల ప్రజల 73 ఏళ్ల అభివృద్ది, సంక్షేమరాజ్య కలను సాకారం చేస్తానంటున్నాడు. ఒకప్పటి తెలంగాణా వేరు. నిస్సహాయస్థితో లేక అప్పటి నాయకుల్లో పేరుకుపోయిన అవగాహనారాహిత్యమో, అదీ కాకపోతే అవకాశవాద తత్వమో, మొత్తానికి ఒకరకమైన రాజకీయ శూన్యతతో ఇక్కడి సమాజం సతమతమయ్యేది.
గుణాత్మక మార్పు కోసం రాజకీయ ప్రత్యర్థులకు గిరిగీసి బరిలోకి దిగిన కేసీఆర్
సత్తా ఉన్న నాయకులు లేకపోవడంతో ఈప్రాంతం హక్కుల సాధనలో తరచూ విఫలమయ్యేది. ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా అంతంతమాత్రమే. మేధోసంపత్తి ఉన్నా, దార్శనికత, దీర్ఘకాలిక దృక్పథం కొరవడి, స్థానిక నాయకుల రాజకీయ అవిటితనంతో ఈ ప్రాంతం వెనక్కి నెట్టివేయబడేది. సమైక్యపాలన ఉక్కుపాదాల కింద నలుగుతూ, నాన అవస్థలుపడుతూ, ఇక్కడి జనం జీవచ్చావాల్లా బతికేవాళ్ళు. సమైక్య నాయకుల్లో మాత్రం మాకు, మేము, మావాళ్ళు, మాది అన్న దృక్పథం కొట్టొచ్చినట్లు కనిపించేది. ఓరకంగా చెప్పాలంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అన్న చందంగా పరిస్థితి మారింది. ఆఖరుకు ఇక్కడి ఉద్యోగాల్లో సైతం అక్కడి నుంచి వలస వచ్చినవాళ్ళే తిష్టవేసారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం, భాషా, కట్టూబొట్టూ అన్నీ పరాయిప్రాంత వాసుల ప్రభావానికి లోనై ప్రమాదంలో, ప్రశ్నార్థకంలో పడిపోయాయి. వేళ్ళమీద లెక్కించ్చేంత కొద్దిమంది మినహా సమైక్య రాష్ట్రాన్ని పాలించిన వాళ్లంతా ఆంధ్రాప్రాంతం వాళ్ళే. అప్పట్లో మంత్రివర్గ కూర్పులో కూడా వాళ్ళకే పెద్దపీట వేసేవాళ్లు. అది మొదలు, పరిపాలనలో వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని, పెట్టే ప్రతి ఖర్చూ, ఆంధ్రాప్రాంత అభివృద్ది, అక్కడి వాసుల బాగోగులు, యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొనే చేసేవాళ్ళు. తెలంగాణాలో బోరు బావులు ఎండి, పంటపొలాలు బీళ్లుగా మారి నోళ్ళు తెరిచినా, కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యేవాడు. ఈ ప్రాంతంలో కరువుకాటకాలు, క్షామం తాండవం చేసినా, రైతులు సాయం మొర్రో అంటూ చేతులెత్తి అర్రులు చాచినా, సమైక్య పాలకుల కాఠిన్యం కరిగేది కాదు. పాలకుల నుంచి చెప్పలేని నిర్లక్ష్యం ఎదురయ్యేది. ఇక అటు ఆంధ్రా పక్క ఏ చిన్న సమస్య తలెత్తినా ఆగమాగం చేసేవాళ్ళు. తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తేనైతే, ఇక చెప్పనే అక్కరలేదు, ఎక్కడాలేని హడావిడి మొదలయ్యేది. ఓవైపు విరాళాల వసూళ్ల పర్వం కొనసాగిస్తూనే, సముద్రతీర ప్రాంతాల్లోని ముంపు గ్రామాలకు నిధుల వరద పారించేవాళ్లు. బాధితులకు సాయం చెయ్యొద్దనో, అది తప్పనో చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ, ఆపేరిట హైదరాబాద్ సహా తెలంగాణాలోని సహజవనరులు, నిధులను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను పక్కన బెట్టి మరీ, ఆంధ్రాకు తరలించిన వైనం పైనే ఆక్రోశం. అలా నిధుల కటకట తలెత్తి, ఇక్కడి ప్రాంతవాసుల అవసరాలు అటకెక్కేవి, తద్వారా కష్టాలు రెట్టింపయ్యేవి. సమైక్య పాలకుల వైఖరితో నెమ్మదిగా, ఓ పథకం ప్రకారమా అన్నట్లు తెలంగాణా ప్రాంతం వెనకబాటుతనంలోకి బలవంతంగా నెట్టబడింది. ఇక 1960 లో ఓసారి, మెరుపు మెరిసినట్లుగా ఆ తరవాత మరోసారి, అడపాదడపా చెదురుమదురుగా ఇంకొన్ని సార్లు జరిగిన సంఘటనలు మినహా, ఇక్కడి ప్రజల్లో పోరాడేస్ఫూర్తి అంతకంతకూ నీరుగారిపోతూ, తెలంగాణలో వ్యవసాయం మొదలు నీటి పారుదల, విద్యుత్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, రైలు మార్గ విస్తరణ తదితర ఇతర రంగాల్లో అభివృద్ధి కుంటుపడింది. కానీ, 21 శతాబ్దపు తొలి అంకంలో రోజులు వడివడిగా మారిపోయాయి. సమైక్యరాష్ట్ర యవనికపైకి కేసీఆర్ రూపంలో బలీయమైన ప్రత్యేకరాష్ట్ర కాంక్షతో రెండోసారి ఉద్యమం ఉప్పెనలా, ఉవ్వెత్తున ఎగసిపడింది. నీళ్ళు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తో తెలంగాణా ప్రజానీకం యావత్తూ విప్లవగళాన్ని విప్పింది. తొలినాళ్లలో ఆంధ్రావాలాలు తెలంగాణా ఉద్యమాన్ని కొంత చిన్నచూపు చూసినా, రానురాను అది ఓ ప్రభంజనంలా మారింది. దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు అనేకం ఉన్నా, కేవలం ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయడానికి అప్పటి కేంద్ర పాలకులు భాషా ప్రయుక్త రాష్ట్రాల చట్టం పేరిట పన్నిన కుట్రలను భగ్నం చేసింది. కేంద్రం మెడలు వంచి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం సాధించుకునే దాకా కేసీఆర్ ఉద్యమం ఆగలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ చుక్కానిగా కేసీఆర్ ది ఒక విలక్షణమైన, చారిత్రాత్మక పాత్ర. తెలంగాణా శక్తులను సమన్వయం చేసి ఒకే వేదిక మీది నుంచి పోరాటం నడిపించిన ఘనత. ఒక్క నెత్తుటిచుక్క చిందకుండా, చిన్న హింసాత్మక సంఘటనకు సైతం తావులేకుండా ఉద్యమాన్ని పూర్తి సంయమనంతో, సహనంతో, శాంతియుతంగా నడిపించి తన కార్యసాధన పూర్తి చేశాడు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కనీసం మచ్చుకైనా ఒక్క హింసాత్మక సంఘటన జరగలేదనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారు, అది తెలంగాణానా పాకిస్తానా అంటూ అడ్డమైన కూతలు కూస్తున్న వాళ్ళు మొదలు సామాన్యజనం వరకు, అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణాలో పూర్తి స్వేచ్ఛగా, ఒక్కమాటలో చెప్పాలంటే స్వరాష్ట్రంలో కంటే స్వతంత్రంగా బ్రతుకుతున్నారు. కేవలం బ్రతకడమే కాదు వేలకోట్ల రూపాయల ఆస్తులను కూడా ఇక్కడ కూడబెట్టుకుంటున్నారు, వాటిని అనుభవిస్తున్నారు. అయినా ఎన్నికల వేళ ఆంధ్రాప్రజల మెప్పు పొందడానికి బేకార్ కూతలు కూస్తున్నారు. కానీ, జనం ఈ పరిణామాలన్నిటినీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఓటు రూపంలో వాళ్లకు అంతకు అంతా సమాధానం చెబుతారు. ఉద్యమ యోద్ధ కేసీఆర్ దశాబ్దన్నర కృషి, ఎన్నో అలుపెరుగని పోరాటాలు, మరెన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల తరవాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ దార్శనికత, పరిపాలనా దక్షతలతో రాష్ట్రం బంగారు తెలంగాణా దిశగా ఉరుకులుపరుగులు పెడుతోంది. తెలంగాణా రాష్ట్రం ఇవాళ రాబడిలో ఐదో స్థానంలో, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తోంది. రాబోయే ఐదేళ్లలో ఉమ్మడి సంకెళ్లు కూడా తెంచుకొని పూర్తిగా స్వేచ్చాయుతం కాబోతోంది. పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఐదేళ్ల కాలంలోనే కేసీఆర్ తెలంగాణాను, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో కరువు, క్షామం అనే పదాలే తెలంగాణా డిక్షనరీలో లేకుండా తరిమికొట్టే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి బృహత్తర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, గ్రామీణ రోడ్లు, ఇతర రహదారుల విస్తరణ లాంటి అనేక ఇతర మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలను సైతం చేపట్టారు. ఇలా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరం అయ్యే అన్ని చర్యలు చేపట్టి, పరిపాలనను గాడిలో పెట్టి, అది సవ్యమైన దిశలో పయనించేలా ఓ పటిష్టమైన విధానాన్ని అందించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు మొదట్లోనే గట్టి పునాదులు వేసి దాని మూలాలను బలోపేతం చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ, కేసీఆర్ లాంటి దీర్ఘకాలిక దృక్పథం, దార్శనికత ఉన్న నేతకు తెలంగాణాలాంటి ప్రాంతం ఓ చిన్న పరిధే అవుతుంది. బహుముఖ ప్రజ్ఞ, అపారమైన రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ లాంటి నాయకుడు ఒక్కసారి, ఒక్కసారంటే ఒక్కసారి దేశానికి సారధ్యం వహిస్తే? భారత భవితకు ఆయన విధాత అయితే? యువత ఆశల పల్లకీ మోస్తే? జాతీయ, అంతర్జాతీయ సమస్యలకు కేసీఆర్ పరిష్కార మార్గాలు చూపగలిగితే? రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సమాఖ్య విధానానికి ఓ కొత్త నిర్వచనం ఇవ్వగలిగితే? కేంద్రపన్నుల్లో రాష్ట్రాలకు న్యాయమైన, సమృద్దికరమైన వాటా ఇచ్చి, ఉమ్మడి జాబితాలోని అనేక అంశాలపై విధానపరమైన నిర్ణయాధికారం కూడా ఇస్తే? నిస్సందేహంగా భరత ఖండం ఖ్యాతి ఈ భూగోళంపై దశదిశలా వ్యాపిస్తుంది. ఇక, విప్లవాత్మక మార్పుల సమాహారం అజెండా ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి వస్తోందా? అదే నినాదంతో కేసీఆర్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ శంఖారావం పూరిస్తున్నాడా? రాబోయే పరిణామాల ఆధారంగా ఆయన త్వరలోనే జాతీయ పార్టీ స్థాపిస్తాడా? సెంటిమెంట్ ప్రకారం కేసీఆర్ పోరాటాల పురిటగడ్డ కరీంనగర్ నుంచి అదే ప్రకటన చేశాడా? అన్న తర్కం వచ్చినప్పుడు, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో పెను పరిణామాలకు ఆస్కారం లేకపోలేదనే సమాధానం వస్తుంది. దేశానికి అవసమైన తక్షణ విధానాలపై విస్తృతంగా అధ్యయనం చేసిన కేసీఆర్, సగటు పౌరుని అవసరాలను, అవి తీర్చడానికి జాతీయస్థాయిలో పాతుకుపోయిన రుగ్మతలను, ఇతర అన్ని విషయాలనూ క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. అందుకే దేశానికి సమగ్ర జాతీయ జల, విద్యుత్, రహదార్ల, మౌళిక సదుపాయాల కల్పన విధానాలు, అమెరికా, చైనా, జపాన్, సింగపూర్, థాయిలాండ్, మలేషియా లాంటి దేశాలకు దీటైన జాతీయ సమగ్ర అభివృద్ది విధానాలు అవసరమని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఫెడరల్ న్యాయవ్యవస్థలో కూడా సమూలమైన మార్పురావాలని ఆకాంక్షిస్తున్నారు. సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు ఒక్క ఢిల్లీలో మాత్రమే ఉంటే సరిపోతుందా? లేక వివిధ రాష్ట్రాల్లో దానికి బెంచ్ లు ఉండాలా అనే చర్చకు తెరలేపుతున్నారు. దేశానికి ఓ కొత్త ఆర్థిక విధానం, మరో కొత్త వ్యవసాయ విధానం, ఇంకో కొత్త పరపతి విధానం, మనం రాసుకున్న రాజ్యాంగంలో ప్రబలమైన మార్పులు రావాల్సిన అవసరాన్ని పదేపదే నొక్కి చెబుతున్నారు. కేంద్రంలో ఇప్పటి వరకు బీసీ మంత్రిత్వశాఖ లేని వైనాన్ని ఎత్తి చూపుతున్నారు. విద్యా, న్యాయ, అడవులు, పట్టణ, గ్రామీణ అభివృద్ధి లాంటి అంశాలను ఉమ్మడి జాబితాలో నుంచి తొలగించాలని తన ఫెడరల్ అజెండాలో చేర్చారు. 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా అనేక అంశాలను ఉమ్మడి జాబితాలో చేర్చారనీ, తద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్ర పాలకులు హరించారని ఆరోపిస్తున్నారు. ఇక ఆ పరిస్థితిలో మార్పురావాలని కోరుతున్నారు. సహజవనరులు సమృద్దిగా ఉండి, ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులున్న భారతదేశం ప్రపంచపటంలో ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీస్ జాబితాలోనే ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, హైదరాబాద్ లో సగం వైశాల్యం ఉండి, కేవలం 50 లక్షల జనాభా ఉన్న సింగపూర్ లాంటి తూర్పు ఆసియా దేశాల అభివృద్దిని కేసీఆర్ పదేపదే ఉటంకిస్తున్నారు. తాను రాష్ట్రంలో అనుసరిస్తున్న అభివృద్ది, నమూనాలే ఇవాళ దేశానికి కూడా అవసరం అని ఆయన గొంతెత్తి చెబుతున్నారు. ప్రజలు నమ్మి ఢిల్లీకి పంపితే నిర్దేశించుకున్న కొత్త లక్ష్యాన్ని కేసీఆర్ తప్పక చేరుకుంటారు. ఆయన కార్యదీక్షతకు తెలంగాణా రాష్ట్ర సాధనే ఓ గీటురాయి అనడంలో సందేహమే అక్కరలేదు.టోటల్ గా బ్రిటీష్ విధానాలతో రాష్ట్రాల హక్కుల హననం చేయడమే కాకుండా పలు అభివృద్ధి నిరోధక విధానాలతో సమాజాన్ని, వ్యవస్థను నిర్వీర్యం చేశారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ లాంటి ఫ్యూడలిస్టిక్ బ్యూరోక్రసీని కొనసాగిస్తూ ఇక్కడి పాలనా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని కేసీఆర్ గట్టిగా నిలదీస్తున్నారు. 73 ఏళ్ల స్వాతంత్య్రానంతర పరిస్థితులను, జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తున్నారు. ఈ వెనకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీ ల్లాంటి జాతీయ పార్టీలు అనుసరించిన, అవలంభించిన పనికిమాలిన విధానాలే కారణమని కేసీఆర్ గర్జిస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని ముక్కుసూటిగా ముందుకు వెళ్తున్నారు.అందుకే ప్రత్యర్థులకు గిరిగీసీ మరీ కేసీఆర్ జాతీయ రాజకీయాల బరిలోకి దిగుతున్నారు.