ముంచుకొస్తున్న ముప్పు (పశ్చిమగోదావరి) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముంచుకొస్తున్న ముప్పు (పశ్చిమగోదావరి)

ఏలూరు, ఏప్రిల్ 20 (way2newstv.com):
జిల్లా వాసులకు తాగునీటికి గడ్డు పరిస్థితి ఎదురుకానుంది. ఒకవైపు భానుడి ప్రతాపానికి రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోపక్క పట్టణాలు, గ్రామాల్లోని మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపేందుకు పురపాలక సంఘాలు, పంచాయతీల అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోకుంటే తాగునీటికి ప్రజలు అల్లాడాల్సి వస్తుంది. ప్రస్తుతం గోదావరి జలాలు గణనీయంగా తగ్గడంతో సీలేరు జలాలపై ఆధారపడే పరిస్థితి ఎదురైంది. పశ్చిమ డెల్టాకు 3,500 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీన్ని వంతులవారీ విధానంలో అందిస్తుండగా సాగు, తాగునీటికి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. కాగా, సీలేరు జలాలను సోమవారం నుంచి నిలిపివేయాలని జలవనరుల శాఖ భావిస్తున్న తరుణంలో గ్రామాల్లోని మంచినీటి చెరువులు పూర్తిగా నింపేందుకు ఇబ్బందులు తప్పవు.జిల్లాలోని అయిదు పట్టణాలు, 443 గ్రామాలకు గోదావరి కాలువల నీరే ఆధారం. వేసవి కాలంలో కాలువలను కట్టివేసిన తర్వాత 50 నుంచి 60 రోజులపాటు చెరువుల్లోని నీటిని సరిపెట్టాలంటే కష్టమే. ప్రస్తుతం అన్ని కాలువల్లో నీటి ప్రవాహం అడుగంటింది. ఏటా కాలువలను కట్టివేసే ముందు మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపుకొనేందుకు జల వనరుల శాఖ అవకాశం ఇచ్చేది. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. వచ్చే కొద్దిపాటి నీటిని చివరి దశలోని  వరి పంటకు ఏవిధంగా సర్దుబాటు చేయాలో తెలియని పరిస్థితుల్లో యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో తాగునీటి విషయంలో చెతులేత్తేసేలా కనిపిస్తోంది.


ముంచుకొస్తున్న ముప్పు (పశ్చిమగోదావరి)

కాలువలకు వంతుల వారీ విధానంలో నీరందించడంతో చెరువులకు పూర్తిస్థాయి నీటిని మళ్లించుకునేందుకు పురపాలక సంఘాలు, పంచాయతీలకు అవకాశం కలగలేదు. సాధారణ రోజుల్లో కాలువల నీరు నేరుగా.. మరికొన్నిచోట్ల ఉప కాలువలు, పంట బోదెల గుండా చెరువులకు చేరుతుంది. ఇప్పటి పరిస్థితులు అలాలేవు. అన్ని గ్రామాల్లోని పంచాయతీలు మంచినీటి చెరువులకు ఇంజిన్లు ఏర్పాటు చేసుకొని వచ్చే కొద్దిపాటి నీటిని మళ్లించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇంత చేస్తున్నా 60 నుంచి 70 శాతం నీటి నిల్వలు చేరాయి. కొన్ని చోట్లయితే 50 శాతం కూడా దాటలేదు. చెరువులు పూర్తిగా నిండకపోతే ప్రజలకు తాగునీరందించే పరిస్థితే ఉండదు. ఇప్పుడున్న నీటితో 30 రోజులవరకే తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్ఛు ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేయాల్సి వస్తుంది. గ్రామాల్లోని మంచినీటి చెరువుల విస్తీర్ణం తక్కువగా ఉండటవ నీటి నిల్వలపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో వడు నాలుగు రోజుల్లో కాలువలు వసివేస్తే పూర్తి స్థాయిలో నీటి నిల్వలు చేసుకునే అవకాశం ఉండదని.. మరికొంత గడువు పెంచాలని గ్రామ పంచాయతీల అధికారులు కోరుతున్నారు. ఈమేరకు గ్రామీణ మంచినీటి సరఫరా శాఖాధికారులు కాలువలు కట్టివేసే గడువును పెంచి మరో వారం రోజులపాటు నీరందించాలని జలవనరుల శాఖ అధికారులకు విన్నవించారు.
పోడూరు మండలం పెనుమదంలో సమగ్ర మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన మంచినీటి చెరువు ఆ గ్రామస్థులతో పాటు రావిపాడు, వద్దిపర్రు, మట్టపర్రు, నేరేడుమిల్లి, కొంతేరు, ఊటాడ, కాజ తూర్పు, కాజ పడమర గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తుంది. దీనికి నరసాపురం ప్రధాన కాలువ నీరే ఆధారం. కాలువలు కట్టివేసిన సమయంలో అన్ని గ్రామాలకు కొద్ది రోజులు నీరందించాలంటే పూర్తిగా నీటితో నింపాలి. ప్రస్తుతం నరసాపురం కాలువ అడుగంటడంతో నీరొచ్చే పరిస్థితి లేదు. వచ్చే కొద్దిపాటి నీటిని ఇంజిన్లతో చెరువులోకి మళ్లిస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో చేరుకోలేదు.వేసవి వస్తే పట్టణవాసులు తాగునీటికి కలవరపడుతుంటారు. అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి. ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం అన్ని పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులను ప్రజలు అనుభవిస్తున్నారు. కాలువలపై ఆధారపడిన ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లి గూడెం, నరసాపురం మంచినీటి చెరువుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇక్కడ కాలువలు కట్టివేసిన రోజుల్లో ఒకపూట మాత్రమే మంచినీటి సరఫరా చేస్తుంటారు. ఉదాహరణకు పాలకొల్లు పురపాలక సంఘంలో రెండు మంచినీటి చెరువులకు నరసాపురం ప్రధాన కాలువ నీరే ఆధారం. ప్రతి వేసవిలో నీటి ఎద్దడి ఎదురుకాకుండా పూర్తిస్థాయి నీటి నిల్వలతో నింపుతారు. ఇప్పుడు నరసాపురం ప్రధాన కాలువలో సమృద్ధిగా నీరు లేకపోవడంతో వచ్చే కొద్దిపాటి నీటినే ప్రత్యేకంగా ఇంజిన్లు ఏర్పాటు చేసి మళ్లిస్తున్నారు. ఈ రెండు చెరువుల్లోని 336 మిలియన్‌ లీటర్ల సామర్థ్యం గల నిల్వ నీటిని పట్టణవాసులకు ప్రస్తుతం సరఫరా చేసే రెండు పూటలా రెండు గంటలపాటు అందించాలంటే 30 రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో కాలువలు కట్టివేసిన వెంటనే ఒకపూట మాత్రమే గంటసేపు నీటి సరఫరా చేసి 40 రోజుల వరకు సరిపెడుతుంటారు.