విజయవాడ, ఏప్రిల్ 2 (way2newstv.com)
తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య రాజకీయ లెక్క సరిపోయిందా? ప్రధాని పర్యటనలో లేవనెత్తిన ప్రశ్నలకు టీడీపీ వద్ద సమాధానం ఉందా?అంటే పాక్షికంగానే జవాబు వస్తోంది. ఇచ్చిన డబ్బులకు లెక్క అడిగినందుకే చంద్రబాబు నాయుడు దూరమయ్యారనేది బీజేపీ ఆరోపణ. ఇది ప్రజల్లో పెద్దగా నిలబడని విమర్శ. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన డబ్బులను ఏదో ఖాతాలో ఖర్చు పెడతారు. దానికి లెక్కలు చెప్పడం పెద్ద కష్టం కాదు. బీజేపీకి తెలుగుదేశంపై పెద్ద విమర్శలు చేయడానికి తగిన రాజకీయసామగ్రి లేకపోవడం వల్లనే ఈ ధోరణిని అనుసరిస్తున్నారేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది ఒకరకంగా టీడీపీకి ప్రయోజనం సమకూర్చే అంశమే. అదే సమయంలో బీజేపీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావం నెలకొనేలా ప్రచారం చేయడంలో తెలుగుదేశం సక్సెస్ సాధించింది. రాజకీయ కారణాలతోనే చంద్రబాబునాయుడు బీజేపీని పక్కనపెట్టారు. పక్కా ప్లాన్ తో ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర బాధిత రాష్ట్రంగా చూపించగలిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై సానుభూతి నెలకొనేలా, దాని ప్రభావం పార్టీకి విజయం సాధించి పెట్టేలా స్కెచ్ గీశారు చంద్రబాబు నాయుడు. దీనిని కనిపెట్టలేని కమలం పార్టీ సంప్రదాయ విమర్శలకే పరిమితమవుతోంది. తెలుగుదేశం మాత్రం అంతర్గత అజెండాను చక్కగా అమలు చేసుకోగలుగుతోంది.ఎన్నికలకు ఏడాది ముందుగానే మేలు కొంది తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర అసంతృప్తిని కనిపెట్టగలిగింది.
చంద్రబాబు వ్యూహాలతో..కమలం కల్లోలమే
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్లస్సులో ఉందని, వ్యతిరేకతనువినియోగించుకోగలుగు తుందని సర్వేల్లో తేలింది. అధికారంలో ఉండి ప్రభుత్వం ప్రజల నాడి పట్టుకోవడం అంత సులభం కాదు. 2014లో ప్రతిపక్షంలో ఉండటం వల్ల అనేక రకాల సమీకరణలు కలిసి వచ్చి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. అప్పట్లో వైసీపీ వైపు తీవ్రసానుభూతిపవనాలు వీస్తున్నాయి. అయినా రాష్ట్ర విభజన తెలుగుదేశానికి కలిసి వచ్చింది. సెంటిమెంటుతోపాటు అనుభవం ఉన్న నాయకుడనే ముద్ర చాలా లాభించింది. రెండోసారి అటువంటి సెంటిమెంటు ఫలించదు. ప్రత్యామ్నాయం ఆలోచించాలి. అందుకే కేంద్రంపై , బీజేపీపై పోరాటం రూపంలో కొంతసానుభూతి రాబట్టాలని చంద్రబాబు యోచించారు. నిజానికి కమలం పార్టీతో చంద్రబాబుకు ఎటువంటి విరోధం, ద్వేషభావం లేదని టీడీపీ నాయకులే అంగీకరిస్తారు. సీజన్డ్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే బీజేపీని దూరం పెట్టారు. రాష్ట్రం ముందడుగు వేయకపోవడానికి ఆ పార్టీనే కారణమని ఎత్తి చూపారు. కమలం పార్టీ ఏపీలో ప్రధానపక్షం కాదు. అందువల్ల దానిపై వ్యతిరేకత టీడీపీకి సానుకూలంగా మారేందుకు అవకాశాలు అంతంతమాత్రమే. దీనిని గమనించిన తర్వాతనే మరోసారి చంద్రబాబునాయుడు వ్యూహం మార్చారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రయోజనాలు పొందేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్ పెడితే 16 వేల కోట్ల రూపాయలు వస్తాయని తెలిసినా చంద్రబాబు వ్యూహాత్మకంగానే దానిని పక్కనపెట్టారు. ప్రత్యేకహోదా సెంటిమెంటు పండిస్తుందని గ్రహించి పొలిటికల్ అస్త్రంగా ప్రయోగించింది. బీజేపీ, వైసీపి, టీఆర్ఎస్ మూడూ కలగలిసిపోయాయని ప్రజల్లో బాగా ఎస్టాబ్లిష్ చేయకపోతే టీడీపీకి ప్రయోజనం ఉండదు. కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకతను రెచ్చగొట్టడంలో సక్సెస్ అయిన టీడీపీ దానిని వైసీపీకి అంటగట్టగలిగితేనే లక్ష్యం సాధించినట్లు చెప్పాలి. బీజేపీ అతి జాగ్రత్త, టీఆర్ఎస్ అత్యుత్సాహం కలగలిసి వైసీపిని ఇరుకున పెట్టేశాయి. దీనినే ఇప్పుడు ఎన్నికల ప్రచారాస్త్రంగా మలచుకుంటోంది టీడీపీ. రాష్ట్రంలో వైసీపీకి ఈసారి చాన్సులు ఎక్కువగా ఉన్నాయని రెండేళ్లక్రితం బీజేపీ కేంద్ర ఇంటిలిజెన్సు వర్గాల ద్వారా ఒక నిర్ధారణకు వచ్చింది. అప్పట్నుంచి వైసీపీ పట్ల కొంత సానుకూల ధోరణి తో వ్యవహరిస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఎంపీ అయిన తర్వాత కేంద్ర పెద్దలను మచ్చిక చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో అవసరం రావచ్చనే అంచనాతో బీజేపీ కూడా ప్రతిస్పందించడం ప్రారంభించింది. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లతో నేరుగా సమావేశం కాగల స్థాయిని, చనువును విజయసాయిరెడ్డి సాధించగలిగారు. అంతమాత్రాన తెలుగుదేశాన్ని దూరం చేసుకోవాలన్న ఆలోచన బీజేపీకి లేదు. జాతీయస్థాయిలో కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్న శివసేననే మచ్చిక చేసుకున్న కమలం పార్టీ వినయంగా ఉన్న టీడీపీని పక్కనపెట్టాలనుకోలేదు. వైసీపీతో సాన్నిహిత్యాన్ని సాకుగా చూపి టీడీపీనే బీజేపీని దూరం చేసింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ కూడా వైసీపి బలాన్ని తన బలంగా మార్చుకోవాలనే ఎత్తుగడతో ఆ పార్టీని మచ్చిక చేసుకోవాలని చూసింది. అది కూడా టీడీపీకి వరంగా మారింది.వారసత్వం భారతరాజకీయాలకు పట్టిన చీడగానే చూడాలి. తాము సంపాదించిన ఆస్తి తరహాలోనే పార్టీలను కూడా వారసులకు కట్టబెట్టాలని చూస్తున్నారు ప్రాంతీయపార్టీల అధినేతలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోడీ లేవనెత్తిన ఈ అంశం అంతా ఆలోచించాల్సిన విషయమే. అటు రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని సొంతం చేసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి. ఇటు తన తర్వాత పార్టీకి అధినేతగా లోకేశ్ కు పట్టం గట్టాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు. ఇద్దరూ స్వార్థపూరిత రాజకీయాలనే ఆశ్రయిస్తున్నారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో దివాలా తీయడంతో ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ తొలిసారిగా నలుగురు కుటుంబసభ్యులకు టిక్కెట్లు ఇచ్చేసింది. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్, భరత్ నలుగురూ సమీప బంధువులే. వీరంతా ఎన్నికల బరిలో ఉన్నారు. లక్షలాది కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఏళ్లతరబడి ప్రజాప్రాతినిధ్యం కోసం ఎదురుచూస్తుంటే టీడీపీ ఫస్టు ఫ్యామిలీ నాలుగు సీట్లలో తలపడటం విచిత్రంగానే కనిపిస్తుంది. ఎన్టీరామారావు తన వారసులను రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. అప్పటికే రాజకీయాల్లో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడులు పార్టీలో వచ్చి చేరి ఎదిగారు. ఇప్పుడు పనిగట్టుకుని కుటుంబ వారసులను ప్రవేశపెట్టే శిక్షణ కేంద్రంగా తెలుగుదేశం తయారైంది. ప్రధాని స్థాయిలో వీటిని లేవనెత్తడం సముచితమైన విమర్శే. చంద్రబాబునాయుడు భుజాలు తడుముకోవాల్సి వచ్చింది. బంధాల విలువ తెలియదంటూ టీడీపీ అధినేత తిప్పికొట్టేందుకు చేసిన ప్రయత్నం చాలా పేలవంగానే కనిపించింది. సమర్థతకు చోటు ఇవ్వకుండా వారసులకే పట్టం కడితే ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తులో కులాలకే పరిమితమై కుచించుకుపోవాల్సి వస్తుంది.