తెలంగాణలో గాడిలో పడని పాలన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణలో గాడిలో పడని పాలన

హైద్రాబాద్, ఏప్రిల్ 13, (way2newstv.com)
వైద్యఆరోగ్యశాఖ, పౌరసరఫరాల శాఖల్లో పాలన పడకేసింది. ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం ముఖ్యంగా కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు చేరువగా ఉండాల్సిన ఈ రెండు శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి విషయానికి ఎన్నికల డ్యూటీ అంటూ సాకులు చెప్పిన అధికారులు ప్రస్తుతం అవి ముగియడంతో ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యం, ప్రజా పంపిణీపై దృష్టిసారించాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.రాష్ట్రంలో కిరోసిన్‌ పక్కదారి పడుతున్నదనే ఆరోపణలున్నాయి. అధికారులు ఎన్నికల్లో మునగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మొత్తం 73.22, లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీరందరికీ ప్రభుత్వం నెలకు ఒక్కో లీటర్‌ చొప్పున 57.10 లక్షల లీటర్లను సరఫరా చేస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు ఉపయోగించే కిరోసిన్‌ను డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ విధంగా నల్లబజారుకు తరలిన కిరోసిన్‌ను కొంతమంది పెట్రోల్లో కల్తీకి వినియోగిస్తున్నట్టుగా తెలుస్తున్నది. అడపాదడపా పెట్రోల్‌ బంక్‌లపై దాడి అంటూ తనిఖీలు చేసి, తాము పనిచేస్తున్నామని రికార్డుల్లో గణాంకాలు చూపుతున్నారని పౌరసరఫరాల శాఖ అధికారులపై ఫిర్యాదుల ఉన్నాయి. 


తెలంగాణలో గాడిలో పడని పాలన

మార్కెట్లో ఇతర సరుకుల కొనుగోళ్లు, తూకంలో తక్కువై వినియోగదారులు నష్టపోతున్నా సంబంధిత అధికారులు దృష్టిసారించడంలేదు. మామూళ్లు తీసుకోవడం తప్ప ప్రజలకు నాణ్యమైన పెట్రోల్‌, తూకంలో సరైన సరుకు లభించేలా చర్యలు తీసుకోవడం లేదు. నిత్యావసర వస్తువుల కల్తీ విషయంలోనూ ఎన్నికల ఎఫెక్ట్‌ కనిపిస్తున్నది. వంటనూనెలు, పాలు, ఇతరత్రా సరకుల విషయంలో కల్తీ భారీగా పెరిగిందనే విమర్శలున్నాయి. ఎన్నికల సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వాస్పత్రుల్లో ఇంజక్షన్లు, సిరంజిలు, దూది, వాటికి పూసే మందు, సెలైన్లు, ట్యాబ్లెట్లు అందుబాటులో ఉండటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో ఉండే ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లోనే కాదు.. మెడికల్‌ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ వంటి ప్రధాన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. రాష్ట్రంలో టీచింగ్‌, వైద్య విధాన పరిషత్‌, ప్రజారోగ్య ఆస్పత్రులకు అవసరమైన మందులు, సర్జికల్‌ వస్తువుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. సిరంజీలు, గ్లౌవ్స్‌, దూది, బ్లేడ్లు, బ్యాండేజీ, కత్తెరలు ఇలా వందలాది సర్జికల్‌ వస్తువులు ఆస్పత్రులకు నిత్యం అవసరం. ఇవేవీ లేకుండా కనీస ప్రాథమిక వైద్యం చేయడం కష్టం. ఇలాంటి ముఖ్యమైన వస్తువులు కూడా ఆయా ఆస్పత్రుల్లో కరువయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో చేసేదిలేక రోగులు బయట నుంచి కొనుగోలు చేస్తూ వైద్యం చేసుకుంటున్నారు. వీటిని సరఫరా చేయాల్సిన అధికారగణం ఎన్నికల సాకుతో పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రుల్లో మందులతోపాటు ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేయాలంటే సంబంధిత మెడికల్‌ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కు ఇండెంట్‌ సమర్పించాలి. దాని ప్రకారం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ టెండర్ల ద్వారా వాటిని కొనుగోలు చేసి ఆస్పత్రులకు సరఫరా చేస్తుంది. కానీ ఎన్నికల నేపథ్యంలో వీటిపై అధికారులు దృష్టిసారించడంలేదు. కొంతమంది అధికారులు ఇండెంట్‌ సమర్పించినా వాటిని కొనగోలు చేయాల్సిన సంబంధిత విభాగం అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ కోసం బడ్జెట్లో నిధులు భారీగానే కేటాయించింది. మందుల కోసం రూ.320 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. సర్జికల్స్‌ కోసం రూ.185 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు రూ.55 కోట్లు వెచ్చించారు. అందులో టీచింగ్‌ ఆస్పత్రుల నుంచి రూ.45 కోట్లు, టీవీవీపీ, డీహెచ్‌ ఆస్పత్రుల రూ.90 కోట్లకు ఇండెంట్‌ పంపారు. కానీ, సంబంధిత అధికారులు వీటిని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మందులు, సర్జికల్స్‌ ఐటమ్స్‌ను అవసరమైన ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.