హైద్రాబాద్, ఏప్రిల్ 13, (way2newstv.com)
తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 75శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 63శాతం మాత్రం పోలింగ్ జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ పరిధిలోని మూడు లోక్ సభ స్థానాలైన సికింద్రాబాద్, దేశంలోనే పెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి, హైదరాబాద్ లలో 40శాతంలోపే పోలింగ్ నమోదు కావడంతో టీఆర్ఎస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోందట. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 16 ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించాడు. కానీ ప్రస్తుతం తెలంగాణలో సైలెంట్ ఓటింగ్ తర్వాత టీఆర్ఎస్ కు 10సీట్లకు మించి వస్తాయా రావా అన్న అంచనాకు వస్తున్నారట.ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఈసారి ‘వాయిలెంట్ పోలింగ్’ జరిగింది. ఈవీఎంల మొరాయింపులు, టీడీపీ, వైసీపీ దాడులు.. ప్రతిదాడులు, విధ్వంసాలు వంటి బీభత్సమైన వాతావరణంలో ఎన్నికలు దారుణంగా ముగిశాయి. అదే తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఒకటి రెండు చోట్ల తప్పితే అస్సలు ఈవీఎంలు మొరాయించలేదు.
సైలెంట్ పోలింగ్ తో గులాబీ టెన్షన్
పార్లమెంట్ ఎన్నికలను జనాలు లైట్ తీసుకోవడంతో మిట్ట మధ్యాహ్నం వేళ పోలింగ్ కేంద్రాల్లో జనాలే లేకుండా పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణాలో ‘సైలెంట్ పోలింగ్’ జరిగింది. అది కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది.తెలంగాణలో ఇటీవల డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. ఇప్పుడు పోలింగ్ శాతం బాగా తగ్గడంతో కాంగ్రెస్, బీజేపీలకు కలిసి వస్తుందని ఆ రెండు పార్టీలు కనీసం ఐదు లేదా ఆరు సీట్లలో గెలువవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ కి ఎదురు దెబ్బే అని తేల్చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చాలా మంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయలేదు. పైగా డబ్బు, మద్యం లాంటి ప్రవాహాలు తెలంగాణలో జరగలేదు. దీంతో గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఓటర్లు చాలామంది ఈసారి నిరాసక్తతతో ఓటు వేయలేదని తెలుస్తోంది. మరోవైపు యాంటి ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటేశారంటున్నారు. అందుకే పోలింగ్ శాతం తగ్గడం తమకు కలిసివస్తుందని బీజేపీ కాంగ్రెస్ లు భావిస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం.. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం లేదా భువనగిరిలల్లో గులాబీ పార్టీ గెలుపు అంత ఈజీ కాదని విశ్లేషణలు సాగుతున్నాయి. చూడాలి మరి ఫలితాలు ఎలా వెలువడనున్నయో!