బాసర, ఏప్రిల్ 15 (way2newstv.com):
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ వేసవి చుక్కలు చూపిస్తోంది. భక్తుల సౌకర్యార్థం కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు లేక, తాగునీరు కరవై వేసవి తాపానికి అలమటిస్తున్నారు. స్వయంగా దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశించినా భక్తులకు సౌకర్యాలు కల్పించటంలో ఆలయాధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు.బాసర సరస్వతీ ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవి ఆరంభానికి ముందే ఆలయ ఆవరణ మొత్తం చలువపందిళ్లు ఏర్పాటు చేసేవారు. వేసవిలో ఆలయానికి భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎండవలన ఇబ్బందులు కలగకుండా పందిళ్లను వేసేవారు. అయితే ఈ సంవత్సరం ఆలయంలో చలువపందిళ్లు వేయలేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలనే చలువపందిళ్లు వేయటం వీలుకాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లపై నిషేధం అమలులో ఉన్నందున టెండరు వేయటం సాధ్యంకాలేదని అధికారుల వాదన. అయితే ఆలయంలో అత్యవసరాల పేరిట ఎన్నింటినో టెండరు లేకుండానే కొనుగోలు చేస్తారు. గతంలో రూ.లక్షల విలువైన పనులను టెండర్లు లేకుండానే చేపట్టిన ఘనత అధికారులకు ఉంది.
అమ్మచెంతన దాహం కేకలు (ఆదిలాబాద్)
భక్తుల సౌకర్యానికి వచ్చేసరికి మాత్రం అధికారులకు నిబంధనలు గుర్తొచ్చాయి. చలువపందిళ్ల ఏర్పాటుకు లక్షల రూపాయల ఖర్చేమీ కాదు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారం సాధ్యమే. ఆలయానికి ఆదాయం వచ్చే దుకాణాల టెండర్లను ఇటీవల నిర్వహించి రూ.3.50 కోట్ల ఆదాయం పొందిన ఆలయానికి భక్తులకు సౌకర్యాల కల్పన దగ్గరికి వచ్చేసరికి నిబంధనలు అడ్డువస్తున్నాయి.నిబంధనలు అడ్డువచ్చి చలువపందిళ్లు వేయలేని అధికారులు చలివేంద్రాల విషయంలో నిర్లక్ష్యమే ప్రదర్శిస్తున్నారు. ఆలయంలో భక్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఇటీవల (మార్చి 29న) ఆలయ ఈవో సంధ్యారాణి నాలుగు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటులో చూపించిన ఉత్సాహం నిర్వహణలో చూపకపోవటంతో చలివేంద్రాలు భక్తుల అవసరాలను తీర్చటం లేదు. నామమాత్రంగా ఏర్పాటుచేసి మమ అనిపించారు. ఇటీవల ‘న్యూస్‌టుడే’ చలివేంద్రాలను పరిశీలించగా ఒక్కదానిలో మాత్రమే భక్తులకు తాగునీరు లభ్యమవుతుంది. మిగతా మూడింటిలో నీరు లేదు, సిబ్బంది లేరు. క్యూలైన్‌లలో ఏర్పాటు చేసినా చలివేంద్రంలో శునకాలు కునుకు తీస్తున్నాయి. వేసవి తీవ్రత పెరిగి దాహానికి అల్లాడుతున్న భక్తులకు ఆలయంలో ఉపశమనమే లభించటం లేదు. తాగునీటిని ప్రైవేట్ హోటళ్లలో ఖరీదు చేయాల్సిందే. భక్తుల వలన రూ.కోట్ల ఆదాయం లభిస్తున్నా సౌకర్యాలు కల్పించటంలో అధికారులు విఫలమవుతున్నారు.గత నెలలో ఆలయాన్ని సందర్శించిన దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ భక్తులకు అందుతున్న సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకుని భక్తులకు సేవలందించాలని ఆలయాధికారులను ఆదేశించారు. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే ఆయన ఆదేశాలను అధికారులు పాటించలేదు. నామమత్రంగా చలివేంద్రాలను ఏర్పాటుచేసి చలువపందిళ్ల విషయం ఎన్నికల కోడ్‌కి ముడిపెట్టారు. ఆలయ ఆవరణలో నీడలేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. పైన ఎండతో, కింద నేలపై (రాళ్లతో వేసిన నేల) చెప్పులు లేకుండా వేడిగా మారిన ఉపరితలంపై నడవలేక కష్టాలు పడుతున్నారు. మరోవైపు అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులు సైతం ఎండకు తాళలేక, నడవలేక అవస్థలు పడుతున్నారు. ఈ నెలతో పాటు వచ్చే మే నెలలో వివిధ పరీక్షల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ రెండు నెలలు అక్షరాభ్యాసానికి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారు. ఈలోగా సమస్యలను పరిష్కరించి భక్తులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది.