అడుగంటిపోతోంది.. (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడుగంటిపోతోంది.. (నిజామాబాద్)

నిజామాబాద్, ఏప్రిల్ 08 (way2newstv.com): 
రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. దీంతో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు   అడుగంటుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే జల కష్టాలు మొదలు కానున్నాయి. ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటి  నిల్వలు డెడ్‌స్టోరేజీని దాటడంతో మిషన్‌ భగీరథ పథకానికి సైతం త్వరలో నీటి సరఫరా నిలిచిపోనుంది. సింగూరు పూర్తిస్థాయి నీటి మట్టం 523.60 మీటర్లు 29.90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 512.115 మీటర్లు 1.40 టీంఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు 17.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1376.00 అడుగులతో 0.80 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గత నాలుగు నెలల నుంచి సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగీరథకు ఉదయం, సాయంత్రం నీటిని సరఫరా చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో నెల రోజుల నుంచి ఒక్క పూట మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. మరో పది రోజుల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నట్లు మిషన్‌ భగీరథ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు.


అడుగంటిపోతోంది.. (నిజామాబాద్)

జిల్లాలోని 516 గ్రామాలకు గాను 341 పల్లెల్లో తాగునీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉన్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు తెలిపారు. సింగూరు ద్వారా త్వరలోనే నీటి సరఫరా నిలిచిపోనుండంతో ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 0.80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం ముదురుతున్న ఎండలతో పాటు ప్రాజెక్టు నుంచి రోజూ లీకేజీ రూపంలో సుమారు 35 నుంచి 50 క్యూసెక్కుల నీటి నిల్వ తగ్గుతోంది. ఈ లెక్కన నెల రోజుల్లో 0.80 టీఎంసీల నీరు కాస్త 0.50కు పడిపోయే అవకాశం ఉంది. ఈ నీటిని బోధన్‌, నిజామాబాద్‌ నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు నిల్వ ఉంచారు. 0.50 టీఎంసీల నీటిని ప్రధాన కాల్వ ద్వారా బెల్లాల్‌, అలీసాగర్‌ చెరువులోకి విడుదల చేస్తే 0.20 టీఎంసీల నీరు చేరే ఆస్కారం ఉంది. ఈ లెక్కన బోధన్‌, నిజామాబాద్‌ నగరవాసులకు సైతం తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.   * అలీసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 304.00 ఎంసీఎఫ్‌టీలు కాగా, ప్రస్తుతం 160.745 ఎంసీఎఫ్‌టీలు ఉంది. బెల్లాల్‌ చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం 346.00 ఎంసీఎఫ్‌టీలు కాగా, ప్రస్తుతం 143.99 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఉన్న నీరు ఏప్రిల్‌ ఆఖరు వరకు సరిపోతుందన్నది అధికారుల అంచనా.  మరి ఈ లెక్కన మే, జూన్‌ మాసాల్లో  తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా నీటి పారుదల శాఖ, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు నీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.