స్మార్ట్ చదువులు (విశాఖ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్మార్ట్ చదువులు (విశాఖ)

విశాఖపట్నం, ఏప్రిల్ 08(way2newstv.com): 
సర్కారు పాఠశాలల్లో స్మార్ట్‌ తరగతులు మొదలయ్యాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యను అందిస్తున్నారు. చెట్ల కింద చదువులు లేవు. అదనపు తరగతి గదులు అందుబాటులోకి వచ్చాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్యపుస్తకాలు అందుతున్నాయి. మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. ప్రైవేటు పాఠశాలలను వదిలి ఈ ఏడాది 15,052 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. విద్యతోనే అభివృద్ధి ముడిపడి ఉండడంతో సర్కారు విద్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. రూ.వేల కోట్లతో ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. నల్ల బల్లలతో చేసే బోధన స్థానంలో తెరపై పాఠాలను పరిచయం చేసింది. అంతంత మాత్రంగానే కంప్యూటర్‌ బోధన స్థానంలో వర్చువల్‌ తరగతులను ప్రవేశపెట్టింది. మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. అదనపు గది నుంచి పాఠశాల ప్రహరీ వరకు అన్ని రకాల సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ఫలితంగా రెండేళ్ల నుంచి ప్రైవేటు పాఠశాలలు విడిచి సర్కారు పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడమే ఇందుకు ఉదాహరణ. 


స్మార్ట్ చదువులు (విశాఖ)

ఆడపిల్లలు మధ్యలోనే చదువు మానేయకుండా ఉండేలా బడికోస్తా పథకాన్ని ప్రవేశపెట్టారు. తొమ్మిదో తరగతి చదివే ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది తొమ్మిదితో పాటు ఎనిమిదో తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లను అందుబాటులోకి తేవడంతో ఆడపిల్లల ముఖంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.జిల్లాలో 4,084 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలున్నాయి. వీటిలో 371 పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కోమటి జయరామ్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రుల కమిటీల ద్వారా వీటికి నిధులను సమకూర్చారు. వీటితో కంప్యూటర్‌, తెరలు, ప్రొజెక్టర్లను పాఠశాలలకు అందించి నిర్వహణ కోసం ప్రత్యేకంగా నోడల్‌ బృందాన్ని నియమించారు. ప్రాథమిక పాఠశాలల్లోనూ వీటిని ప్రవేశపెట్టడంతో చిన్నారులు ఈ తెర పాఠాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. మరో 178 పాఠశాలల్లో వర్చువల్‌ తరగతులను ప్రారంభించారు. ఇందుకోసం మధురవాడకు సమీపంలోని చంద్రంపాలెం పాఠశాలల్లో ప్రత్యేకంగా స్డూడియో నిర్మించారు.ప్రభుత్వ పాఠశాలలను మరింత పరిపుష్టి చేయాలని సర్కారు సంకల్పించింది. దీనికోసం హైబ్రీడ్‌ యాన్యుటీ మెథడ్‌ అమలులోకి తెచ్చింది. ప్రభుత్వం ముందుగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేకుండా గుత్తేదారుతోనే మౌలిక సదుపాయాలపై నిధులు వెచ్చించే ఈ ప్రాజెక్టుకు ఇటీవలే మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని పాఠశాలలో మౌలిక సదుపాయాలకు రూ.291 కోట్లు వెచ్చించనున్నారు. అదనపు గదుల నుంచి మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, ఫర్నీచర్‌ అన్నింటికీ ఈ నిధులనే వెచ్చించనున్నారు.