తిరుపతి, ఏప్రిల్ 20 (way2newstv.com):
రాష్ట్రంలోనే మొదటిసారిగా.. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఆధునిక సాంకేతికతతో జిల్లాలోని రోగులకు వైద్యసేవలను అందిస్తున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన అపోలో హాస్పిటల్స్ పర్యవేక్షణలో 2016 అక్టోబర్‌లో తిరుపతిలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఆరోగ్య కేంద్రాలు పేదలకు అందుబాటులో ఉంటూ సేవలతోపాటు వైద్య పరీక్షలను, రోగనిరోధక టీకాలను అందిస్తూ ఆదరణను పొందుతున్నాయి. రెండున్నర ఏళ్లలో 3.36 లక్షల మంది వైద్యసేవలు పొందారు. దేశంలోనే మొదటి సారిగా ఏపీలో ఎలక్ట్రానిక్-ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను తిరుపతి నగరంలో అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం వీటిని ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలుగా మార్చి పేదవారికి సాధారణ వ్యాధులకు వారి సమీపంలోనే ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తిరుపతితోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు సాధారణ వ్యాధులకు చికిత్సకోసం ప్రభుత్వ రుయా, స్విమ్స్‌కు వెళ్లకుండా స్థానికంగానే ఉంటూ వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలను నగరంతోపాటు, తిరుపతి గ్రామీణ పరిధిలో ఏర్పాటు చేశారు.
అందరికీ వైద్యం (చిత్తూరు)
ప్రస్తుతం ఈ కేంద్రాలు బైైరాగిపట్టెడలోని మున్సిపల్ పార్క్ పక్కన, నెహ్రూనగర్‌లో స్విమ్స్ హాస్పిటల్‌కు ఎదురుగా, స్కావెంజర్స్‌కాలనీ, లక్ష్మిపురంలోని పీఎన్‌టీ కాలనీ, ఆటోనగర్, శివజ్యోతినగర్, లీలామహల్ సమీపంలోని ఎర్రమిట్ట, గాంధీరోడ్డు చివరన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వద్ద సేవలు అందిస్తున్నాయి.ఆరోగ్యకేంద్రంలో సాధారణ జబ్బులైన జ్వరం, నొప్పులు, డయేరియా వంటి సాధారణ వ్యాధులతోపాటు మలేరియా, డెంగీ, టీబీ వంటి వాటికి చికిత్సలను అందిస్తారు. ఉచితంగా 28రకాలైన వైద్యపరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో గుండె, మూత్రపిండాలు, లివర్ వంటి వ్యాధులకు పరీక్షలు చేస్తారు. ఇటీవల మలేరియా, డెంగీ, టీబీ పరీక్షలను ఈ కేంద్రంలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. రోగి వ్యాధినిర్ధారణ పరీక్షలను పరిశీలించిన అనంతరం వైద్యుడే చికిత్స అందించగలిగితే ఇక్కడే సేవలు అందించి మందులను ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏదైనా తీవ్రమైన జబ్బు ఉంటే అపోలో టెలీమెడిసిన్ ద్వారా వారి సూపర్‌స్పెషాలిటీ వైద్యులు.. జనరల్ మెడిసిన్ కింద ప్రతిరోజు, ఎముకలు, ఎండోక్రైనాలజీ, గుండెవ్యాధుల వారిని రెండు పర్యాయాలు వైద్యసలహాలను అందిస్తారు. అవసరమైతే మెరుగైన వైద్యచికిత్సల కోసం పెద్దప్రభుత్వ ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు.సాధారణ వ్యాధులకు చికిత్సలను అందించడంతోపాటు సూపర్‌స్పెషాలిటీ వైద్యనిపుణుల సలహాలను అందిస్తుండడంతో ఓపీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు తిరుపతిలోని ఎనిమిది ఆరోగ్యకేంద్రాల్లో దాదాపు 3.36 లక్షల మంది వైద్యసేవలను పొందారు. సూపర్‌స్పెషాలిటీ వైద్యనిపుణుల సలహాలను టెలీ కన్సల్టెన్సీ ద్వారా దాదాపు 36 వేల మంది అందుకున్నారు. దాదాపు లక్ష మంది వివిధ పరీక్షలను కేంద్రంలోని ల్యాబ్‌లలో చేయించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.