నెల్లూరు, ఏప్రిల్ 4 (way2newstv.com):
నవ్యాంధ్రప్రదేశ్‌లో గ్రామీణ రహదారులకు పెద్దపీట పడింది. బురద తొక్కనేల.. కాలు కడగ నేల.. అన్న సామెత గ్రామాల్లో మాయమైనంత పరిస్థితి తెచ్చి పెట్టింది. ఎక్కడ చూసినా సీసీ రహదారులు దర్శనమిస్తున్నాయి. 2015లో చంద్రన్న బాట పేరిట తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో గత నాలుగేళ్లలో అనేక గ్రామాల్లో రూ. కోట్లు వెచ్చించి సీసీ రోడ్లు వేశారు. ఏ మారుమూల పల్లెల్లోనూ బురద రోడ్డు కన్పించదంటే అతిశయోక్తి కాదు.. ఇలా జాతీయ ఉపాధి హామి పథకం.. ఇతర సాధారణ నిధులు, ఎంపీ నిధులు, ప్రాంతీయ అభివృద్ధి నిధులు సద్వినియోగించుకుని వందల కిలోమీటర్లు సీసీ రహదారులు వేయించింది ప్రభుత్వం. దీంతో ఎక్కడా మట్టిలో అడుగు పెట్టే పరిస్థితి గ్రామాల్లో కన్పించడం లేదు.జిల్లాలో 10 నియోజకవర్గాల్లోని 940 గ్రామ పంచాయతీల్లో సీసీ రహదారులు పెద్దఎత్తున వేశారు. చంద్రన్నబాట కార్యక్రమం ప్రారంభంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మాత్రమే సీసీ రహదారులు వేయించారు. ఆ తర్వాత విడతల్లో బీసీ, ఓసీ కాలనీల్లో సీసీ రహదారుల నిర్మాణం పూర్తి చేశారు.
పల్లె దారి రహదారి (నెల్లూరు)
గత రెండేళ్లలో కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టగా 1,500 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. గ్రౌండ్ అయిన పనుల్లో 593 కిలోమీటర్లు వివిధ దశల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సద్వినియోగించుకున్నారు. జాతీయ ఉపాధి హామి నిధులు పక్కాగా ఉపయోగించుకుని శాశ్వత పనులు చేపట్టడంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలిగింది. గతంలో ఏ ప్రజాప్రతినిధి.. అధికారి ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినా వీధులు చూడండయ్యా.. అనే పరిస్థితులు పూర్తిగా దూరమవడం గమనార్హం. కావలి నుంచి తడ వరకు 46 గ్రామీణ మండలాల్లో చంద్రన్నబాట ద్వారా గ్రామసీమలు వెలుగులీనుతున్నాయి. ఇక్కడ ప్రతి రహదారి సుందరంగా తయారైంది. ఎక్కడా బురద కన్పించని పరిస్థితి నెలకొంది. గతంలో బురద, మట్టితో ఉన్న గ్రామాల్లో రాకపోకలకు పాదచారుల అవస్థలు దూరమయ్యాయి. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా రహదారులు తళుక్కున మెరిసే పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంత పెద్దఎత్తున నిర్మాణం చేపట్టడంలో ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది. కొన్ని ప్రాంతాల్లో రహదారి విస్తరణ సమస్యలు వచ్చినా వారే స్వయంగా వెళ్లి విస్తరించి రహదారులు వేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఉదాహరణకు పెళ్లకూరు మండలం కొత్తూరు బీసీ కాలనీలో గ్రామస్థులు అంతా ఏకమై రహదారి విస్తరించి సీసీ వేయించారు.