ప్రకటనలకే పరిమితం (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకటనలకే పరిమితం (నిజామాబాద్)

నిజామాబాద్, ఏప్రిల్ 4 (way2newstv.com): భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, సత్వర సేవలు అందించేందుకు తహసీల్‌ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. గతేడాది మే 19న ఎంపిక చేసిన మండలాల్లో ధరణి  వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కానీ ఆలనా పాలనా గురించి పట్టించుకునే వారు లేక సేవలు మరుగున పడ్డాయి.
భూముల క్రయ విక్రయాలు, ఇతర రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మండలానికో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ప్రారంభించి రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా బాల్కొండను ఎంపిక చేసి తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు తీసుకొచ్చారు. ధరణి వెబ్‌సైట్‌ను జిల్లా పాలనాధికారి రామ్మోహన్‌రావు ప్రారంభించారు. మరో 20 మండలాల్లో జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభించాలని నిర్ణయించారు. 


ప్రకటనలకే పరిమితం (నిజామాబాద్)

కానీ ఎక్కడా అడుగులు పడలేదు. తహసీల్దారు సబ్‌ రిజిస్ట్రార్‌గా సేవలు అందిస్తున్నా.. దస్తావేజులను కంప్యూటర్‌లో నమోదు చేయడానికి ఆపరేటర్‌ను నియమించ లేదు. క్రయ విక్రయాలు చేసే వారి వేలిముద్రలు తీసుకోవడానికి సైతం ఎవరూ లేక సీనియర్‌ అసిస్టెంటు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయ పనులకు తోడు ధరణి పనులు చూడాల్సి రావడంతో పని భారం పెరిగిపోయింది.బాల్కొండలో కంప్యూటర్‌, వేలిముద్రలు తీసుకునే యంత్రం, ఐరిష్‌ యంత్రం, ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. ఇతర సౌకర్యాలు మరిచారు. దీనికి తోడు దస్తావేజు పనులు చేయడానికి రెవెన్యూ కార్యాలయ సిబ్బందికి శిక్షణ అందించలేదు. తహసీల్దార్లకే తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చారు. దీంతో సిబ్బందికి సరైన అవగాహన లేక ప్రైవేటు వ్యక్తులతో దస్తావేజు పనులు చేయిస్తున్నారు. అది కూడా మొక్కుబడి తంతుగా నెమ్మదిగా సాగుతోంది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు, సేల్‌డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌, మార్ట్‌గేజ్‌ డీడ్‌, రిలీజ్‌ డీడ్‌, వివాహ రిజిస్ట్రేషన్లు, పార్టీషన్‌ డీడ్‌ తదితర సేవలు అందించాల్సి ఉంటుంది. గతంలో బాల్కొండ మండలానికి చెందిన వారు ఈ సేవలు పొందటానికి ఆర్మూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లేవారు. బాల్కొండ తహసీల్‌ కార్యాలయంలో విభాగం ప్రారంభించడంతో ఇక్కడివారు సంబరపడ్డారు. కానీ వారి సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు. సిబ్బంది లేక పోవడంతో దస్తావేజులు ఆలస్యంగా సాగుతున్నాయి. సకాలంలో దస్తావేజులు సిద్ధం కాక సంబంధీకులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ తహసీల్‌ కార్యాలయంలో సైతం ఇదే పరిస్థితి. అక్కడి ఉద్యోగులు ఈ పని చేయడం తమవల్ల కాదని చేతులెత్తేశారు.