30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం


విజయవాడ, మే 24, (way2newstv.com
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమయింది. ఈ నెల 30న జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రేపు వైసీపీ శాసనసభా పక్షం సమావేశమై జగన్ ను తమ నేతగా ఎన్నుకుంటారనీ, అనంతరం తామంతా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుస్తామని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కాగా, జగన్ ప్రమాణస్వీకార వేదికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయాలని జగన్ భావించారు. అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుందని అధికారులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని చినఅవుటపల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.ప్రమాణస్వీకార కార్యక్రమానికి కనీసం 5 నుంచి 7 లక్షల మంది హాజరు అవుతారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 


30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం
ఈ నేపథ్యంలో కనీసం 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయాలని జగన్ వైసీపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం.జగన్ తో అధికారుల భేటీ వైసీపీ అధినేత, ఏపీ కాబోయే సీఎం జగన్ నివాసం వద్ద భారీ కోలాహలం కనిపిస్తోంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఈ ఉదయం 23 ప్రభుత్వ శాఖలకు చెందిన 57 మంది అధికారులు తరలివెళ్లారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఉన్నారు. జగన్ ను మర్యాదపూర్వకంగా పలకరించిన అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వివరాలను జగన్ కు అందజేశారు. జగన్ అందరు అధికారులతో సావధానంగా మాట్లాడారు.కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటినుంచి జగన్ క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఆయనను కలిసి విషెస్ చెప్పేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. అందరినీ కలుస్తూ, అభినందనలు స్వీకరిస్తూ జగన్ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆయన ఈనెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.అమరావతిలో నేమ్ ప్లేట్స్ తొలగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. నిన్న చంద్రబాబు రాజీనామాతో, టీడీపీ ప్రభుత్వం రద్దు కాగా, సచివాలయంలోని మంత్రుల చాంబర్ల ముందున్న నేమ్ ప్లేట్స్, చాంబర్లలోని చంద్రబాబు ఫోటోలను తొలగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. దీంతో అధికారులు వాటిని తొలగించే పనులను నేడు ప్రారంభించారు. జీఏడీ ఆదేశాలతో అన్ని గదుల ముందున్న నేమ్ ప్లేట్స్, చంద్రబాబు, ఎన్టీఆర్ ల చిత్ర పటాలను తొలగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాతనూతనంగా వచ్చే మంత్రుల పేర్లతో నేమ్ ప్లేట్స్ రాయిస్తామని అధికారులు వెల్లడించారు. కోలాహలంగా జగన్ నివాసం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇంటివద్ద కోలాహలం నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాస గృహానికి నాయకులు, అధికారులు క్యూ కడుతున్నారు. ఈనెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధినేతను కలిసి అభినందనలు అందజేస్తున్నారు. జగన్‌ను కలిసిన వారిలో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు పార్టీ ప్రతినిధులు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక అధికారుల రాకతో జగన్‌ నివాసం వద్ద సందడి నెలకొంది. టీటీడీ ఈవో, వేదపండితులు కలిసి వేదాశీర్వచనం అందించారు.స్పెషల్ ఆఫీసర్ గా జోషి రాష్ట్రంలో అఖండ విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భద్రత కోసం ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఈనెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అమర్లపూడి జోషిని పోలీసు శాఖ నియమించింది. దీంతో జోషి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.