కర్నూలుకు నీటి కటకటే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలుకు నీటి కటకటే

పది రోజుల తర్వాత ఇబ్బందే
కర్నూలు, మే 14, (way2newstv.com)
కృష్ణ్ణానది ఒట్టిపోయింది. కృష్ణానది దాని ఉపనదులపై ఉండే జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటాయి. ఫలితంగా కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తాగునీటికీ సమస్యగా మారింది. ప్రస్తుతం సుంకేసుల నుంచి రోజూ కర్నూలు నగర తాగునీటి అవసరాల కోసం 100 క్యూసెక్కులను వదులుతున్నారు. ఇలాగే వదిలితే మరో 10 రోజుల్లో రిజర్వాయర్‌ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. సుంకేసులలో నీటి నిల్వలు అడుగంటిపోతే కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు ఏర్పడుతుంది. గతేడాది తుంగభద్ర, కృష్ణానదుల్లోకి ఆగస్టులో నీటి ప్రవాహాలు మొదలయ్యాయి. ఈ యేడాది కూడా వర్షాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల నిండితే తప్ప శ్రీశైలంలోకి నీరు చేరే అవకాశం లేదు. ఒకవేళ వర్షాలు వచ్చినా ఆగస్టు దాకా నీరు రాకపోతే కృష్ణానదిపై ఆధారపడిన తాగు, సాగునీటి ప్రాజెక్టులన్నీ ఇబ్బంది పడక తప్పని పరిస్థితి ఉంది. ప్రభుత్వం రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాలు నిర్వహించకుండా చివరి వరకు వాడుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణానదిపై ఉండే ప్రధాన రిజర్వాయర్‌ శ్రీశైలంలో కనీస మట్టానికి దిగువకు నీటి నిల్వలు పడిపోయాయి. 


 కర్నూలుకు నీటి కటకటే

శ్రీశైలం డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్య 855 అడుగులు కాగా ప్రస్తుతం 799.99 అడుగులే ఉంది. టిఎంసిల ప్రకారం చూసినప్పుడు మొత్తం 215 టిఎంసిలకుగాను 28.94 టిఎంసిలు మాత్రమే నీరు అందుబాటులో ఉంది. రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే కృష్ణానదికి ఉపనది అయిన తుంగభద్ర డ్యాంలో సైతం నీటిమట్టం పూర్తిగా అడుగంటి పోయింది. ప్రస్తుతం తుంగభద్రలో కేవలం 100.2 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 2.62 టిఎంసిలు మాత్రమే ఉంది. శ్రీశైలంలో మరో 7 టిఎంసిలు మాత్రమే వాడుకోడానికి అవకాశం ఉంది. అది కూడా రాయలసీమ జిల్లాలకు కాకుండా దిగువ నాగార్జున సాగర్‌లోకి విడుదల చేసి వాడుకోవాల్సిందే తప్ప నేరుగా తీసుకునే పరిస్థితి లేదు. రాయలసీమ జిల్లాలకు శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలంటే రిజర్వాయర్‌లో 810 అడుగులు ఉంటేనే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే 800 అడుగుల దిగువకు పడిపోవడంతో రాయలసీమ జిల్లాలకు నీటిని తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాదితో పోలిస్తే తుంగభద్రలో నీరు మెరుగ్గానే ఉంది. తుంగభద్ర నుంచి నీరు విడుదల చేసినా అది ఆంధ్ర సరిహద్దులోకి రాకముందే కర్ణాటకలోని రైతులు అక్రమంగా వాడుకునే అవకాశం ఉంది. కర్నూలు తాగునీటి అవసరాలు తీర్చే సుంకేసులలో సైతం నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. సుంకేసుల సామర్థ్యం 1.2 టిఎంసిలకు గాను ప్రస్తుతం 0.24 టిఎంసిలు మాత్రమే అందుబాటులో ఉంది. శ్రీశైలానికి దిగువన నాగార్జున సాగర్‌, పులిచింతల రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు అట్టడుగునే ఉన్నాయి. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతం 136 టిఎంసిలు ఉన్నాయి. ఈ నీళ్లన్నీ దాదాపు డెడ్‌స్టోరేజీలోనే తీసుకునేందుకు వీలు కాని పరిస్థితి ఉంది. పులిచింతల రిజర్వాయర్‌లో కేవలం 1.61 టిఎంసిలు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది 4.22 టిఎంసిలు ఉండేది. మొత్తంగా కృష్ణా నదిపై ఉండే రిజర్వాయర్‌లన్నింటిలో నీటిమట్టాలు పూర్తిగా అడుగంటి పోవడంతో నదిలో కూడా కనీసం తేమ లేకుండా ఇసుక తిన్నెలతో ఒట్టిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.