గులాబీ, కమలం మధ్య గ్యాప్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గులాబీ, కమలం మధ్య గ్యాప్

హైద్రాబాద్, మే 2, (way2newstv.com)
లోపాయికారీగా సాగుతున్న టీఆర్ఎస్‌-బీజేపీల బంధంలో చీలిక మొద‌లైందా? గులాబీ పెద్ద‌లు చేసిన ప‌నికి బీజేపీ పెద్దలు భ‌గ్గ‌మంటున్నారా? ప‌్ర‌ధానంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ టీఆర్ఎస్ తీరుపై ఆగ్ర‌హంగా ఉన్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా నెల‌కొన్న‌ ప‌రిస్థితుల‌ను చూస్తుంటే. నిజామాబాద్ జిల్లాలో మొదలైన ఎపిసోడ్ వార‌ణాసిలో హీట్‌కు చేరింద‌నే తెలుస్తోంది.నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ హోరాహోరీగా సాగిన సంగ‌తి తెలిసిందే. టీఆర్‌‌ఎస్‌‌ నుంచి సీఎం కేసీఆర్‌‌ కూతురు కవిత, బీజేపీ నుంచి డీఎస్‌ కుమారుడు అరవింద్‌‌ బరిలోకి దిగారు. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 177 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు కూడా పోటీలో నిలిచారు. 


గులాబీ, కమలం మధ్య గ్యాప్

దీంతో ఈ స్థానం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. ఒక్కో బూత్‌‌కు 12 ఈవీఎంలను వినియోగించి పోలింగ్‌‌ నిర్వహంచారు. ఇది దేశంలో ఒక రికార్డు. మ‌రోవైపు వారణాసిలో నిజామాబాద్‌ రైతులు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి పోటీకి దిగారు. అయితే, రైతులు బ‌రిలో దిగ‌డం బీజేపీ నేత‌లు భగ్గుమంటున్నారు. రైతులు పోటీకి దిగడం వెనుక టీఆర్‌‌ఎస్‌‌ ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని మోడీ గుస్సా అయినట్లు తెలుస్తోంది. స్వయంగా టీఆర్‌‌ఎస్‌‌ నేతలే నామినేషన్లను ప్రోత్సహించారంటూ రాష్ట్ర బీజేపీ కూడా నివేదిక పంపడంతో ఈ విషయాన్ని ఆయన సీరియస్‌‌గా తీసుకున్నారు. అందుకే ‘ఇక కఠినంగా ఉండండి ’ అని రాష్ట్ర బీజేపీని పార్టీ హైకమాండ్‌ ఆదేశించినట్లు సమాచారం.బీజేపీ పెద్ద‌ల నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు తెలంగాణ బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ విషయంలో కూడా మెతక వైఖరి అవసరం లేదని, గట్టిగా ఫైట్‌ చేయాలని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. హైకమాండ్‌ సూచనలతో రాష్ట్ర నాయకత్వం కూడా దూకుడుగా వెళ్తోంది. ఇంటర్‌‌ బోర్డు వ్యవహారంపై ఆందోళనలను తీవ్రతరం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నిరాహార దీక్షకు దిగిన సందర్భంగా...విద్యార్థులకు న్యాయం జరిగే వరకు గట్టిగా పోరాటం చేయాలని అమిత్‌‌ షా చెప్పడంతో ఆ వెంటనే బీజేపీ, అనుబంధ సంఘాలు వరుస ఆందోళనకు పిలుపునిచ్చాయి. అయితే, టీఆర్ఎస్- బీజేపీల మ‌ధ్య పెరిగిన దూరం ఇలాగే ఉంటుందా? మ‌ళ్లీ మితృత్వం చిగురిస్తుందా? అనేది తేలాలంటే..వేచి చూడాల్సిందే.