కమీషన్ల దందా (అనంతపురం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కమీషన్ల దందా (అనంతపురం)

అనంతపురం, మే 21  (way2newstv.com): 
నీరు చెట్టు పనుల్లో అధికారులు అవినీతికి అలవాటు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా నీరు-చెట్టు పనులు వేగంగా... విస్తృతంగా జరిగాయి. తీవ్ర వర్షాభావం కలిగిన జిల్లాకు ఈ కార్యక్రమం ఎంతో దోహదం చేస్తోంది. భూమిపై పడే ప్రతి నీటిబొట్టును నిల్వ చేసేందుకు ఇది ఉపయోగపడుతోంది. నీరు-చెట్టు కార్యక్రమంలో రెండు రకాలుగా సాగాయి. రూ.10 లక్షలు లోపు పనులు అయితే సంబంధిత నీటి సంఘాల కమిటీలకు, అంతకు మించి ఉంటే టెండర్ల ద్వారా పనులు అప్పగించారు. 2018 ఏప్రిల్‌ నుంచి మొన్న ఎన్నికల కోడ్‌ వచ్చే దాకా జరిగిన పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి దాకా దాదాపు 1,400పైగా పనులు జరిగాయి. దాదాపు రూ.125 కోట్లు దాకా బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా ఒక్క జలవనరుల శాఖలోనే రూ.105 కోట్లకుపైగా బిల్లు గుత్తేదారులు, నీటి సంఘాల అధ్యక్షులకు చెందాలి.


కమీషన్ల దందా (అనంతపురం)

బకాయి బిల్లుల చెల్లింపు విడతల వారీగా వస్తోంది. 2018 ఆగస్టు దాకా చేసిన పనులకు ఈ ఏడాది మార్చిలో కొంతమేర పరిష్కారమైంది. ఆ తర్వాత జరిగిన పనులకు ప్రస్తుతం చెల్లింపులు మొదలయ్యాయి. జలవనరుల శాఖకు గడిచిన రెండు రోజుల్లో కేవలం రూ.2.22 కోట్లు మాత్రమే వచ్చింది. అదే హెచ్చెల్సీకి మాత్రం దాదాపు రూ.20 కోట్లకుపైగా బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది. పనులు పూర్తికాగానే బిల్లులు సంబంధిత జేఈలకు అప్పగించారు. అక్కడి నుంచి నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం డీఈ, ఈఈ, పీఏవో కార్యాలయాలకు చేరాయి. ఇప్పుడు చెల్లింపులు చేయాలంటే ముందస్తుగా తగిన రీతిలో ‘కమీషన్‌’ ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. పని మొదలు పెట్టిన నాటి నుంచి బిల్లు పొందే దాకా నిర్దేశిత సీట్లకు కప్పం కట్టాల్సిందే. పని ఒప్పందంతో (అగ్రిమెంట్‌) మొదలు బిల్లు ఇచ్చే పీఏవో కార్యాలయం దాకా ఇప్పుడు కమీషన్లు ఇస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు వివిధ హోదాల వారికి.. కార్యాలయాల్లో బిల్లుల వ్యవహారాలు చూసే వారికి.. ఇలా అన్ని కలిపి.. నిర్దేశిత మొత్తంలో 15 శాతం కమీషన్‌ ముందే ఇవ్వాలి. కొన్ని చోట్ల ఇది 20 శాతం కూడా దాటుతోంది. వచ్చేది ఏ ప్రభుత్వమో తెలియదు. ఉన్నంతలో బిల్లు వస్తే చాలనే భావన గుత్తేదారులు, నీటి సంఘాల అధ్యక్షుల్లో ఉంది. నెలల కొద్దీ బిల్లు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వచ్చే తక్కువ మొత్తంలోనూ కమీషన్లకే 20 శాతం దాకా పోతే... చేతికి ఏం వస్తుందనే నిర్వేదంలో ఉన్నారు. ఇంజినీర్ల ఒత్తిడితో తప్పడం లేదు. కొంత మంది ఇంజినీర్లు మాత్రం పద్ధతి ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నారు.