కాలువ పనులకు మంగళం (ప.గో జిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాలువ పనులకు మంగళం (ప.గో జిల్లా)

పాలకొల్లు, మే 17(way2newstv.com): 
కాలువల్లో దట్టంగా పెరిగిన తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపడుతున్నామని సాగునీటి సంఘాల ప్రతినిధులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పశ్చిమ డెల్టాలో అన్నదాతలకు అవసరమైన పంట కాలువలు, మురుగు కాలువలపై ఓ అండ్‌ ఎం నిధులతో చేపట్టే పనులకు ఇంకా అంచనాలే పూర్తికాలేదు. మరో వారం రోజులు పడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత ప్రభుత్వానికి వెళ్లి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతా జరిగే సరికి కాలువలకు నీటిని విడుదల చేసే గడువు దగ్గరపడుతుంది. ఆ సమయంలో పనులు జరిగితే నిధులు పక్కదోవ పట్టేందుకే అవకాశాలు ఎక్కువ. మరోపక్క డెల్టా ఆధునికీకరణ పనులు ముందుకెళ్లే పరిస్థితి లేదు. కాలువలు కట్టివేసి పదహారు రోజులు గడిచినప్పటికీ ఇంకా నీటి ప్రవాహం తగ్గలేదు. పూర్తిస్థాయిలో అడుగంటాలంటే మరో పది పదిహేను రోజుల సమయం పడుతుంది.ఏటా కాలువలు మూసివేసే నాటికి ఓ అండ్‌ ఎం నిధులతో ఆయా పనులకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేవి. దీంతో తూడు, గుర్రపుడెక్క, చెత్తాచెదారం వంటి వాటి నిర్మూలనతోపాటు పాడైన ఔట్‌ స్లూయిస్‌ తలుపులు, డ్యామ్‌ తలుపులు, లాకుల మరమ్మతులు, తలుపులకు రంగులు వంటి పనులు చేసేందుకు అవకాశం కలిగేది. ఈసారి క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మరీ ఘోరంగా కనిపిస్తున్నాయి. కాలువలు కట్టివేసి పదహారు రోజులు గడిచినా నేటి వరకు అంచనాలే పూర్తిస్థాయిలో తయారు కాలేదు. మరో వారం రోజులు పడుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 


కాలువ పనులకు మంగళం (ప.గో జిల్లా)

ఆ తరువాత ప్రభుత్వానికి వెళ్లి అనుమతి వచ్చే సరికి మరో పదిహేను రోజులు పడుతుంది. మరోపక్క కాలువలకు జూన్‌ ఒకటి నుంచి నీరు వదలనున్నారు. అంటే అప్పట్లోగా ఈ పనులు జరిగే పరిస్థితులు లేవు. ఆయా పనుల అంచనాల జాప్యానికి జలవనరులశాఖ, మురుగునీటి పారుదల శాఖల నిర్లక్ష్యమేనని రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అసలు నిధులు కాజేసేందుకే పనుల్లో జాప్యం చేస్తారని వారు అంటున్నారు. పశ్చిమ డెల్టా మొత్తమ్మీద పంట కాలువలపై రూ. 6 కోట్లు.. మురుగు కాలువలపై రూ. 3 కోట్లతో పనులు చేసేందుకు అంచనాలు తయారీపై సంబంధిత శాఖ అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.ఓ అండ్‌ ఎం నిధులను సంవత్సరం పొడవునా వినియోగించుకోవచ్చుననే వెసులబాటుతో నిధులు పక్కదోవ పడుతుంటాయని బహిరంగ ఆరోపణలు వినిపిస్తుంటాయి. ప్రధానంగా తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు మొక్కుబడిగా జరుగుతుంటాయి. అదే పనులు చేపట్టే వారికి కాసుల వర్షం కురిపిస్తుంటుంది. పంట కాలువలు, మురుగు కాలువలపై నీటి ప్రవాహం ఉన్నప్పుడు ప్రధాన సమస్యగా నిలిచే గుర్రపుడెక్క, తూడు నిర్మూలన వంటి పనులను మాత్రమే చేపడుతుంటారు. మిగిలిన ఇతర పనులకు నీరు అడ్డంకి అని చెబుతుంటారు. గుర్రపు డెక్క, తూడు నిర్మూలనకు రసాయన మందులను వినియోగించడం.. అవసరమైన చోట్ల మనుషుల చేత తొలగించడం వంటివి చేస్తుంటారు. ఎక్కడా ఈ పనులు సవ్యంగా జరిగిన దాఖలాలే కనిపించవు. అన్ని కాలువలపై మొక్కుబడి పనులే సాగుతుంటాయి. ఓ అండ్‌ ఎం నిధులకు సంబంధించి రూ. 5 లక్షల లోపు పనులను సాగునీటి సంఘాలు నామినేషన్‌ పద్ధతిలో చేసుకోవచ్చుననే వెసులుబాటు ఉండడంతో అంచనాలు అది దాటకుండా తయారు చేస్తారు. ఆపైన దాటితే టెండర్‌ పిలవాల్సి ఉంటుంది. ఈ పనుల పేరుతో కొన్ని నీటి సంఘాలు రూ. లక్షల సొమ్మును వెనకేసుకుంటున్నాయని బహిరంగంగానే ఆరోపిస్తుంటారు. పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే సక్రమంగా జరగవని, అందుకు వాటాలు అందుతుంటాయని విమర్శలు వినిపిస్తుంటాయి. మరికొన్ని సంఘాలు కొందరు గుత్తేదారులకు పనులను అప్పగించి తమ వాటా సొమ్మును దక్కించుకుంటున్నాయనేది ఆరోపణ. ఈ పనులు సవ్యంగా జరగకపోవడం వలనే ప్రతిఏటా రెండు పంటల సమయంలోనూ సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.గోదావరి జలాల సరఫరా తగ్గిన సమయంలో వచ్చే కొద్దిపాటి నీరు శివారు భూములకు అందాలంటే గగనంగా మారుతుంది. నీటి ప్రవాహానికి తూడు, గుర్రపుడెక్కలు అడ్డు తగిలి దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండా పోతుంది. మురుగు కాలువలపై పరిస్థితి మరో రకంగా ఉంటుంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు మురుగు కాలువలు పొంగి వెంబడి ఉన్న పంట పొలాలను ముంచెత్తుతుంటాయి. దీంతో ఈ రెండు కాలువల నిర్వహణ సక్రమంగా లేక అన్నదాతలు నష్టపోతున్నారు. అన్ని కాలువలపై గుర్రపుడెక్క, తూడు వంటివి దట్టంగా పేరుకుపోతుంటాయి.ఆధునికీకరణ పనులకు సంబంధించి మందగమనంగానే కనిపిస్తున్నాయి. జలవనరులశాఖ డీఈఈ నరసాపురం ఉపవిభాగం పరిధిలో రూ. 13 కోట్లతో ఎనిమిది పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఏ ఒక్క పని ముందుకు కదల్లేదు. ఒకట్రేండు రోజుల్లో పాలకొల్లు పరిధి నరసాపురం ప్రధాన కాలువపై కాంక్రీట్‌ గోడ నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అదికూడా పాత పనే. తాడేపల్లిగూడెం డీఈఈ ఉపవిభాగ పరిధిలో పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ ఏ ఒక్క పని జరిగే పరిస్థితి లేదు. ఉండి, తణుకు ఉపవిభాగం పరిధిలో పనుల తీరు మందగమనమే. పశ్చిమ డెల్టా మొత్తమ్మీద ప్రధాన కాలువలు, ఉపకాలువలపై కొత్త, పాతవి కలిపి రూ. 32 కోట్లతో పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు ఒక శాతం పనికూడా పూర్తికాలేని దుస్థితి. మురుగు కాలువలపై చేపట్టాల్సిన రూ. 10 కోట్ల పనుల తీరు ఇంతే. ఈ ఏడాది రూ. వంద కోట్ల పనులు చేపట్టాలని నిర్దేశించుకున్నా యాభై శాతం టెండర్‌కే నోచుకోలేకపోయాయి. కనీసం టెండర్‌ జరిగిన వాటితోపాటు పాత పనులను పూర్తి చేయాలనుకున్నా అది నెరవేరేలా కనిపించడం లేదు. జూన్‌ 1వతేదీన కాలువలకు నీరు వదిలిపెట్టనున్నారు. అప్పట్లోగా పదిశాతం కూడా పనులు జరిగేలా లేవు.