విజయవాడ, మే 22, (way2newstv.com)
ఏపీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం తమదే అనే ధీమాలో ఉంది విపక్ష వైసీపీ. లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినప్పటికీ... వైసీపీ వర్గాలు మాత్రం గెలుపు కచ్చితంగా తమదే అని నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉండటంతో విజయంపై మరింత ధీమాగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు. గురువారం ఉదయం 6 గంటల వరకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, ఫలితాలు వచ్చాక ఆర్వో నుంచి ధృవీకరణ పత్రం తీసుకున్నాకే బయటకు రావాలని పార్టీ సూచించింది. ఇక, వైసీపీ అధినేత జగన్ రేపు అమరావతి చేరుకోనున్నారు.
జగన్ ముహర్తం మారిందా
తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయం నుంచే ఆయన ఎల్లుండి ఫలితాలను పర్యవేక్షించనున్నారు. 12 గంటల వరకు ఫలితాల సరళి తెలియనున్నందున ఆయన 12.30 గంటలకు మీడియాతో మాట్లాడేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు సాయంత్రం జగన్ గెలిచిన ఎమ్మెల్యేలతో అమరావతిలో సమావేశం కానున్నట్లు తెలుస్తోందితాము అధకారంలోకి వస్తే... ఈ నెల 26 తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి నిర్ణయించుకున్నాడనే వార్తలు వినిపించాయి.అయితే తాజాగా తన ప్రమాణస్వీకారోత్సవం ముహూర్తంపై జగన్ మనసు మారిందని తెలుస్తోంది.ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వారం తరువాత అంటే మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత నిర్ణయించుకున్నాడని సమాచారం. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సూచనల మేరకే జగన్ తన ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా ఇలాంటి అంశాల్లో ఎక్కువగా స్వరూపానంద సూచనలు పాటిస్తున్న వైసీపీ అధినేత... ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తం విషయంలోనూ ఆయన సలహానే పాటించారని... అందుకే ముందుగా అనుకున్న ముహూర్తాన్ని కాదని కొద్ది రోజులు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అదే రోజు జగన్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని మెజార్టీ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫలితాలు వచ్చిన తరువాత వారం రోజుల పాటు జాతీయ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై వైసీపీ అధినేత దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.
Tags:
Andrapradeshnews