కడప,గడపలో టీడీపీ స్థానం అంతేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కడప,గడపలో టీడీపీ స్థానం అంతేనా

కడప, మే 8, (way2newstv.com
రాజ‌కీయ సీమ‌, రాయ‌ల‌సీమ‌లో ప్రధానంగా వినిపించే జిల్లా పేరు క‌డ‌ప‌. దివంగత వైఎస్ ఉన్నప్పటి నుంచి నేడు ఆయన కుమారుడు రాజ‌కీయంగా బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ఈ ఇద్దరికీ చెందిన జిల్లాగా క‌డ‌ప రాజ‌కీయ తెర‌పై స‌జీవంగా ఉంటూనే ఉంటుంది. బ‌హుశ అధికార పార్టీ నాయ‌కుడు, సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు కూడా ఈ త‌ర‌హా గుర్తింపు రాలేద‌ని అంటారు. సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఆయ‌న ఎక్కువ‌గా ఈ జిల్లాపైనే దృష్టి పెట్టారు. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ, ఉద్యాన‌వ‌న యూనివ‌ర్సిటీ స్థాప‌న‌, జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌కు నీళ్లు ఇలా ఆయ‌న జ‌గ‌న్ జిల్లాపై ఎక్కువ‌గానే కేర్ తీసుకున్నారు.అయితే, చంద్రబాబు ఊరికేనే ఇలాంటి చ‌ర్యలు తీసుకోలేదు. 2019 ఎన్నిక‌ల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేయ‌డం, లేక‌పోతే.. సాధ్యమైన‌న్ని స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి కేవ‌లం ఒకే ఒక్కస్థానంలో చంద్రబాబు పార్టీ విజ‌యం సాధించింది. 


కడప,గడపలో టీడీపీ స్థానం అంతేనా

రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన మేడా మ‌ల్లి ఖార్జున రెడ్డి అనంత‌ర కాలంలో ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేశారు. ఇక‌, ఇప్పుడు ఇక్కడ పాగా వేయాల‌ని చంద్రబాబు గ‌ట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప‌లు ప్రయోగాలు చేశారు. వైసీపీ నాయ‌కుల‌ను టీడీపీలోకి ఆహ్వానించి మంత్రుల‌ను చేసి, వారికి టికెట్లు ఇచ్చి .. పార్టీని బ‌లోపేతం చేశారు.ఇంకా చెప్పాలంటే గ‌త ప‌దిహేనేళ్ల నుంచి ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం ప‌ట్టు దొర‌క‌డం లేదు. 2009లో కేవ‌లం ప్రొద్దుటూరు సీటుతో స‌రిపెట్టుకున్న టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో రాజంపేట సీటు గెలుచుకున్నా నిల‌బెట్టుకోలేక‌పోయింది. ఇక ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ప‌నుల‌తో ఈ క్రమంలోనే టీడీపీ నాయ‌కుల అంచ‌నాల మేర‌కు క‌నీసం 3 నుంచి 4 స్థానాల్లో టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. రాయ‌చోటి, రైల్వేకోడూరు, కమ‌లాపురం, మైదుకూరు, రాజంపేట‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు లాంటి చోట్ల టీడీపీకి ఆశ‌లు ఉన్నాయి. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. మొత్తం రెండు ఎంపీ స్థానాలు స‌హా అన్ని అసెంబ్లీ సీట్లు క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. త‌మ‌కు మ‌హా అయితే ఒక్క జ‌మ్మల‌మ‌డుగులో మాత్రమే కాస్త గ‌ట్టి పోటీ ఎదురైంది… అయినా అక్కడ కూడా గెలుపు త‌మ‌దే అని ధీమాతో ఉంది.టీడీపీ నేత‌లు త‌మ ప‌సుపు-కుంకుమ ప‌నిచేస్తుంద‌ని, క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌ర విష‌యంలో కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోయినా తాము శంకు స్థాప‌న చేశామ‌ని, ఉపాధికి పునాదులు వేశామ‌ని నాయ‌కులు భ‌రోసా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లాపై రెండు పార్టీల్లోనూ ఆశ‌లు ఊపందుకున్నాయి. ఇక‌, రాష్ట్రంలోని ప‌లు జిల్లాల‌లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఘ‌ర్షణ‌లు జ‌రిగినా కూడా ఇక్కడ మాత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగియ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఎవ‌రికి ప్రజ‌లు ప‌ట్టం క‌డ‌తారో చూడాలి