ఎండకాలంలో బీర్లకు ఉండే గిరాకీయే వేరు… అదే సమయంలో బీరు ఉత్పత్తికి ఎండకాలమే గడ్డు కాలంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం బీరు ఉత్పత్తి పడిపోయినట్లు అధికారులు, కంపెనీలు పేర్కొంటున్నాయి. బీరు, లిక్కర్‌కు సరిపడా నీరు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా తెలిసింది. మరో వారం, పది రోజులు నీటి కటకట కొనసాగితే వైన్‌షాప్‌ల ముందు నో బీర్ స్టాక్ బోర్డు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం సాధారణంగా వేసవిలో బీర్లు జోరుగా అమ్ముడుపోతాయి. అందులోనూ రాష్ట్రంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ ముగియడం, ఐపిఎల్ సీజన్, స్థానిక ఎన్నికలతో గత మూడు నెలలుగా బీర్ల విక్రయాలు జోరందుకున్నాయి. అయితే బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలకు ఇప్పుడు నీటి కష్టం వచ్చి పడింది.
బీర్లకు గిరాకీ... నీటికి కటకట
దీంతో ఉత్పత్తిని క్రమ క్రమంగా తగ్గించుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం ఆరు బీరు కంపెనీలు ఉన్నాయి. ఇక్కడి నుంచే రాష్ట్రం మొత్తం బీరు సరఫరా అవుతోంది. ఈ ఆరు ఉత్పత్తి కేంద్రాలలో రోజుకు దాదాపు 1.90 లక్షల కేసుల బీర్లు ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు అది లక్ష కేసులకు పడిపోయినట్లు తెలిసింది.బీరు ఉత్పత్తి చేస్తున్న కంపెనీల దగ్గర మరో మూడు రోజులకు సరిపోయే స్టాక్ మాత్రమే ఉంది. 5,72,000 వేల కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే యూబి,కెఎఫ్ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించినట్లు తెలిసింది.ఒక్క పెట్టె బీర్ల తయారీకి కనీసంగా మూడు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల నీటి అవసరం పడుతుంది. ఈ నీటిని మంజీరా, సింగూరు ద్వారా తీసుకుని బీర్లు, ఇతర లిక్కర్ కంపెనీలు లిక్కర్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే వేసవి తీవ్రం కావడం, తాగునీటికే అవసరాలు ఎక్కువగా ఉండటంతో ఆ జలశాయాల నుంచి కంపెనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తిని క్రమేణా తగ్గిస్తున్నారు. కంపెనీలు సొంతంగా వేసుకున్న బోర్ల ద్వారా నీటిని తీసుకుంటున్నాయి. వీటి ద్వారా తక్కువ సామర్థంలో నీరు అందుతోంది. అలాగే కొన్ని కంపెనీలు వాటర్ ట్యాంకర్లను వినియోగించుకుంటున్నాయి. అయితే ఒక్క ట్యాంకర్‌కు కనీసంగా రూ.5 వేలు ఖర్చు అవుతుంది. ఇలా రోజుకు ఒక కంపెనీకే 100 ట్యాంకర్ల నీటి అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు.
Tags:
telangananews