ఫిట్ నెస్...అదెక్కడ... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫిట్ నెస్...అదెక్కడ...


మెదక్, మే 28, (way2newstv.com)
విద్యా సంస్థల బస్సుల సామర్థ్య పరీక్షల గడువు ముగిసి పది రోజులు దాటుతున్నా రవాణాశాఖ అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. దీంతో ఆయా పాఠశాలల యజమానులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి 2018-19 నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. విద్యార్థులను పాఠశాలలకు చేరవేసే బస్సులకు పూర్తిస్థాయి అనుమతులు తప్పనిసరి. బస్సుల సామర్థ్య పరీక్షల కోసం ఏర్పాట్లు చేసుకొని అనుమతుల కోసం కార్యాలయాలు, ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయా విద్యాసంస్థల యాజమానులు ఆరోపిస్తున్నారు. సంబంధిత పత్రాలన్నీ ఉన్నా పరీక్షలు చేయకపోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యలని సాకుగా చెబుతున్నారని పేర్కొంటున్నారు. గట్టిగా అడిగితే అంతర్జాలంలో సమస్యలు, రవాణా శాఖ వెబ్‌సైట్‌ నమూనాలో మార్పులు చేస్తున్నారనే సమాధానాలు వస్తున్నాయని చెబుతున్నారు.


ఫిట్ నెస్...అదెక్కడ...

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందినవి సుమారు 750 బస్సులున్నాయి. వీటిలో పదుల సంఖ్యలో కూడా ఇప్పటివరకు సామర్థ్య పరీక్షలు పూర్తి చేసుకోలేదు. నల్గొండ, సూర్యాపేట రవాణాశాఖ కార్యాలయాల్లో గత శుక్రవారం నామమాత్రంగా అనుమతులు జారీ చేయగా మిర్యాలగూడ కార్యాలయం పరిధిలో వందకు పైగా బస్సులున్నప్పటికీ ఒక్కదానికి కూడా పరీక్షలు నిర్వహించలేదు. రవాణాశాఖ నిబంధనల మేరకు విద్యా సంస్థల బస్సులన్నీ విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతులు కల్పించి మే 15 నాటికే అనుమతులు పొందాల్సి ఉంది. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉంటేనే ఫిట్‌నెస్‌ పరీక్షలు చేస్తామని అధికారులు చెబుతుండటంతో పాఠశాలల యాజమాన్యాలు ఆయోమయంలో పడ్డాయి. మే 15 నాటికే సామర్థ్య పరీక్షలు నిర్వహించి అనుమతులివ్వాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యాసంస్థల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా విద్యార్థులు వాహనాల్లో తరలిస్తే కేసులు, అపరాధ రుసుములు భరించాల్సి వస్తుందని బెంబేలెత్తిపోతున్నారు.నిబంధనల మేరకు వసతులు కల్పించిన విద్యాసంస్థల బస్సులకు రిజిస్ట్రేషన్‌ కార్డు, కాలుష్యం, బీమా కాగితాలతో పాటు అర్హులైన డ్రైవర్‌, క్లీనర్లు ఉండాలి. వారి వివరాలు కార్మికశాఖలో నమోదు కావాలి. ఈ సమాచారంతో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ వివరాలను మీ సేవలో నమోదు చేసి ఆ ధ్రువీకరణ పత్రం ఆధారంగా రవాణాశాఖాధికారి వద్దకు బస్సును పంపిస్తారు. నిబంధనలతో పాటు వాహనం సామర్థ్య పరీక్షలు చేసిన తరవాత బస్సు స్థితిని బట్టి అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. అవన్నీ పక్కన పెట్టి గతేడాది ఫిట్‌నెస్‌కు నమోదు చేసిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉంటేనే టెస్ట్‌లు చేస్తామని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పాఠశాలల నిర్వాహకులు చెబుతున్నారు. నిజానికి గతంలో నమోదైన బస్సులను రెన్యువల్‌కు తరలించాలంటే అదే యూజర్‌ ఐడీపై తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ విషయం తెలియని పాఠశాలల యాజమాన్యాలు ఆ వివరాలను 
భద్రపర్చుకోలేదు. దీంతో ఇదే అదనుగా రవాణాశాఖాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి కావాల్సిన పనులు కనీసం ప్రారంభానికి కూడా నోచుకోలేదు. యూజర్‌ ఐడీకి సంబంధించిన సమగ్ర వివరాలు రవాణాశాఖ సర్వర్‌లో ఉన్నప్పటికీ వాటిని పాఠశాలల నిర్వాహకులకు ఇవ్వడంలో ఉద్యోగులు కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.