తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఊహించని దెబ్బ తగిలిన కేసీఆర్ ఇప్పుడు తన నిర్ణయాలపై పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. తెలంగాణపైనే ఆధారపడి రాజకీయం చేయాల్సి ఉన్నందున రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఆయనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కేటీఆర్, హరీష్‌రావులు మంత్రివర్గంలో ఉంటే అన్ని పనులు సజావుగా సాగిపోతాయి. అందువల్ల వారిని మళ్లీ మంత్రి వర్గంలోకి తీసుకుని పాలనను పరుగులు పెట్టించాల్సిన అవసరాన్ని కేసీఆర్ గుర్తించారు. పార్టీని నడపడం కన్నా ప్రభుత్వాన్ని నడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అంత సమయం కేటాయించి అన్ని విషయాలను చూసుకోవడానికి కేటీఆర్ హరీష్‌రావులు అవసరమని ఆయన గుర్తించారు. అవసరమైతే పార్టీ పగ్గాలు పరిమితంగా కవితకు అప్పగించి కేటీఆర్‌ను హరీష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఆయన మొగ్గు చూపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాల్లో పెనుమార్పులు?
అందువల్ల త్వరలోనే హరీష్, కేటీఆర్‌లను మళ్లీ మంత్రులుగా చూడవచ్చు. కేంద్రంలో కీలక బాధ్యత పోషించాలని ఆశించిన కేసీఆర్‌కు తెలంగాణలో సీట్లు తగ్గడం ఒకటి కాగా రెండోది కేంద్రంలో బిజెపికి ఊహించని విధంగా మెజారిటీ రావడం. ఈ రెండూ కూడా కేసీఆర్ అభీష్టానికి విరుద్ధంగా జరిగినవే కావడంతో ఆయన తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకోకపోతే మరింత దెబ్బతగిలే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆయన ఇంతగా కంగారు పడేవారు కాదు కానీ నాలుగు స్థానాలలో బిజెపి గెలవడం ఆయనను కలవర పరుస్తున్నది. బిజెపి ఒక్క సారి అంటుకుంటే పోయే రంగు కాదు. తెలంగాణ వ్యాప్తంగా బిజెపికి పటిష్టమైన క్యాడర్ ఉన్నా కూడా ఇప్పటి వరకూ వారు స్తబ్దుగా ఉండిపోయారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడంతో బిజెపిలోని క్యాడర్‌కు కూడా కొత్త ఉత్సాహం వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి సీట్లను బలవంతంగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండగా తెలంగాణలో అయాచితంగా ప్రజలే బిజెపికి సీట్లు ఇచ్చేశారు. ఇది కేసీఆర్‌ను మరింత కంగారుపెడుతున్నది. టిఆర్ ఎస్ పార్టీ మజ్లీస్‌తో బాహాటంగా దోస్తీ చేస్తుండటంతో మెజారిటీ హిందువులలో మార్పు కనుక వస్తే ఇక టిఆర్ ఎస్ కు కష్టకాలం దాపురిస్తుంది. అందువల్ల దీన్ని ఇప్పటి నుంచే ఎదుర్కొనకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వం చేతులో ఉన్నందున దిద్దుబాటు చర్యలు వేగంగా తీసుకోవడానికి ఆయన ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం ఇలానే కొనసాగితే టిఆర్ ఎస్ పాలనలో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. మంత్రివర్గాన్ని మరింత బలోపేతం చేసుకుంటే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. అందుకోసం గతంలో ఉన్నట్లే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, సిద్దిపేట ఎం ఎల్ ఏ హరీష్‌రావును మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నారు.
Tags:
telangananews