సారమేదీ..? (కర్నూలు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సారమేదీ..? (కర్నూలు)

కర్నూలు, జూన్ 15 (way2newstv.com): 
భూమినే నమ్ముకున్న రైతులకు సాయమందించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలిపితే... రసాయన ఎరువుల వినియోగం తగ్గించే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకు పెట్టుబడివ్ ఖర్చు ఆదా అవుతుంది. పంటల సాగులో కీలకమైన భూసార పరీక్ష ఫలితాలు ఈసారి ఎన్నికల నేపథ్యంలో జరగలేదు. ఈ ఏడాది పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసినా స్పందన కరవైంది. ఇప్పటికే రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులు అందజేయాల్సి ఉండగా కేవలం మట్టి నమూనాల సేకరణ చేస్తుండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా 53 మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ఏడాది ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి రైతులందరి భూముల్లో మట్టి నమూనాలు సేకరించాల్సి ఉంది. ఖరీఫ్‌ ఆరంభమయ్యేలోగా రైతులకు వాటి ఫలితాలను అందించాల్సి ఉంది. 26,500 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు వేయికి పైగా మాత్రమే సేకరించారు. జూన్‌ మొదటి వారం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమవుతుంది. 

సారమేదీ..? (కర్నూలు)
కొంత మంది రైతులు ఇప్పటికే పొలాల్లో దుక్కులు దున్ని విత్తనం వేసేందుకు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎర్ర నేలల్లో ముందస్తు వర్షాలకు అధికంగా విత్తనం వేస్తారు. జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో ఖరీఫ్‌లో ఈసారి మంచి పంటలు పండుతాయని కోటి ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. అప్పుడే కొందరు రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. విత్తనానికి ముందు భూసార పరీక్ష ఫలితాల కార్డులు అందజేస్తే ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులు, సూక్ష్మ పోషక ఎరువులు వేసుకునే వీలుంటుంది. ఖరీఫ్‌ ఆరంభమైన సమయంలో ఈసారి మట్టి నమూనాల సేకరణ పనిలో వ్యవసాయాధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఎన్నికల కారణంగా భూసార పరీక్షలు ఈసారి జాప్యం జరిగినట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.కర్నూలు, నంద్యాల, డోన్‌, ఎమ్మిగనూరులో భూసార పరీక్ష కేంద్రాలున్నాయి. మట్టి నమూనాలు వేగంగా సేకరించి వాటిని పరీక్షల కోసం పంపినా ఫలితాలు వచ్చేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువల్ల భూసార కేంద్రాల్లో సిబ్బందిని పెంచి రైతులకు పరీక్ష ఫలితాలను అందించాల్సి ఉంది. లేకుంటే విత్తనం వేసిన తర్వాత మట్టి నమూనాలు సేకరించడానికి వీలుపడదు. మట్టి నమూనాల సేకరణ, పరీక్షలు చూస్తే జూన్‌ ఆఖరుకు కూడా పూర్తయ్యేలా లేవు. అవగాహన ఉన్న రైతులు తామే స్వచ్ఛందంగా నిబంధనలు మేర మట్టి నమూనాలు సేకరించి పరీక్షించుకుంటున్నారు. ఇలాంటి వారి శాతం చాలా తక్కువ.