వెంటాడుతున్న భూతం (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వెంటాడుతున్న భూతం (గుంటూరు)

గుంటూరు, జూన్ 15 (way2newstv.com): 
ప్లాస్టిక్‌ భూతం అందరినీ వెంటాడుతోంది. భవిష్యత్తులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు మానవజీవనానికి సవాల్‌గా మారనున్నాయి. 50 మైక్రాన్లలోపు ఉన్న ప్లాస్టిక్‌  వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించినా చాపకింద నీరులా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక సంస్థలు అడపాదడపా వ్యాపారులపై దాడులు చేసి కేసులు నమోదుచేస్తున్నా క్షేత్రస్థాయిలో విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా 50మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం ఎక్కువగా ఉంటోంది. జిల్లాలో రోజుకు 3వేల కిలోల కవర్లు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో రోజువారీగా 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు 15వేల కిలోలు వినియోగిస్తున్నారు. జిల్లాలో 3వేల కిలోలు తయారవుతుండగా మిగిలిన 12వేల కిలోలు హైదరాబాద్‌ నుంచి దిగుమతి అవుతున్నాయి. అల్పాహార కేంద్రాలు, కర్రీస్‌ సెంటర్లు, పూలు, పండ్లు, కూరగాయలు, రిటైల్‌ దుకాణాల్లో ఎక్కువగా 50మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగిస్తున్నారు. వీటి వినియోగం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో అవసరానికి తక్కువ ధరకు అందుబాటులో ఉండటం, సౌకర్యంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఉపయోగిస్తున్నారు. 

వెంటాడుతున్న భూతం (గుంటూరు)

ఉపయోగించిన తర్వాత ఎక్కడపడితే అక్కడ పడేయడంతో పర్యావరణపరంగా అనేక సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో 50మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు తయారుచేసే కంపెనీలు గుంటూరు, నరసరావుపేట కేంద్రంగా పనిచేస్తున్నాయి. నరసరావుపేటలో ఇటీవల అక్కడి మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదుతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కంపెనీలను తనిఖీచేసి నిబంధనలకు విరుద్ధంగా కవర్లు తయారుచేయడం, కొన్ని అనుమతులు తీసుకోకపోవడం వంటి అంశాలను పరిశీలించి నాలుగు యూనిట్లను మూసేయాలని ఆదేశించారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లోనూ మూడు కంపెనీలు 50 మైక్రాన్ల కంటే తక్కువ కవర్లు తయారుచేసే యూనిట్లు ఉన్నట్లు గుర్తించారు. త్వరలోనే వీటిపై దాడులు చేసి నిబంధనలు పాటించని పక్షంలో మూసివేయాలని యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలో 50 మైక్రాన్ల కంటే తక్కువ కలిగిన కవర్లను విక్రయించే టోకు దుకాణాలు 35వరకు ఉన్నాయి. వీరి నుంచి రిటైల్‌ వ్యాపారులు కొనుగోలు చేసి అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అధికారులు దాడులు చేసినప్పుడు 50మైక్రాన్‌ల కంటే తక్కువ ఉన్న కవర్లను గుర్తిస్తే వ్యాపారులపై కేసులు నమోదుచేస్తున్నారు. అయితే తయారీ లేకపోతే తాము ప్రత్యామ్నాయం చూసుకుంటామని, అలాకాకుండా తనిఖీల పేరుతో కేసులు నమోదుచేయడం ఏంటని వ్యాపారులు వాపోతున్నారు. ఈక్రమంలో తయారీ కేంద్రాలపై యంత్రాంగం దృష్టిసారించింది. ఇందులో భాగంగా రోజువారీగా 50మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్ల వినియోగం ఎంత? స్థానికంగా తయారీ ఎంత జరుగుతోంది? ఇతర ప్రాంతాల నుంచి ఎన్ని కిలోల కవర్లు దిగుమతి చేసుకుంటున్నారన్న విషయాలపై కాలుష్య నియంత్రణ మండలి దృష్టి సారించి నివేదిక సిద్ధం చేసింది. ఇటీవల గుంటూరు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఒకరు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్ల వినియోగం నగరంలో విచ్చలవిడిగా జరుగుతోందని న్యాయసేవాధికార సంస్థకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కాలుష్య నియంత్రణ మండలి. జీఎంసీలను బాధ్యులుగా చేస్తూ కేసు విచారణకు స్వీకరించింది. ఇందులో భాగంగా త్వరలోనే పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, పర్యావరణ ఇంజినీర్లతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేయనున్నారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నగరంలో 50మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్లను విక్రయించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్ల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. ఇవి తొందరగా భూమిలో కలిసిపోకపోవడం వల్ల ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. మురుగుకాలువలు, పంట 
కాలువల్లో నీటిప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. పశువులు ఆహారం దొరకని పక్షంలో ప్లాస్టిక్‌ కవర్లను కూడా ఆహారంగా తింటున్నాయి. ఇవి జీర్ణంకాక పశువుల కడుపులో పేరుకుపోయి వాటి మరణానికి కారణమవుతున్నాయి. అదేవిధంగా అనేక జంతువులు ప్లాస్టిక్‌ బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. నగరంలో చెత్తను తరలించినప్పుడు సింహభాగం ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి చెత్త నుంచి వర్మీకంపోస్టు తయారీలో కూడా అడ్డంకిగా మారుతున్నాయి. అవసరాలకు వినియోగించుకునేటప్పుడు కొంత సౌకర్యంగా ఉన్నా వాడిన తర్వాత ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలు వ్యక్తిగతంగా 50మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించకూడదని నిర్ణయం తీసుకుని అమలుచేయాలి.