రేపటి నుంచే వడివడి అడుగులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రేపటి నుంచే వడివడి అడుగులు


విశాఖపట్టణం, జూన్ 11, (way2newstv.com)
బరువైన పుస్తకాల సంచులను భుజాన మోస్తున్న చిన్నారులను చూస్తుంటే శిలువ మోస్తున్న బాల ఏసుల్లా కనిపిస్తున్నారని ఓ కవి అప్పట్లో అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు విద్యార్థులను చూస్తుంటే ఆ మాటలు నిజమేనని అనిపించక మానవు. అధిక భారంతో మున్ముందు చిన్నారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అసలింతకీ చట్టం ఏం చెబుతోంది ? పుస్తకాలు ఏ మేరకు అవసరం ? స్కూలు బ్యాగు ఎంత బరువులో ఉండాలి ? అన్న అంశాలను స్పృశిస్తూ సాగేదే ఈ కథనం. పిల్లలకు మంచి మార్కులు, ర్యాంకులొస్తేనే సరిపోతుందా..? వారి భుజాలు కుంగిపోయినా ఫర్వాలేదా..? అని నగర విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బ్యాగు బరువు. వారి వయస్సుకు మించిన బరువు మోయాల్సి రావడంతో అడుగుల్లో తడబాటు తప్పడం లేదు. కొందరు సంచిని ఎత్తగానే విలవిలలాడిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ గోడును పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో మౌనంగా రోదిస్తూనే బడిబాట పడుతున్నారు. రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న తరగతి గదులకు వెళ్లేందుకు వీరు పడుతున్న వేదన వర్ణనాతీతం.పిల్లలకు మంచి మార్కులొస్తే పొంగిపోయే తల్లిదండ్రులు వారి భుజాలు కుంగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. 


రేపటి నుంచే వడివడి అడుగులు
పసి మొగ్గలు చదువు పేరుతో పసివాడుతుంచే చట్టాలు ఏం చేస్తున్నాయని ఎవరైనా అనుకోవొచ్చు. అలాంటి పరిస్థితిని నియంత్రించడానికే స్కూల్‌ బ్యాగ్‌ యాక్ట్‌ 2016ను తీసుకువచ్చారు. దీనిపై సరైన అవగాహన, ప్రచారం లేక ప్రతిఏటా చిన్నారులపై భారం పెరిగిపోతోంది. ఎదిగే పిల్లలు మీద బ్యాగుల భారం తగ్గించడానికి చట్టం తెచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. చట్టం ప్రకారం స్కూలు బ్యాగు బరువు విద్యార్థి శరీర బరువులో పది శాతానికి మించకూడదు. దీని అమలు బాధ్యత పాఠశాలల యాజమాన్యాలదే. నర్సరీ, కిండర్‌ గార్డెన్‌ చదివే పిల్లలకు అసలు పుస్తకాల సంచులే ఉండకూడదు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు తమ బ్యాగులను పెట్టుకునేందుకు ప్రత్యేకంగా లాకర్‌ సదుపాయం ఏర్పాటు చేయాలి. నిబంధనలు అతిక్రమించిన పాఠశాల యాజమాన్యాలకు రూ.3 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఈ స్కూలు బ్యాగ్‌ చట్టం నిబంధనలు తల్లిదండ్రులకు తెలిసేలా పాఠశాలల్లో బొమ్మలు ఏర్పాటు చేయాలి. ఇవేవీ నగర పాఠశాలల్లో కనిపించడం లేదు. తాజాగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రాథమిక విద్యకు సంబంధించి కొన్ని నిబంధనలను జారీ చేసింది. 1వ, 2వ తరగతి పిల్లలకు హాం వర్కు ఇవ్వకూడదు. అలాగే పిల్లల స్కూల్‌ బ్యాగు బరువుకు సంబంధించి 1, 2 తరగతుల పిల్లలు బ్యాగు బరువు ఒకటిన్నర కేజీలుండాలి. 3 నుంచి 5 తరగతులకు మూడు కేజీలు, 6, 7 తరగతుల వారికి నాలుగు కేజీలు, 8, 9 తరగతుల వారికి నాలుగున్నర కేజీలు, 10వ తరగతి వారికి ఐదు కేజీలకు మించరాదని నిబంధనలు విధించింది. వీటిని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా పాటించాలని చెప్తోంది. ఈ నిబంధనలను పాటిస్తున్న పాఠశాలలే లేవు. చిన్న వయసులో ఎక్కువ బరువు మోయడం వల్ల అది చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి చిన్నారి తన బరువులో 15 శాతాన్ని మోయగలడు. అధిక బరువు మోస్తే పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోపక్క పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగి ఆవేదనగా మారుతుంది. దీని వల్ల చదువుపట్ల విముఖత మొదలవుతుంది. బాల్యంలో అధిక బరువు మోయడం వల్ల పది శాతం మంది శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. అవయవాల పెరుగుదలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. దీని వల్ల వయస్సుకు తగ్గ ఆకారం కనిపించదు. కాళ్లు, చేతులు సన్నబడే ప్రమాదం ఉంది., వెన్ను సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ప్లేట్లపై ఒత్తిడి పెరిగి అభివృద్ధి ఆగిపోతుంది., బ్యాగు మోస్తూ పై అంతస్తు ఎక్కే చిన్నారుల్లో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. బ్యాగు బరువు మూడు రెట్లు పెరుగుతుంది. చిన్నారుల్లో కడుపు పక్కల్లో నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఎస్‌ ఆకారంలో ఉండే వెన్నుపూసలోని కర్వ్‌ పాడై వెన్నునొప్పికి దారి తీస్తుంది. పిల్లలపై ఇంత భారం మోపడం వల్ల తలెత్తే సమస్యలపై నగరంలోని ఓ అధ్యయన సంస్థ సర్వే చేపట్టింది. దాని ప్రకారం 7 నుంచి 13 ఏళ్లలోపు వయస్సు పిల్లల్లో 80 శాతం మంది తమ శరీర బరువు అంటే 45 శాతం ఎక్కువ బరువున్న పుస్తకాలు సంచులను మోస్తున్నారని తేలింది. దీనివల్ల చిన్నారుల వెన్నెముకలో డిస్క్‌ స్లిమ్‌ అవడం, స్పాండిలైటిస్‌, వెన్నునొప్పి, భుజాలు, కండరాల నొప్పులు తదితర సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నట్లు తేలింది.ప్రతి పాఠశాలలో స్కూల్‌ బ్యాగులు పెట్టుకునేందుకు లాకర్లు ఏర్పాటుచేయాలి. దీంతో రోజూ అన్ని పుస్తకాలనూ ఇంటికి తీసుకువెళ్లే పని ఉండదు. ఈ లాకర్లను కూడా పిల్లలు కూర్చునే తరగతి గదిలోని బెంచీలకు అమర్చితే మరింత సౌకర్యంగా ఉంటుంది. స్కూల్‌ బ్యాగ్‌ కొనుగోలు చేసేటప్పుడే తేలిగ్గా ఉన్నదాన్ని ఎంచుకోవాలి. పిల్లలు మోసే బ్యాగు వాళ్ల భుజానికి నాలుగు అంగుళాల కంటే కిందికి రాకూడదు. ఛాతికి వేసుకునే క్లిప్‌ ఉన్న బ్యాగులకు ప్రాధాన్యమిస్తే నడిచినప్పుడు బ్యాగు అటూ ఇటూ కదలకుండా ఉంటుంది.కేరళ ప్రభుత్వం స్కూలు బ్యాగు పరిమితిపైగల నిబంధనలను కచ్ఛితంగా పాటించటంలో ముందుంది. అలాగే మహారాష్ట్రలోని కొన్ని స్కూళ్లలో పిల్లల పుస్తకాల బరువును తగ్గించేందుకు తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్లు, ప్రొజెక్టర్లను ఉపయోగించి బోధిస్తున్నారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఒకటి నుంచి ఏడు తరగుతుల పిల్లలకు రెండు, నాలుగు శనివారాలు పుస్తకాలు లేకుండా ఆట, పాటలు, తోటపని చేయటం, వినడం ద్వారా నేర్చుకోవటం వంటి పద్ధతులను అవలంబిస్తున్నారు.