గీత దాటిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గీత దాటిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు

ఒంగోలు, జూన్ 24, (way2newstv.com)

అవినీతి రహిత పాలనే లక్ష్యం. మంత్రులు అయినా సరే దారి తప్పితే వారిపై తప్పకుండా వేటు వేస్తాను.’ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పిన మాట. ఈ మాటను వాస్తవ రూపం దాల్చేలా ఆయన అడుగులు వేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరు అవినీతికి పాల్పడినా ముఖ్యమంత్రి స్థాయికి ఎప్పటికప్పుడు తెలిసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్, ఐబీతో పాటు... వైసీపీలోని కొందరు నమ్మకస్తులైన నేతలు ఈ నివేదకలు సిద్ధం చేసి సీఎంవోకి అందేలా చూస్తున్నారు. వాటి ఆధారంగా ప్రకాశం జిల్లా వైసీపీ నేతల కాళ్లకు బంధనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ నివేదికల ఆధారంగా అధికార యంత్రాంగం, ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు. అధికారులు తప్పుచేస్తే వారిపై ఉన్నతస్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారు. పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే డైరెక్టుగా.. సీఎం జగన్‌ నేరుగా మాట్లాడేలా ప్రణాళిక రూపొందించారు. ప్రజాప్రతినిధులు దారి తప్పితే నేరుగా పార్టీ పెద్దలు, సీఎం మాట్లాడతారని సమాచారం. జిల్లా నుంచి ఇప్పటికి వెళ్లిన నివేదిక ఆధారంగా... అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండానే ముగ్గురు ఎమ్మెల్యేలు గీత దాటినట్లు సీఎం జగన్ దృష్టికి వెళ్లింది.


గీత దాటిన ఆ  ముగ్గురు గీత దాటిన ఆ  ముగ్గురు ఎమ్మెల్యేలు
ప్రధానంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు సీఎం టేబుల్ పైకి చేరాయి. ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో బదిలీల్లో తలదూర్చి అనధికారంగా వసూళ్లు చేస్తున్నారని, మరో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రభుత్వ భూములు, అధికారుల విషయంలో వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. మరోవైపు.. తూర్పున ఉన్న ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా చేతివాటం చూపిస్తున్నట్లు నివేదిక వెళ్లింది. వీటి ఆధారంగా ఆ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి కూడా.. తనకు అందిన సమాచారం నిజమా? కాదా? అని కూడా సీఎం సమాచారం తెప్పించారు. వీటి ఆధారంగా ముగ్గురు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారుల బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో వాటిపై దృష్టి సారించిన సీఎం అవి పూర్తైన తర్వాత పార్టీ నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాల అంతర్గత సమాచారం.జిల్లాలోని పలు విభాగాల అధికారుల తీరుపైనా ప్రభుత్వం నివేదికలు సీఎంవోకి చేరాయి. గత ప్రభుత్వ హయాంలో పలు కీలక విభాగాల్లోని అధికారులు అవినీతి చిట్టా ఆధారంగా వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగానే వికలాంగ సంక్షేమ శాఖలో జరిగిన రూ. 50 లక్షల అవకతవకలకు సంబంధించి ఏడీ సింగయ్యపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో నేరుగా అమరావతి నుంచి ఉన్నతస్థాయి అధికారులు సైతం జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరారు. దీంతోపాటు విద్యాశాఖలో 70 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టుల కోసం గత ప్రభుత్వంలో కొందరు అధికారులు రూ. లక్షల్లో వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. తాజాగా ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ నియమకాలను రద్దు చేయడంతో.. అధికారులకు లంచం ఇచ్చిన అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.ఎన్నడూ లేని విధంగా నేరుగా సీఎం జగన్... అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతిపై కన్ను వేయడంతో పార్టీ నాయకుల్లోనూ ఒకింత కంగారు మొదలైంది. ఏ పని చేస్తే.. ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని వారు వీలయినంత వరకూ వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి సీఎం నూతన విధానం.. అధికారులు, నేతల్లో ఏ విధంగా మార్పు తెస్తుందో..!