ఖరీఫ్ లక్ష్యాలు సరే... ఆచరణ ఏదీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఖరీఫ్ లక్ష్యాలు సరే... ఆచరణ ఏదీ


కర్నూలు, జూన్ 8, (way2newstv.com)
కర్నూలు జిల్లా రైతులు కోటి ఆశలతో ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో వ్యవసాయం ఎక్కువశాతం వర్షాధారమే. సాధారణంగా జూన్‌ 1వ తేదీ నుంచే ఖరీఫ్‌ ప్రారంభమైంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చే సబ్సిడీ విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌, రబీలో తీవ్ర నష్టాలను మూటగట్టుకున్న రైతులు ఈసారి చేతిలో పంటల సాగు కోసం చేతిలో చిల్లిగవ్వ లేక బ్యాంకులు ఇచ్చే రుణాల కోసం, బయట ప్రయవేటు వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారైనా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండి గట్టెక్కాలని జిల్లాలోని రైతన్నలు కోటి ఆశలతో ముందుకు సాగుతున్నారు.  గతేడాది ఖరీఫ్‌కు రైతులకు రుణం కింద రూ.3,825.31 కోట్లు కేటాయించారు. రబీకి రూ.1,778.92 కోట్లు, వ్యవసాయ టర్మ్‌ రుణల కోసం రూ.1,304.76 కోట్లు.. మొత్తం రూ.6.908.99 కోట్లు కేటాయించారు. కానీ కేటాయించిన నిధుల్లో 25 శాతం కూడా రుణాల పంపిణీ జరుగలేదు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పంట రుణాలుగా రూ.4055.92 కోట్లు పంపిణీ చేయాలని బ్యాంకులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నాయి. 


ఖరీఫ్ లక్ష్యాలు సరే... ఆచరణ ఏదీ
ఏపిజీబీ రూ.940.38 కోట్లు, ఆంధ్రాబ్యాంకు రూ.557.94 కోట్లు, ఎస్‌బిఐ రూ.551.66 కోట్లు, సిండికేట్‌ బ్యాంకు రూ.363.28 కోట్లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.562.32 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాల్సి ఉంది.ఖరీఫ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో సబ్సిడీ విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వేరుశనగ సాగు చేయాలంటే విత్తు సమయానికి ముందుగానే పంపిణీ చేయాల్సి ఉంది. ఖరీఫ్‌లో ప్రధానంగా వేరుశనగ, పత్తి పంట సాగు చేస్తారు. జిల్లాకు 40 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం అవసరం ఉంది. పత్తిలో ప్రతి ఏటా నకిలీ, బీటీ-3 హెచ్‌టీ విత్తనాలు సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఏటా రైతులు నకిలీ పత్తి విత్తనాలతో మోసపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు సకాలంలో ఎరువులు, విత్తనాలు సబ్సిడీలో పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో నికర సాగు భూమి 23,72,665 ఎకరాలు ఉంది. ఖరీఫ్‌ సాధారణ సాగు 15,24,810 ఎకరాలు. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారమే. వేసవిలో బోరుబావులే శరణ్యం. ప్రస్తుతం జిల్లాలోని చెరువుల్లో, కుంటల్లో, నదుల్లో నీరు లేకపోవడంతో వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. వీరంతా రెండు పంటలు పండించుకునేందకు మొగ్గు చూపుతారు. వర్షాకాలంలో ఎలాగోలా గట్టెక్కినా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఒట్టిపోతుండడంతో ఏటా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది ఖరీఫ్‌, రబీలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, మినుము, శనగ, కంది పంటల దిగుబడి సగానికి పైగా తగ్గిపోయి పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదన్నా సకాలంలో వర్షాలు కురిసి తమ కష్టాలు తీరుతాయన్న ఆశతో రైతుల ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధ మవుతున్నారు.భూమిలో సూక్ష్మ పోషకాల శాతం తగ్గితే పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. రైతులకు భూసార పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి భూ ఆరోగ్య కారుడలు వ్యవసాయ అధికారులు అందిస్తున్నారు. బొరాన్‌, జింక్‌, ఐరన్‌, మాంగనీస్‌ తదితర లోపాలు ఉన్న భూముల్లో సూక్ష్మ పోషకాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రైతులకు అందిస్తోంది. గతేడాది ఖరీఫ్‌లో బొరాన్‌, జింక్‌, జిప్సమ్‌, కలిపి 7,431 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. 1265 మెట్రిక్‌ టన్నుల నిల్వలు అందుబాటులో ఉంచారు. అయితే ఒక్క రైతుకు కూడా సూక్ష్మ పోషకాల పంపిణీ చేయలేదు. విత్తనాల కంటే ముందుగా సూక్ష్మ పోషకాలు వేయాల్సి ఉంది. ఉచితంగా ఇచ్చే వీటిని ఈ సారైనా రైతులకు సకాలంలో వ్యవసాయ అధికారులు అందిస్తే మంచిది. ఈ సారి జిల్లాలో 2019-20 సంవత్సరానికి సంబంధించి భూసార పరీక్షల నిర్వహణకు ఇంత వరకు మట్టి నమూనాల సేకరణే సరిగ్గా జరుగలేదు. ఎలక్షన్స్‌ జరుగుతుండడంతో వ్యవసాయ శాఖ దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదనే విమర్శలున్నాయి.