అడ్డూ, అదుపు లేకుండా మట్టి మాఫియా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అడ్డూ, అదుపు లేకుండా మట్టి మాఫియా


ఏలూరు, జూన్ 8, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరి రెండు వారాలు కూడా కాలేదు. పరిపాలన ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే మట్టి దొంగలు అక్రమంగా మట్టి తరలింపునకు శ్రీకారం చుట్టారు. పట్టపగలే భారీ యంత్రాల సహాయంతో లారీలలో మట్టి లోడ్‌ చేసుకుని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. కొత్తూరు చెరువులో అధికారుల సాక్షిగా మట్టి తరలింపు యదేచ్ఛగా కొనసాగుతుంది. పరిపాలన మొదలు కాకుండానే ఇంత బరితెగింపా అని స్థానికులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అవినీతి రహిత పాలన అందజేస్తారని ఆశించి ఓటు వేసిన ప్రజలకు మొదటలోనే మట్టి మాఫియా కోరలు విప్పడానికీ సిద్ధం కావడంతో ప్రజలు సుపరిపాలన ఆశనిపాతం అవుతుందా! అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మండలంలోని వింజరం గ్రామ సమీపంలో ఉన్న కొత్తూరు చెరువు ఆయకట్టు 218 ఎకరాల 8 సెంట్లు ఉండగా అందులో 95 ఎకరాల విస్తీర్ణంలో చెరువు వ్యాపించి ఉంది.


అడ్డూ, అదుపు లేకుండా మట్టి మాఫియా
కొత్తూరు చెరువు గత ప్రభుత్వ పాలన నుండే పాలక వర్గానికి కల్ప తరువులా ఉండేది. ప్రతి సంవత్సరం నీరు-చెట్టు కార్యక్రమం పేరిట లక్షలాది రూపాయలను వెచ్చించి చెరువులో మట్టి పూడికతీత పనులను ఇరిగేషన్‌ అధికారులు చేయిస్తుంటారు. అలా పూడిక తీత పనులు తూతూ మంత్రంగా చేసి బిల్లులు పెట్టి సొమ్ము చేసుకోవడం రివాజుగా మారింది. పూడికతీత ఎలా ఉన్నా లక్షలాది రూపాయలు లాభం చేకూరుతుంది.అసలు చెరువులో పూడిక తీసిన మట్టిని ప్రభుత్వ కార్యాలయాలకు గాని, ప్రభుత్వ పాఠశాలలకు, తదితర ప్రజలకు ఉపయోగపడే విధంగా లెవలింగ్‌ పనులకు ఉపయోగించాలి. కానీ కొత్తూరులో పూడిక తీసిన మట్టిని ఇటుక బట్టీలకు తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు. కాసుల మాయాజాలంలో చిక్కుకున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కొత్తూరు చెరువు నుండి మట్టిని పొక్లెయిన్ల సహాయంతో లారీలలో లోడ్‌ చేసి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ తరలింపు వ్యవహారం రేయింబవళ్ళు జరుగుతుందని చెబుతున్నారు. లారీలు శరవేగంగా దూసుకు పోతుండడంతో ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతాయోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఈ విషయంపై పోలీసులకు, రెవెన్యూ శాఖకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలవరం తహశీల్దార్‌, ఎస్‌ఐ సూరీర్య రామచంద్ర్రరావులు తెలిపారు. మట్టి అక్రమ తవ్వకం పట్ల చుట్టు పక్కల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మట్టి తరలింపుకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.