స్పెషల్ డీఎస్సీ' మరోసారి వాయిదా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్పెషల్ డీఎస్సీ' మరోసారి వాయిదా


విజయవాడ, జూన్ 18 (way2newstv.com)
ఏపీలో స్పెషల్ డీఎస్సీ పరీక్ష మరోసారి వాయిదాపడింది. ఇప్పటికే పలు దఫాల వాయిదాల అనంతరం జూన్ 19న పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించగా.. తాజాగా మరోసారి వాయిదా పడింది. పరీక్షకు సన్నద్ధమవడానికి మరికొంత సమయం కావాలంటూ.. కొందరు అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్కు విన్నవించడంతో ఈ మేరకు.. పరీక్ష తేదీని జూన్ 30కి మారుస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


స్పెషల్ డీఎస్సీ' మరోసారి వాయిదా
ఏపీలో మొత్తం 602 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్ష కోసం మొత్తం 4,446 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ నోటిఫికేషన్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు, వెయిటేజీ ఐదు మార్కులు ఇచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఒప్పంద ఉద్యోగులు వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచాలని, వెయిటేజీ మార్కులను కూడా 5 నుంచి 10 మార్కులకు పెంచాలని విద్యాశాఖకు విన్నవించారు.వీరి విన్నపానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతో.. పరీక్ష నిర్వహణకు మార్గం సుగమమైంది. అయితే వయోపరిమితి సడలింపునిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కొందరు దరఖాస్తు చేసుకున్నారు. వీరు తమకు చదువుకునేందుకు మరికొంత సమయం కావాలంటూ కోరడంతో పరీక్షను వాయిదా వేశారు.