ఎమ్మెల్యే రోజాను అమరావతి రావాలంటూ ముఖ్యమంత్రి జగన్ కబురు పంపారని వస్తున్న వార్తలపై రోజా స్పందించారు. ఆ వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తనను ఎవరూ అమరావతికి రావాలని పిలవలేదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు. విజయవాడకు వచ్చిన ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు.
కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదు: రోజా
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే అమరావతికి వచ్చానని స్పష్టం చేశారు. మంత్రి పదవి దక్కలేదని తనకు ఏమాత్రం బాధలేదన్నారు. కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు తాను అలిగానని వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తాను కులాలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికి రోజా శుభాకాంక్షలు తెలిపారు.