నిజామాబాద్, జూన్ 3 (way2newstv.com):
నగరంలో పారిశుద్ధ్య స్థితిని మెరుగుపరచడంలో యంత్రాంగం ఉదాసీన వైఖరి ప్రజలకు శాపంగా మారుతోంది. ప్రతీసారి మొక్కుబడి చర్యలతో యంత్రాంగం చేతులు దులుపుకుంటోంది. క్షేత్రస్థాయిలో తగినంత శ్రద్ధ చూపడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. మలేరియా, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రభలడానికి దోమలే కారణమని తెలిసినా మెతక వైఖరి వీడడం లేదు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో అధ్వాన పారిశుద్ధ్య దుస్థితితో సమస్య నానాటికి జఠిలమవుతోంది.పారిశుద్ధ్య స్థితిని మెరుగుపరచడానికి నిరంతర చర్యలు అవసరం. కాని క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతంతమాత్రంగానే స్పందిస్తోంది. జిల్లాకేంద్రంలో 33 వార్డులున్నాయి. లక్షకుపైగా జనాభా ఉంది. ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు కాలనీలు, మురికి వాడల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో దోమలు విజృంభిస్తున్నాయి. లక్ష జనాభా ఉన్న పట్టణంలో ఫాగింగ్ యంత్రం ఒకటే ఉందంటే అతిశయోక్తి కాదు. ఆర్థిక సంఘం నిధుల నుంచి యంత్రాల కొనుగోలుకు శ్రద్ధ చూపకపోవడం గమనార్హం.
పేరుకే పారిశుద్ధ్యం (నిజామాబాద్)
అంతర్గత కాలనీల్లోని మురుగుకాల్వల్లో నెలల తరబడి పూడికలు తొలగడం లేదు. దోమల నివారణకు మందుల పిచికారి సక్రమంగా చేయడం లేదు. ఖాళీ స్థలాల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలు వెలుస్తున్నాయి. గతంలో వీటికి తాకీదులిచ్చి తగిన చర్యలు చేపడతామన్నా అతీగతీ లేదు.మరో పక్షం రోజుల్లో వర్షాకాలం రానుంది. సీజనల్ వ్యాధులు ప్రభలే వీలుంది. దీనికి తోడు ఖాళీస్థలాల్లో నీటి నిల్వలు, కాల్వల పూడికలు పేరుకుపోవడంతో దోమల ఉత్పత్తి పెరుగుతోంది. పట్టణంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఖాళీ స్థలాల్లో దోమల ఉత్పత్తి కేంద్రాలను బల్దియా పర్యవేక్షణలోనే నిర్వహణ సాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. పట్టణంలోని విద్యానగర్, అశోక్‌నగర్, స్నేహపురికాలనీ, బతకమ్మకుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్, హౌజింగ్‌బోర్డుకాలనీ, ఆర్‌బీనగర్, గొల్లవాడ, ఇస్లాంపురా, బర్కత్‌పురా, సైలన్‌బాబాకాలనీ, ఎన్జీవోస్‌కాలనీ తదితర ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. పారిశుద్ధ్య స్థితిని మెరుగుపరచడానికి పక్షోత్సవాలు, ప్రత్యేక డ్రైవ్‌లు సత్ఫలితాలనివ్వడం తాత్కాలికమే. క్షేత్ర స్థాయిలో నిరంతర చర్యలు చేపడితేనే ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వొచ్చు. మొక్కుబడిగా అప్పటికప్పుడు చర్యలు చేపట్టి ఆ తర్వాత వదిలేయడంతో స్థానికుల నుంచి తరచూ చుక్కెదురవుతుంది. ప్రత్యేక కార్యచరణతో నిరంతరం పర్యవేక్షిస్తేనే ఇబ్బందులను అధిగమించవచ్చు. దోమల బెడద కారణంగా ఆసుపత్రుల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగీ వ్యాధికి సంబంధించి శరీరంలో రక్త ఫలకికల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మెరుగైన చికిత్సల నిమిత్తం వైద్యులు రాజధానికి సిఫారసు చేస్తున్నారు. దోమలే వ్యాధులకు కారణమనీ తెలిసీ అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోవడంతో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది.
Tags:
telangananews