ఇంటర్ విద్య మిథ్యేనా..? (శ్రీకాకుళం)

సీతంపేట, జూన్ 2 (way2newstv.com): 
జిల్లాలోని గిరిజన విద్యార్థులకు ఇంటర్‌ విద్య మిథ్యగానే మిగులుతుంది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఇంటర్మీడియట్‌ సీట్లు లేకపోవడంతో అనేక మంది ఇంటర్‌ చదువుకు దూరమవుతున్నారు. గిరిజన విద్యపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్నట్లు పాలకులు గొప్పలు చెప్పుకోవడమే తప్పా కనీసం తమకు అందుబాటులో గల గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ చదువుకుందామంటే కుదరని పరిస్థితి క్షేత్ర స్థాయిలో కనిపిస్తుంది. జిల్లాలో మూడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అక్కడ సైతం తక్కువగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు సీట్లు ఉండటంతో పోస్టు మెట్రిక్‌ వసతి గృహాలను ఆశ్రయించాల్సి వస్తోంది. పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ఉంటూ ఇతర కళాశాలల్లో చదివితే బాలికలకు తగిన రక్షణ ఉండదు. పదో తరగతి వరకు ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పూర్తి రక్షణతో చదివే గిరిజన విద్యార్థులు ఇంటర్‌కు వచ్చేసరికి పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ఉండి చదవాలంటే ఇబ్బంది అని చాలా మంది తమ చదువులకు స్వస్తి చెప్పేస్తున్నారు. జిల్లాలో 30 ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి అమలవుతుంది. అందులో కొన్ని చోట్లైనా ఇంటర్మీడియట్‌ ప్రవేశపెడితే ఎంతో ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్ విద్య మిథ్యేనా..? (శ్రీకాకుళం)
పదో తరగతి వరకు ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో పూర్తి రక్షణతో చదివే గిరిజన విద్యార్థులకు ఇంటర్‌కు వచ్చే సరికి సీట్ల కోసం ఆరాటపడాల్సిన దుస్థితి కలుగుతుంది. కేవలం గురుకులాల్లోనే ఇంటర్‌ విద్య అందుబాటులో ఉంది. అది సైతం తక్కువ సీట్లు. దీంతో జిల్లాలోని 16 గిరిజన సంక్షేమ పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ఉంటూ ఇతర కళాశాలల్లో చదవాల్సిన పరిస్థితి గిరిజన విద్యార్థులకు ఏర్పడుతుంది. బాలురకు కొంత వరకు ఇబ్బంది లేకున్నా.. బాలికలకు మాత్రం తగిన రక్షణ కరవవుతుంది. ఉండేది ఒక చోట.. కళాశాల వేరే చోట కావడంతో బాలికలకు ఇబ్బంది కలుగుతుంది. అదే ఆశ్రమ పాఠశాలల మాదిరిగా గిరిజన సంక్షేమ కళాశాలలు ఏర్పాటు చేస్తే చాలా వరకు మేలు కలుగుతుంది. జిల్లాలో 30 వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అందులో ఎక్కువ విద్యార్థుల సంఖ్యతో పాటు వసతి సౌకర్యాలు, స్థలం అందుబాటులో ఉండే ఆశ్రమ పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ముఖ్యంగా బాలికలకు తగిన రక్షణ కలుగుతుంది. నాణ్యమైన విద్య అందుతుంది. ఆ దిశగా చర్యలు చేపడితేనే ఫలితం ఉంటుందని అంటున్నారు.జిల్లాలోని సీతంపేటలోని గిరిజన సంక్షేమ బాలురు, బాలికల గురుకుల కళాశాలలు, మెళియాపుట్టి మండలం పెద్దమడిలోని బాలుర గురుకుల కళాశాలలో కేవలం 430 సీట్లు మాత్రమే ఇంటర్‌ ప్రథమ సంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్నాయి. సీతంపేట బాలుర గురుకుల కళాశాల(ఆంగ్ల మాధ్యమం)లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులకు 120 సీట్లు, వృత్తి విద్యా కోర్సు(ఏ అండ్‌ టీ, సీజీఏ)లకు 50 సీట్లు, సీతంపేట బాలికల గురుకుల కళాశాల(ఆంగ్లం మీడియం) ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ గ్రూపులకు 120 సీట్లు, వృత్తి విద్యా కోర్సు(ఏ అండ్‌ టీ)కి 20 సీట్లు, మెళియాపుట్టి మండలం పెద్దమడి గురుకుల కళాశాల(తెలుగు మీడియం)లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులకు 120 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి మెరిట్‌ ఆధారంగా భర్తీ అయిపోతే మిగతా వారికి సీట్లు లభించని పరిస్థితి ఉంటుంది. మిగతా వారు పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో ఉంటూ వేరే కళాశాలల్లో చదవడమో, అలా చేయలేని వారు చదువుకు స్వస్తి చెప్పి డ్రాపౌట్‌లుగా మిగిలిపోవడమో జరగనుంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కలుగుతుంది.జిల్లాలోని 30 ఆశ్రమ పాఠశాలలు, మూడు గిరిజన గురుకులాలు, మూడు బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో మొత్తం 1,849 మంది గిరిజన విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 1,645 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే కేజీబీవీలు, సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరతగతి చదివి ఉత్తీర్ణులైన వారు మరో 1,500 మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. గురుకులాల్లో 430 సీట్లు అందుబాటులో ఉండగా పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు సుమారు మూడు వేలకు పైగా ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఇంటర్‌ సీట్లకు గిరాకీ ఏర్పడుతుంది. ఉన్న కళాశాలల్లో అయినా సీట్లు, గ్రూపులు పెంచి అదనపు సౌకర్యాలు కల్పిస్తే కొంత ఇబ్బంది తీరుతుంది. కాని ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇబ్బంది కలుగుతుంది.
Previous Post Next Post