శ్రీకాకుళం, జూన్ 17, (way2newstv.com)
రిమ్స్ ఆరంభ శూరత్వంగా మిగిలిపోనుంది. రోగులకు వర ప్రధాయినిగా భావించిన ‘రిమ్స్’ వెలుగు మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోతోంది. రాష్ట్రంలో రిమ్స్‌లను బోధన ఆసుపత్రులుగా గుర్తించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మిగిలిన బోధన ఆసుపత్రుల మాదిరిగానే వీటిల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలనేది ప్రభుత్వ సంకల్పం. స్వయం ప్రతిపత్తితో ఉన్నతస్థాయిలో వైద్య సేవలు అందించాల్సిన ‘రిమ్స్’ భవిత మంత్రి వర్గ నిర్ణయంపై ఆధారపడి ఉంది.: హైదరాబాదులోని నిమ్స్, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రుల మాదిరిగా ‘రిమ్స్’ను తీర్చి దిద్దాలన్నది సంకల్పం. శ్రీకాకుళంతో పాటు ఒంగోలు, కడపల్లో శాసనసభ చట్టం ద్వారా వైఎస్ ప్రభుత్వం వీటిని నెలకొల్పింది. పర్యవేక్షణకు సంచాలకులను నియమిస్తారు.
రిమ్స్ కు రాని హోదా
డీన్, మెడికల్ సూపరింటెండెంట్, కార్యనిర్వాహక రిజిస్ట్రార్ ఒక్కొక్కరు వంతున, 21 మంది ఆచార్యులు, 30 మంది సహ ఆచార్యులు, 46 సహాయక ఆచార్యులు, 56 మంది అధ్యాపక ఉద్యోగాలను మంజూరు చేసింది. వీరికి తోడు ఒక ఉపసంచాలకుడు, ఐదుగురు సూపరింటెండెంట్లు అవసరం. ముఖ్యమంత్రి అధ్యక్షతన పరిపాలన కమిటీ.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అధ్యక్షతన, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభృతులు సభ్యులుగా ఉండే కార్య నిర్వాహక కమిటీల నియంత్రణలో రిమ్స్ పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాలన్నింటినీ కార్య నిర్వాహక కమిటీ చూసుకుంటుంది. శ్రీకాకుళం వెనకబడిన జిల్లా. విద్య, వైద్య, రవాణా తదితర మౌలిక వసతులు పూర్తిగా అందుబాటులో లేవు. అందుకే ఇక్కడికి వచ్చేందుకు ఉన్నతాధికారులు కొందరు ఆసక్తి చూపరు. ఏదొక రూపంలో ఇక్కడికి బదిలీ చేసినా.. పని చేసేందుకు సుముఖత చూపరు. తదుపరి నియామకం వచ్చేదాకా సెలవుల్లో గడిపేసి బాధ్యతల నుంచి తప్పించుకుంటారు. చాలా శాఖల్లో ఇదే పరిస్థితి. నిరంతరం అందుబాటులో ఉండాల్సిన వైద్యులు మాత్రం జిల్లాలో పని చేసేందుకు ఎందుకు ఇష్టపడతారు? ఇవన్నీ ప్రభుత్వంలో ఆలోచన రేపాయి. అనుభవాలు నేర్పిన పాఠాలతోనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టెంపరరీ హోదాతో రిమ్స్‌ను ప్రభుత్వం నెలకొల్పింది.