అరకులోయలో భూసార సంరక్షణ కార్యాలయ గేటు మూసివేసి ఉండడం, కార్యాలయం లోపల అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో గిరిజనులకు ఈ శాఖ సేవలు అందడం లేదు. కనీసం ఆఫీసుకు వచ్చిన రైతులకు సమాధానం చెప్పే నాధుడు కరువయ్యారు. ఈ ఆఫీసు ఉన్నట్టా? లేనట్టా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఎడి, ఇద్దరు ఎఒలు, ఒక ఎఇ, 9 మంది సబ్ అసిస్టెంట్లు, ఒక సూపరింటెండెంట్, ఒక డిఎం, ఒక ట్రెజరరీ, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టెక్నికల్ మేస్త్రీ, నలుగురు వాచ్‌మెన్‌లు ఉండాల్సివుంది. కానీ ఈ శాఖలో ఎడి, ఎఒ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఐదుగురు సబ్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎడితో సహా ఏ ఒక్కరూ సక్రమంగా విధులకు రావటం లేదు. టైపిస్టు, తాత్కాలిక అటెండర్ మాత్రమే అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు. ఒక పక్క ఎటువంటి పనులు లేవంటూనే మరో పక్క ఆఫీసుకు ఎవరైనా వెళ్లి అడిగితే ఫీల్డ్‌కి వెళ్లారని అటెండర్ సమాధానం చెబుతుండడం గమనార్హం. ఎడి, ఎఒ అందుబాటులో ఉండడం లేదు. దీనిపై ఫోన్‌లో సంప్రదిస్తే విశాఖపట్నం సమావేశంలో ఉన్నామంటూ సమాధానాలు చెప్పడం పరిపాటిగా మారింది.
గిరిజన కార్యాలయంలో అధికారులు ఆడిందే ఆట..పాడిందే పాట
వాస్తవానికి విశాఖ, విజయనగరంలోని తమతమ ఇళ్లల్లో మకాం వేసి విధులకు నిత్యం డుమ్మా కొడుతున్నారన్నది బహిరంగా రహాస్యమే. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ యంత్రం పెడుతున్నా ఇక్కడ పెట్టలేదు. అరకులోయ భూసార పరిరక్షణ కార్యాలయంలో బయోమెట్రిక్ పెట్టకపోవడంతో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా ధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు బాహాటంగానే విన్పిస్తున్నాయి. ఎప్పుడో చుట్టపు చూపుగా రెండు, మూడు వారాల కోమారు, నెలకోమారు వచ్చి హాజరు వేసుకుని వెళ్లి పోతున్నారు. రెండేళ్లగా నిధులు మంజూరు కాక ఎటువంటి చిన్న పని కూడా జరగలేదని చెబుతున్న అధికారులు, సిబ్బంది ఖాళీగా కాలయాపన చేస్తూ.. జీతాలు మాత్రం ప్రతి నెలా తీసుకుంటున్నారు. అయినా ఉన్నతాధికారులు ఈ శాఖపై కనీసం కన్నెత్తి చూడలేదు. సంవత్సరానికి ఒక్కసారి కూడా భూసార శాఖ పనితీరుపై పర్యవేక్షణ చేయకపోవడంతో ఇక్కడ పని చేసే వారంతా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. 2014లో వచ్చిన హుదూద్ తుపానులో భూసార శాఖలోని ఎడి చాంబర్‌పై చెట్టుకూలడంతో పూర్తిగా దెబ్బతింది. అయినా ఎవ్వరూ పట్టించుకోక ఇప్పటికీ శిథిలావస్థలోనే వుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ శాఖపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని గిరిజన రైతులు స్పష్టం చేస్తున్నారు. గిరిజనులకు ఎటువంటి మేలు చేయనప్పుడు ఇక్కడ ఆఫీసు, సిబ్బంది ఉన్నా, లేకున్నా ఒక్కటే అని గిరిజనులు అంటున్నారు