ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మరికొద్ది రోజుల్లోనూ మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. జూన్ 8న కేబినెట్ విస్తరణ చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఎంతమంది చోటు దక్కుతుంది ? ఎవరెవరికి ఛాన్స్ ఉంటుంది ? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సంగతి ఎలా ఉన్నా... సీఎం జగన్ ఎవరికైనా డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వైసీపీఎల్పీ నేతగా జగన్ ఎన్నికైన సమయంలోనూ వేదికపై జగన్‌తో పాటు ఆయన ఒక్కరే ఉన్నారు.
ఉమారెడ్డికి బెర్తు ఖాయం....
అలాంటి ఉమ్మారెడ్డికి జగన్ కేబినెట్‌లో చోటు ఖాయమని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఉమ్మారెడ్డికి జగన్ కేవలం మంత్రిగా అవకాశం ఇస్తారా ? లేక ఆయనను డిప్యూటీ సీఎం చేస్తారా ? అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు... తన కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ఎవరికీ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వని చంద్రబాబు... నవ్యాంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇద్దరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే తనకంటే కొద్దిరోజుల ముందు తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్‌లో ఇద్దరికీ డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడం వల్లే చంద్రబాబు కూడా తన కేబినెట్‌లో ఇద్దరికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే రెండోసారి భారీ మెజార్టీతో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్... ఈసారి కూడా ఎవరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించలేదు. దీంతో జగన్ కేసీఆర్ బాటలో పయనిస్తారా లేక చంద్రబాబులా వ్యవహరిస్తారా అన్నది ప్రాధాన్యత సంతకరించుకుంది.