పసుపులేటి డోర్లు మూసుకుపోయినట్టేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పసుపులేటి డోర్లు మూసుకుపోయినట్టేనా


విశాఖపట్టణం, జూలై 8, (way2newstv.com)
సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్నా.. ఒక్కోసారి అంచ‌నాలు త‌ప్పి నిలువునా ముంచేస్తాయి. గ‌తి త‌ప్పిన‌ నిర్ణయాలు అధోగ‌తిపాలు చేస్తాయి. ఆకాశం నుంచి నేల‌కేసి కొడుతాయి. రాజ‌కీయమంటే ఇదే కాబోలు..! ఎప్పుడు.. ఎవ‌రు.. ఎక్కడ ఉంటారో చెప్పడం క‌ష్టమే మ‌రి. ఒకానొక‌ప్పుడు అసామాన్య నేత‌లుగా వెలుగొందిన వారు.. సామాన్యులుగా మిగిలిపోతున్నారు. ప్రత్యర్థుల‌కు కంటి మీద కునుకులేకుండా చేసిన వారు.. నేడు జ‌నం మ‌ధ్య ఉనికిపాట్లు ప‌డుతున్నారు. అయినా.. ఇప్పుడు ఈ ఇదంతా ఎందుకు చెబుతున్నార‌నే డౌటు మీ వ‌స్తుంది క‌దా..? ఇక సూటిగా విషయానికి వ‌చ్చేద్దాం. ప‌సుపులేటి బాల‌రాజు. మాజీ మంత్రి. వైఎస్సార్ హ‌యాంలో ఉత్తరాంధ్రలో తిరుగులేని నేత‌.కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హాయంలోనూ పసుపులేటి బాల‌రాజు హ‌వా న‌డిచింది. కానీ, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానం తిరోగ‌మ‌నంలోకి వెళ్లింది. 

పసుపులేటి డోర్లు మూసుకుపోయినట్టేనా

విశాఖ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన బాల‌రాజు రాజ‌కీయ జీవితం చుట్టూ ఇప్పుడు చీక‌ట్లు క‌మ్ముకుంటున్నాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బాల‌రాజు ఓట‌మిపాల‌య్యారు. ఇక ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయ హ‌వా క్రమంగా త‌గ్గుతూ వ‌చ్చింది. ఈ క్రమంలోనే వ‌చ్చిన జ‌న‌సేన పార్టీ బాల‌రాజుకు ఆశాజ‌న‌కంగా క‌నిపించింది. ప‌వ‌న్‌తో క‌లిసి.. మ‌ళ్లీ రాజ‌కీయంగా వెలుగొంద‌వ‌చ్చున‌న్న అంచ‌నాకు ఆయ‌న వ‌చ్చేశారు. ఇదే స‌మ‌యంలో ఉత్తరాంధ్రలో జ‌న‌సేన పార్టీకి అండ‌గా నిలిచి పూర్వవైభ‌వాన్ని తెచ్చుకోవ‌చ్చున‌న్న అంచ‌నాకు ఆయ‌న వ‌చ్చేశారుకానీ.. 2019 ఎన్నిక‌ల్లో పాడేరు నుంచి జ‌న‌సేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి బాలరాజు దారుణంగా ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన పార్టీ కేవ‌లం ఒకే ఒక్క సీటుకే ప‌రిమితం అయింది. ఇక పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓట‌మిపాల‌య్యారు. ఈ ఫ‌లితాల‌తో బాల‌రాజు రాజ‌కీయంగా మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయారు. నిజానికి.. మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు ఆయ‌నది దిక్కుతెలియ‌ని, దారితోచ‌ని స్థితే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతుంద‌న్న అంశంపై ఉత్తరాంధ్రలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌నాడు మ‌న్యంలో కింగ్‌గా ఉన్న బాల‌రాజును నేడు ప‌వ‌న్ ప‌ట్టించుకునే ప‌రిస్థితే లేదు.వాస్తవానికి పసుపులేటి బాల‌రాజుకు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆయ‌న‌కు ముందుగా అర‌కు ఎంపీ సీటు ఇస్తామ‌న్నారు. బాల‌రాజు మాత్రం త‌న‌కు పాడేరు అసెంబ్లీయే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టడంతో జ‌గ‌న్ ఒప్పుకోలేదు. దీంతో బాల‌రాజు జ‌న‌సేన‌లోకి వెళ్లి ఆ పార్టీ నుంచి రంగంలో ఉండి చిత్తుగా ఓడిపోయారు. రాజ‌కీయాల్లో ఒక్కసారి రాంగ్‌స్టెప్ వేస్తే ఇలాగే ఉంటుంద‌న్న విష‌యం బాల‌రాజు విష‌యంలో మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది.