సీట్లు ఖాళీ (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీట్లు ఖాళీ (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూలై 16 (way2newstv.com): 
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరంలో సీట్లు భారీ మొత్తంలో మిగిలియాయి. దీని కారణంగా కొన్ని ప్రైవేట్‌ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు మూడు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించింది. మొత్తంగా కేవలం 38 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఆన్‌లైన్‌ విధానంపై విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు కూడా ఒకింత ప్రభావం చూపాయని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. సీట్లు పొందిన వారు వివిధ కళాశాలల్లో సంబంధిత కోర్సుల్లో 25 శాతం కంటే తక్కువ సీట్లు పొందిన వారిని, అక్కడ కోర్సు నిలిపివేసి దగ్గరలో ఉన్న మరో కళాశాలలో విలీనం చేసేందుకు యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 
సీట్లు ఖాళీ (మహబూబ్ నగర్)

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 90 డిగ్రీ కళాశాలలు ఉండగా ఇందులో 21 ప్రభుత్వ, 3 అటానమస్‌ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 33,380 సీట్లకు విద్యార్థులు అడ్మిషన్‌ పొందాల్సి ఉండగా.. కేవలం 8,978 మంది మాత్రమే ప్రవేశం పొందారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో కలిపి 38 శాతమే భర్తీ అయ్యింది. అయితే చాలా వరకు ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లు భర్తీ కాలేదని చాలామంది అభిప్రాయపడుతున్నా.. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. కొంత మంది విద్యార్థులు సంప్రదాయ కోర్సుల వైపు మొగ్గు చూపకపోవడం, అనుకున్న చోట సీటు రాకపోవడం వంటి కారణాలున్నాయి. అయితే రెండో దశ కౌన్సెలింగ్‌లో అవే కళాశాలల్లో సీట్లు కావాలని విద్యార్థులు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో రూరల్‌ ప్రాంతాల్లో ఉన్న కళాశాలల్లో ఎక్కవ మొత్తంలో సీట్లు మిగిలిపోయాయి. ఇక మూడో దశలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఏ కళాశాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఎక్కడ సీట్లు భర్తీ అయ్యాయి అనే అంశాలు తెలియకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీట్లు రాని చాలామంది విద్యార్థులు టీటీసీ, ఇంజినీరింగ్‌తోపాటు ఐటీఐ, డిప్లొమా వంటి కోర్సులకు మళ్లారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో సంప్రదాయ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ వంటి కోర్సులు చాలా వరకు ఆదరణ తగ్గిందనే చెప్పవచ్చు. కొత్తగా ప్రారంభించిన కోర్సుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు సీట్ల కేటాయింపుల్లో మార్కులు, ఆర్థిక, సామాజిక అంశాల వారీగా సీట్లు కేటాయించే ప్రక్రియ మూడు దశల్లో కౌన్సెలింగ్‌లో జరిగింది. అయితే విద్యార్థులకు ప్రభుత్వం అందించే ట్యూషన్‌ ఫీజు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వంటివి అందించగా నేరుగా యాజమాన్యాలు వివిధ కోర్సుల ఆధారంగా రూ.14 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేసేలా వెసులుబాటు కల్పించింది. దీని కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ప్రతిభ ఉన్న విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్యా కళాశాలల వైపు మొగ్గుచూపారు. ఈ కారణంగా ఎక్కువ సీట్లు ప్రైవేట్‌ కళాశాలల్లో మిగిలిపోయాయి. దీంతో 25 శాతం కంటే తక్కువ సీట్లు ఉన్న సీట్లను ఇతర కళాశాలల్లో విలీనం చేయడం వల్ల వాటి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.  ఉమ్మడి పాలమూరులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఈ క్రమం లో వివిధ కళాశాలల్లో విద్యార్థులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే కోర్సుల్లో 25 శాతం సీట్లు భర్తీ కానీ కళాశాలల్లో వి ద్యార్థులను ఇతర కళాశాలల్లోకి మార్చనున్నారు. ఒక కోర్సులో మొ త్తం 40 సీట్లు ఉంటాయి. వీటిలో కనీసం 10 మంది విద్యార్థులైనా అడ్మిషన్‌ లేకపోతే అక్కడ వారికి తరగతులు బోధించడం అనేది ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలకు తలమించిన భారం. ఈ కారణంగా అధికారులు విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన విద్యను అందించాలంటే కోర్సులను ఇతర కళాశాలల్లో విలీనం చేయనున్నారు. ఇక జీరో శాతం అడ్మిషన్లు ఉన్న కళాశాలలో పూర్తిగా కోర్సులను తొలగించనున్నారు.