ఉడాకు భారంగా మారుతున్న ట్రై జంక్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉడాకు భారంగా మారుతున్న ట్రై జంక్షన్

విశాఖపట్టణం, జూలై 12, (way2newstv.com)
విశాఖపట్నంలోని గాజువాక, సబ్బవరం, పరవాడ మండలాల పరిధిలోని ట్రై జంక్షన్‌ ప్రాంతంలో ఉన్న 900 ఎకరాల భూమితో పాటు కొమ్మాది, పరదేశి పాలెంలలో ఉన్న 149.77 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. భూ సమీకరణంతా విశాఖ నగరాభివృద్ధి సంస్థ చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూ సమీకరణ చేపట్టాలంటే వుడా సిబ్బందంతా కనీసం రెండు నెలలు పూర్తిగా అదే పనిపై ఉండాలి. పైగా వుడా వద్ద అంత సిబ్బంది కూడా లేదు. దీంతో ఈ పనిని రెవెన్యూకు అప్పగిస్తేనే బాగుంటుందని వుడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి కచ్చితంగా వుడానే ఈ పని చేయాలని జిఒ వస్తే చేయాల్సిందే తప్ప తప్పించుకునే పరిస్థితి కనిపించడంలేదు. మూడు మండలాలను కలుపుతూ ట్రై జంక్షన్‌లో పెద్ద హౌసింగ్‌ నిర్మించనున్నారు. 
ఉడాకు భారంగా మారుతున్న ట్రై జంక్షన్

ఈ మూడు మండలాల పరిధిలో ఆరు కొండల మధ్య ఉన్న ఈ ప్రభుత్వ భూములను సమీకరణ చేయాల్సి ఉంది. గాజువాక మండలంలో అగనంపూడి, సబ్బవరం మండలంలో నంగినారపాడు, గంగవరం, పరవాడ మండలంలో పెదముషిడివాడ, ఈ.మర్రిపాలెం గ్రామాల్లో ప్రభుత్వ భూమి 900 ఎకరాలు వున్నట్టు అధికారులు గుర్తించారు. అందులో 126 ఎకరాలను పేదలకు అసైన్‌ చేశారు. మరో 491 ఎకరాల్లో కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ భూములను అమరావతి తరహాలో ల్యాండ్‌ పూలింగ్‌ చేయాలని నిర్ణయించారు. ఇలా సమీకరించే భూమిలో 150 ఎకరాలను స్పోర్ట్స్‌ స్టేడియానికి కేటాయిస్తారు. మరో 300 ఎకరాల్లో  హౌసింగ్‌ ప్రాజెక్టు చేపడతారు. అలాగే కొమ్మాది, పరదేశిపాలెంలలో కూడా సుమారు 150 ఎకరాల్లో భూమిని సమీకరిస్తారు. అక్కడ కూడా హౌసింగ్‌ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో ల్యాండ్‌ పూలింగ్‌ వల్ల వుడాలో రూ.540 కోట్ల భూ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో వుడా వీసీ బసంత్‌ కుమార్‌ ల్యాండ్‌ పూలింగ్‌ బాధ్యత వుడా తీసుకోదని, జిల్లా రెవెన్యూ అధికారులు ఆ ప్రక్రియ పూర్తి చేసి భూములు వుడాకు అప్పగిస్తే అభివద్ధి కార్యక్రమాలు తాము చేపడతామని గతం నుంచీ చెప్పుకొస్తున్నారు. ఇటీవల మంత్రి వర్గం మాత్రం వుడానే ట్రై జంక్షన్‌లో భూమిని సమీకరిస్తుందని చెప్పడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే కచ్చితంగా భూములను వుడానే సమీకరించాలని, ఎటువంటి జిఒ రాలేదని విసి చెబుతున్నారు. జిఒ వస్తే అప్పుడు భూ సమీకరణ కోసం ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు.