నిరాశతో ముగిసిన మామిడి సీజన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిరాశతో ముగిసిన మామిడి సీజన్

తిరుపతి, జూలై 22, (way2newstv.com)
చిత్తూరు జిల్లాలో మామిడి రైతు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యింది. పంటను కోసి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర రాదనే ఆందోళన. కోయకుండా వదిలేద్దామంటే పెట్టుబడి దక్కదనే భయం. ఈ సందిగ్ధం ఈ ఏడాది మామిడి రైతును సీజన్‌ ఆద్యంతం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ 90 వేల టన్నుల పంట చెట్ల మీదే వుందని అంచనా. మామిడి కాయలను పల్ప్‌ ఫ్యాక్టరీలకు అమ్ముకోవాలని ప్రభుత్వం చెపుతోంది. తెలుగుదేశం నాయకులు తమ వారినే ముందుగా పిలిచి కొనుగోలు చేయాలని పల్ఫ్‌ ఫ్యాక్టరీల వారికి సిఫార్సు చేస్తోంది. సామాన్య రైతులను మాత్రం వారాల తరబడి వాహనాలను నిలబెట్టేయడంతో ఆరు బయటే మగ్గిపోయి కుళ్లిపోతున్నాయి. 
నిరాశతో ముగిసిన మామిడి సీజన్

ఈ దశలో ఆ పంట తమకొద్దంటూ ఫ్యాక్టరీ యాజమాన్యాలు తిప్పి పంపేస్తున్నాయి. జిల్లాలోని రైతులు మామిడి వైపు మొగ్గు చూపారు. పంట బాగా వస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఆశపడ్డారు. జిల్లాలో 96వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి అత్యధికంగా 53శాతం, బేనీషా 25శాతం, నీలమ, మల్లిక, సింధూరా, కాలేపాడు, రుమాని రకాలు 22 శాతం పంట వేశారు. గతేడాదికన్నా ఈ ఏడాది సీజన్‌ ఆలస్యంగా ప్రారంభమైనా దిగుబడి, నాణ్యత బాగానే వున్నా రైతుకు మాత్రం నిరాశే మిగులుతోంది. ఈ ఏడాది మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం కిలో తోతాపురికి మద్దతు ధర రూ.7.50 ప్రకటించింది. గ్రామస్థాయి అధికారులు జారీ చేసే పర్మిట్లతో రైతులు గుజ్జు పరిశ్రమలకు మామిడిని తరలిస్తున్నారు. అయితే జిల్లాలో 56 గుజ్జు పరిశ్రమలు ప్రైవేట్‌వి ఉన్నా, వాటిలో కేవలం సగం మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ పరిశ్రమలు సైతం రోజుకు 6-7 టన్నుల మామిడిని మాత్రమే ప్రాసెసింగ్‌ సామర్ధ్యం కలిగి ఉన్నాయి. దీంతో కాయలు కొనుగోలు చేయలేమని కొన్ని పల్ఫ్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలు బోర్డులు పెట్టేస్తున్నాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు తెలుగుదేశం పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారి నుంచి కొనుగోలు చేస్తూ.. సామాన్య రైతులను రోడ్ల మీదే ఉంచేస్తున్నారు. దీంతో వాహనాల్లోనే పండ్లు కుళ్లిపోతున్నాయి. ఆ తరువాత ఆ పండ్లు తమకు పనికి రావని కొనుగోలు చేయబోమని తిప్పి పంపేస్తున్నారు. బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల, పూతలపట్టు, పులిచెర్ల, సదుం, సోమల మండలాల్లో ఎక్కువగానూ, మిగిలిన మండలాల్లో తక్కువగానూ తోటల్లోనే కాయలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. దాదాపు 90 వేల టన్నుల పంట చెట్లలోనే మాగిపోతోంది. పూర్తిస్థాయిలో గుజ్జు పరిశ్రమలు ఈ మామిడిని కొనుగోలుచేస్తేనే మామిడి రైతుకు కొంతైనా ఊరట లభిస్తుంది. పరిశ్రమల శాఖ మంత్రి జిల్లాలో ఉన్నా ఒక్క పల్ప్‌ ఫ్యాక్టరీ కూడా ప్రభుత్వం తరపున లేకపోవడం గమనార్హం. మామిడి పంటను వేసుకోవాలని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మార్కెటింగ్‌ చూపించకపోవడం రైతులకు శరాఘాతంగా మారింది. ప్రభుత్వ పరిశ్రమలు లేకపోవడంతో ప్రయివేట్‌ ఫ్యాక్టరీలు సిండికేట్‌గా ధరను శాసిస్తున్నాయి. కేజీ మామిడిపండ్లను రెండు రూపాయలకూ కొనే పరిస్థితి లేదు. కార్పొరేట్‌ కంపెనీలు ఈ రంగంలో ఉండడంతో దోపిడీకి హద్దూపద్దూ లేకుండా పోయింది.