వామ్మో...ఇదేం రోడ్డు

విశాఖపట్టణం, జూలై 22, (way2newstv.in)
అసలే నగరానికి ఆనుకొని వెళ్తున్న జాతీయరహదారి అది. నిత్యం వాహనదారులు, పాదచారులతో అతి రద్దీగా ఉండే కూడలి కూడా. రహదారికి ఆనుకొని ఉన్న కొండవాలు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఒక భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. జాతీయరహదారి గుండా పోయే వాహనదారులు, ప్రయాణికులు అందరి కళ్ళు ఆభవనంపైనే ఉంటున్నాయి. ఇదీ జాతీయరహదారి హనుమంతువాక కూడలి సమీపంలో గల కొండవాలు ప్రాంతంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనం పరిస్థితి. హనుమంతువాక సమీపంలో గల కొండవాలు ప్రాంతం అంచులో కొండచరియలు పడేవి. కొండవాలు ప్రాంతంలో ఉన్న నివాసాలు ప్రమాదకరంగా మారడంతో జివిఎంసి వాటికి రక్షణగా రిటర్నింగ్‌ వాలు కట్టేందుకు పనులు ప్రారంభించారు. 
వామ్మో...ఇదేం రోడ్డు

నాలుగు నెలల ముందు మొదటి విడత పనులు సంపూర్తిగా ముగించింది. రెండో విడత పనులను కొద్ది రోజుల క్రితం ప్రారంభించింది. మొదట్లోనే కొండ అంచున ఉన్న నివాసాల్లో ఉండే వారిని ఖాళీ చేయించారు. రెండోవిడత పనుల్ళో భాగంగా ఒక భవనాన్ని తొలిగించేందుకు జివిఎంసి అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ముందుగా భవనం శ్లాబ్‌ను తొలిగించేందుకు ప్రయత్నం చేశారు. కూలీలు దీనిని తొలిగించేందుకు ముందుకు రాకపోవడంతో దానిని విరమించుకున్నారు. ప్రస్తుతం కింది నుండే తొలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇళ్ళు జారిపడినా జాతీయరహదారి మీదకు రాకుండా పెద్ద సిమ్మెంటు దిమ్మలు తెచ్చి రోడ్డు అంచున ఉంచారు. కింది నుండి మట్టిని తొలిగించే క్రమంలో తొలిగించే క్రేన్‌పై పడుతుందోనని భయపడుతున్నారు. ఈ పనులు రాత్రిపూట సాగిస్తున్నారు. ఏదేమైనా ఈ భవనం తొలిగించేందుకు జివిఎంసి అధికారులకు, ఇంజినీర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు, సిబ్బంది ఎటువంటి ప్రమాదం జరగకుండా మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
Previous Post Next Post