చిక్కకుండా..కనిపించకుండా గంట శ్రీనివాసరావు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిక్కకుండా..కనిపించకుండా గంట శ్రీనివాసరావు

విశాఖపట్టణం, జూలై 25, (way2newstv.com)
ఆయ‌న మాజీ మంత్రి. ఎక్కడ నుంచి పోటీ చేసినా త‌న‌కు తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆయ‌న విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేక పోయారు. అదేస‌మ‌యంలో వివాదాల‌కు కూడా కేరాఫ్‌గానే ఉన్న ఆయ‌నే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. టీడీపీతో ప్రారంభ‌మైన ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానం ప్రజారాజ్యం త‌ర్వాత కాంగ్రెస్ మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చి చేరింది. ఆయ‌న ఇప్పటికే ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీ చేసినా గంటా శ్రీనివాస‌రావు విజ‌యాన్ని కైవ‌సం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గంటా శ్రీనివాస‌రావు విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. 
చిక్కకుండా..కనిపించకుండా గంట శ్రీనివాసరావు 

అయితే గంటా శ్రీనివాస‌రావు ఎన్నిక‌ల్లో పోటీ చేసే క్రమంలో తాను స్థానికుడిని కాక‌పోయినా.. నిత్యం ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటానని, నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తాన‌ని, త‌న‌ను విశ్వసించాల‌ని ఇక్కడి ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో విశాఖ ఉత్తరం ప్రజ‌లు స్థానికేత‌రుడు అయిన‌ప్పటికీ.. గంటా శ్రీనివాస‌రావుకు జై కొట్టారు. వైసీపీ అభ్యర్థి కెకె.రాజుపై చావుత‌ప్పి క‌న్నులొట్టపోయిన చందంగా గంటా గెలిచారు. అయితే, ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు ఆయన నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌లేదు.ప్రచారంలో గెలిచిన త‌ర్వాత అది చేస్తాను.. ఇది చేస్తాను.. అన్న గంటా శ్రీనివాస‌రావు ఇప్పటి వ‌ర‌కు మౌనం వ‌హించారు. దీంతో ఇక్కడి ప్రజ‌లు గంటా శ్రీనివాస‌రావు క‌నిపించుట‌లేదు.. అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు కుమ్మరిస్తున్నారు. గంటా శ్రీనివాస‌రావు ఫొటో పెట్టి మ‌రీ ఆయ‌నపై కామెంట్లు చేస్తుండ‌డంతో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌స్తోంది. వాస్తవానికి టీడీపీ రెండోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని గంటా శ్రీనివాస‌రావు భావించారు. అయితే, అనూహ్యంగా టీడీపీ ప్రతిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. దీంతో ఆయ‌న విదేశాల‌కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఏపీ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారు.త‌ను ఓ కూట‌మిగా ఏర్పడి.. దాదాపు 15 మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌తో ఉంచుకుని, పార్టీ మారేందుకు గంటా శ్రీనివాస‌రావు రంగం సిద్ధం చేసుకున్నార‌ని కొన్ని రోజుల కింద‌ట వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే, అవి ఉత్తివేన‌ని చెప్పారు. తాను పార్టీ మారేది లేద‌ని, త‌న ప్రయాణం టీడీపీతోనే టీడీపీలోనే కొన‌సాగుతుంద‌ని గంటా శ్రీనివాస‌రావు వెల్లడించారు. అయితే, ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న ప్రజ‌లకు ముఖం చూపించింది లేదు. స‌భ‌కు కూడా కేవ‌లం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు మాత్రమే ఒక్కసారి హాజ‌ర‌య్యారు. ఇక‌, అప్పటి నుంచి గంటా శ్రీనివాస‌రావు ఎవ‌రికీ చిక్కకుండా పోయారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. మ‌రి ఇప్పటికైనా.. గంటా శ్రీనివాస‌రావు ద‌ర్శన భాగ్యం నియోజ‌క‌వ‌ర్గం ప్రజ‌ల‌కు ద‌క్కుతుందో లేదో చూడాలి.