శక్తి బృందాలతో మహిళలకు రక్షణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శక్తి బృందాలతో మహిళలకు రక్షణ

విజయనగరం, జూలై 29, (way2newstv.com)
ప్రస్తుతం మహిళలపై ఇంటా.. బయటా అఘాయిత్యాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో భర్త రోజూ వేధిస్తున్నా.. బయటి ప్రపంచానికి చెప్పుకోలేని మహిళలెందరో ఉన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సహ విద్యార్థో.. ఉపాధ్యాయుడో.. అక్కడ పనిచేసే సిబ్బందో శారీరకంగా, మానసికంగా నరకయాతన చూపిస్తున్నా బయటికి చెప్పుకోలేని దుస్థితి. రోడ్లపై వెళ్తుంటే అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు.. కార్యాలయాల్లో ఇబ్బంది పెట్టే తోటి ఉద్యోగులు ఇలా పురుషుల ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరువు పోతుందనో.. సమాజం ఏమనుకుంటుందనో భావంతో బాధిత మహిళలు మౌనంగా ఉండిపోతున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు శక్తి టీమ్‌ సభ్యులు. చట్టాలపై అవగాహన కలిగించి చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా.. జిల్లా వ్యాప్తంగా బాధితురాళ్లు తమకు జరిగిన అన్యాయాలపై శక్తి టీమ్‌కు ఫోన్‌లో సమాచారమందిస్తున్నారు.
శక్తి బృందాలతో మహిళలకు రక్షణ

ఎస్పీ బి.రాజకుమారి ఈ ఏడాది జూన్‌ నెలలో శక్తి టీమ్‌లను ప్రారంభించారు. మహిళలపై దాడులను నిరోధించాలనే లక్ష్యంగా శక్తి బృందాలు పనిచేస్తాయి. ఇందుకోసం 24 మంది మహిళా కానిస్టేబుళ్లను పది శక్తి టీమ్‌లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతి సబ్‌ డివిజన్, డివిజన్‌ పరిధిలో ఈ టీమ్‌లు పనిచేస్తాయి. స్టేషన్‌ విధులతో సంబంధం లేకుండా మహిళా చట్టాలపై అవగాహన కల్పించేందుకు.. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈవ్‌ టీజింగ్‌ను అదుపు చేసేందుకు  పనిచేస్తాయి. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి మహిళా చట్టాలపై అవగాహన కలిగిస్తాయి. శక్తి బృందాలకు మహిళా పీఎస్‌ డిఎస్పీ పెంటారావు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. కంట్రోల్‌ రూమ్‌ సీఐ సుభద్రమ్మ బృందాల పనితీరును పర్యవేక్షిస్తారు. శక్తి బృందాల పనితీరు రోజూ పర్యవేక్షించి, ఎస్పీకీ నివేదికను అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు అందజేస్తారు.కానిస్టేబుళ్లుగా శిక్షణ ఇచ్చే సమయంలోనే శక్తి బృందాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న వారందరూ ముందుకు రావాలని సూచించారు. ముందుకొచ్చిన  వారందరికీ ప్రత్యేక శిక్షణ అందజేశారు. వీరికి ప్రత్యేకంగా స్కూటర్, కారు డ్రైవింగ్, ఈత, కరాటే, కుంగ్‌పూ, మహిళలు, చిన్న పిల్లల నేరాలకు సంబంధించిన చట్టాలు, పలు సామాజిక కోణాల్లో సమస్యను పరిష్కరించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో శక్తి టీమ్‌ శక్తిమంతమై రంగంలోకి దిగిందిశక్తి టీమ్‌లు ప్రారంభమై రెండు నెలలైనప్పటికీ మహిళలు, విద్యార్థినుల మనసులో స్థానం పొందాయి. శక్తి టీమ్‌ల పుణ్యమా అని కళాశాల వద్ద అల్లరిమూకలు కనిపించకపోవడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా టీమ్‌ల పరిధిలో ఎక్కడికక్కడ శక్తిటీమ్‌ డయల్‌ 100, 121, 1090 లేక వాట్సాప్‌ నంబర్‌ 6309898989కి కాల్‌ చేయమని సూచిస్తున్నారు. సంఘటన స్థలం చెబితే సెకెన్లలో అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తుండటంతో బాధితుల్లో ధైర్యం పెరిగింది. ఇక సమస్య తీవ్రతను బట్టి ఆ ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ అధికారి వద్ద సమస్యలను వివరించి, వాటికి కూడా పరిష్కారం చూపించడంతో ఎంతో మంది మహిళలు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు శక్తి టీమ్‌ను అభినందిస్తున్నారు. ఇళ్లల్లో ఎదుర్కొంటున్న సమస్యలను సైతం శక్తి టీమ్‌ల దృష్టికి తీసుకొస్తుండటంతో భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సమస్య పరిష్కరిస్తున్నారు. ఇలా విద్యార్థినులు, మహిళల మనసులో శక్తి టీమ్‌లు చెరగని ముద్ర వేసుకుంటున్నాయి.ఖాకీ ప్యాంట్, నీలం రంగు షర్ట్, టోపీ, బూట్లతో శక్తి టీమ్‌ సభ్యులు విదేశీ పోలీసుల్లా ఆకట్టుకుంటున్నారు. వీరు ప్రయాణించే ద్విచక్ర వాహనం ముందు భాగాన పోలీస్‌ చిహ్నం, ఏపీ పోలీస్, మరో వైపు శక్తి.. మహిళలకు చేరువ.. అనే నినాదాలు ఆకర్షిస్తున్నాయి. మహిళలు ఎక్కువగా ఉండే  కూడళ్లు, కళాశాలల జంక్షన్‌లు, షాపింగ్‌ మాల్స్, బస్టాండ్‌ల వద్ద వీరు వారికిచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎక్కువగా కనిపిస్తారు.