నిధులున్నా నిర్లక్ష్యమే...! (కృష్ణాజిల్లా) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిధులున్నా నిర్లక్ష్యమే...! (కృష్ణాజిల్లా)

మచిలీపట్నం, జూలై 4 (way2newstv.com):
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చిన్న పనులు చేసుకునేందుకు నిధులున్నా.. సమస్యలు వెంటాడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.. ఎందుకంటే.. పూర్తి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని రోగులు చెబుతున్నారు.. జిల్లాలో చాలా చోట్ల మంచి నీటి సౌకర్యాలు లేక రోగులు బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.. మరుగుదొడ్లు మరమ్మతులు లేక బయట మలవిసర్జనకు వెళుతున్నారు. ఫ్యాన్లు తిరక్క ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నారు. శస్త్రచికిత్సలకు అత్యవసర పరికరాలు కొనక ఇక్కట్లకు గురవుతున్నారు. మందులు నిండుకున్న సమయంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుంచి కొనే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా రోగికి చీటీలు రాసి పంపించేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నతాధికారులు అన్ని వసతులు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యుల ఖాళీలను కూడా భర్తీ చేశారు. ఇలా అనేక సౌకర్యాలు ఉన్నా కేంద్రాల్లో తక్షణావసరాలతోపాటు ఏవైనా వసతులు కావాలంటే ఏర్పాటు చేసుకునేందుకు ఏటా అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నారు. చాలావరకు కేంద్రాలు వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలేదు.
నిధులున్నా నిర్లక్ష్యమే...! (కృష్ణాజిల్లా)

కళ్ల ముందు సమస్యలు ఉన్నా పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి రూ.70 నుంచి రూ. 80 లక్షలు వెచ్చించి కొత్తగా పదింటిని నిర్మించారు. అక్కడ అన్ని వసతులున్నాయి. అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వసతులు, అత్యవసర మందుల కొనుగోలు నిమిత్తం ఏటా రూ. 1.75 లక్షలు ప్రభుత్వం అందిస్తోంది. ఆ ఏడాదికి అవరాలను గుర్తించి అభివృద్ధి కమిటీతో సమావేశంలో తీర్మానాలు చేసి నిధులు ఖర్చు చేయాలి. చాలాచోట్ల వచ్చిన నిధులు వచ్చినట్లు ఖాతాల్లో మూలుగు తున్నాయి. ● బాపులపాడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రూ.8,49,668 ఉన్నాయి. నాలుగైదేళ్లుగా అంతంత మాత్రంగావినియోగిస్తున్నారు. ముస్తాబాదాలో రూ.4,77,730, ఆగిరిపల్లి రూ.5,70,321, చాట్రాయి రూ.3.55 లక్షలు, రమణక్కపేట రూ.4 లక్షలు, లింగాలపాడు రూ.3.16 లక్షలు, పెండ్యాల రూ.6.65 లక్షలు, గురజ రూ.3.73 లక్షలు, ఇందుపల్లి రూ.6 లక్షలు, మూల్లంక రూ.5.50 లక్షలు ఉన్నాయి. కలిదిండి రూ.3.64 లక్షలు, సీతనపల్లి రూ.6.35 లక్షలు, దేవపూడి రూ.8.66 లక్షలు, ముదినేపల్లి రూ.7.92 లక్షలు, రుద్రపాక రూ.3.28 లక్షలున్నాయి. ఘంటసాల రూ.3.99 లక్షలు, సొర్లగొంది రూ.6.60 లక్షలు, మందపాకల రూ.4 లక్షలు, చినపాండ్రాక రూ.8.92 లక్షలు, పెడన మండలం చేవెండ్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ.4.43 లక్షలు చొప్పున మూలుగుతున్నాయి. మిగిలినవాటిలో రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా రూ.1.94 కోట్లు ఖర్చు చేయకుండా ఖాతాల్లో ఉన్నాయి. మొవ్వ, తోట్లవల్లూరు, వీరులపాడు, అల్లూరు, చౌటపల్లి, పెదతుమ్మిడి, చినఓగిరాల రాజుగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో ఖర్చు చేశాయి. ఆసుపత్రిని అభివృద్ధి చేయడంతోపాటు ప్రభుత్వం కేటాయించే నిధులు అవసరాలకు అనుగుణంగా ఖర్చుచేసే క్రమంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్న లక్ష్యంతో అభివృద్ధి కమిటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో పీహెచ్‌సీ పరిధిలోని ఛైర్మన్‌ ఉంటారు. వీరితోపాటు వైద్యుడు, స్థానికులు, జిల్లావైద్య ఆరోగ్యశాఖ నుంచి ఒకరు పలువురితో కమిటీ ఏర్పాటవుతుంది. ప్రస్తుతం జిల్లాలోని అన్నింటికీ కమిటీలున్నాయి. అవి అలంకార ప్రాయమే అవుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆ కమిటీలు కూడా ఎంతకాలం ఉంటాయో తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా పట్టించుకోకపోతే తరువాత మరింత జాప్యం అయ్యే అవకాశం ఉంది.