గ్రంధాలయాల్లో అన్నీ ఇబ్బందులే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రంధాలయాల్లో అన్నీ ఇబ్బందులే

మెదక్, జూలై 11, (way2newstv.com)
ప్రభుత్వం గతేడాది మెదక్‌లో జిల్లాస్థాయి గ్రంథాలయాన్ని నెలకొల్పింది. జిల్లా కేంద్రంలో ఇప్పుడిప్పుడే విద్యకు కేంద్రంగా మారుతోంది. విద్యాసంస్థలు వెలుస్తున్నాయి. దీంతో మెదక్‌ మండలం నుంచే కాకుండా రామాయంపేట, హవేలిఘనపూర్‌, పాపన్నపేట, చిన్నశంకరంపేట, కౌడిపల్లి, కొల్చారం మండలాల నుంచి సైతం విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. దీనికితోడు ఇక్కడే ఉంటూ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఇక వీరంతా తమ ప్రయత్నాలలో భాగంగా రోజులో ఏదో ఓ సమయంలో పుస్తక పఠనం కోసం గ్రంథాలయానికి వెళ్తుంటారు. అయితే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేక అవస్థలు తప్పడం లేదు కొన్నేళ్ల కిందట నిర్మించిన భవనంలో ఉన్న ఓ గది, హాల్‌ను గ్రంథాలయానికి వినియోగించుకుంటున్నారు. 
గ్రంధాలయాల్లో  అన్నీ ఇబ్బందులే

హాల్‌ను రెండుగా విభజించి ఓ వైపు పుస్తకాలు భద్రపర్చగా, మరోవైపు పాఠకులు చదివేందుకు బల్లాలు ఏర్పాటు చేశారు. ఉన్న ఒక గదిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌కు కేటాయించారు.ప్రస్తుతం ఉన్న భవనంలో వసతి సరిపోక పాఠకులు ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాఠకుల సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు ఆరేళ్ల క్రితం అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి.జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో మూత్రశాలలు, శౌచాలయాలు కరవయ్యాయి. దీంతో కార్యాలయ సిబ్బంది, అక్కడికి పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూత్రశాలలను నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా ఒక్కడ అడుగు ముందుకు పడలేదు సరిపడా సిబ్బంది లేక పర్యవేక్షణ కరవైంది. జిల్లా కార్యదర్శి, ఇద్దరు గ్రంథపాలకులు, ఇద్దరు అటెండర్లు అవసరం ఉంది. ప్రస్తుతం ఒక లైబ్రేరియన్‌, ఒక వాచ్‌మెన్‌ ఉండగా, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన రికార్డు అసిస్టెంట్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో జిల్లాలోని గ్రంథాలయాలను పర్యవేక్షించడం వల్ల  ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. మొన్నటి వరకు ఇద్దరు లైబ్రేరియన్లు ఉండగా, అందులో ఒకరు సంగారెడ్డికి బదిలీ అయ్యారు.కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం మెదక్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.  ఇలాంటి తరుణంలో గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలు, సాంకేతికతను అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిధులను మంజూరు చేసేలా చర్యలు తీసుకొని సకల వసతులను సమకూర్చాలి. కొత్త కమిటీ పర్యవేక్షించడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ వహించి పుస్తకాల కొనుగోలు, ఇతర సౌకర్యాలు కల్పించే విధంగా చొరవ చూపాలి. అప్పుడే ఉద్యోగార్థులకే మేలు చేకూరుతుంది.