బర్రెల కోసం.. టెండర్ల విధానం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బర్రెల కోసం.. టెండర్ల విధానం

ఖమ్మం, జూలై 11, (way2newstv.com)
లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెలు, బర్రెల పథకాన్ని ఇకపై టెండర్ల ద్వారా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వెటర్నరీ అధికారులు, పశు వైద్యులు, దళారుల దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పథకం మొదటి విడతలో అనుసరించిన కొనుగోళ్ల పద్ధతి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని గుర్తించి, నిబంధనలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం వెలువడగానే ఉత్తర్వులు జారీకానున్నాయి. గొల్ల, కురుమలను ఆదుకోవటానికి గొర్రెల పథకం, పాడి రైతులకు గేదెల పంపిణీ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ, అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాలు అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువులుగా తయారయ్యాయి. 
బర్రెల కోసం.. టెండర్ల విధానం

పలువురిపై కేసులు నమోదు చేసినా అక్రమాలకు అడ్డుకట్ట పడటంలేదు. దీంతో రెండో విడతలోనైనా పకడ్బందీగా అమలు చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రెండు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. టెండర్ల ద్వారా బర్రెలు, గొర్రెలను సేకరించి పంపిణీ చేయడం మొదటి ప్రతిపాదన. సబ్సిడీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం రెండో ప్రతిపాదన. గొల్ల, కురుమల అభివృద్ధి కోసం 2018 జూన్‌లో గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ పథకం లక్ష్యం రెండేళ్లలో 7లక్షల28 వేల యూనిట్లు. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక్క పొట్టేలు కలిపి కోటి 53 లక్షల జీవాలను పంపిణీ చేయాల్సి ఉంది. రెండేళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో లిస్ట్‌‌- ఏ లో 3లక్షల 67 వేల 20 మంది లబ్ధిదారులకు 70 లక్షల10 వేల గొర్రెలు పంపిణీ చేశారు. ఇక లిస్ట్‌- బీలో 3 లక్షల 61 వేల 854 మంది లబ్ధిదారులకు 75 లక్షల 98 వేల గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 5 లక్షల84 వేల గొర్రెలను మాత్రమే అందజేశారు. ఈ గొర్రెలన్నీ కాపరుల వద్ద ఉన్నాయా? లేవా? అమ్మేసి ఉంటే కారణాలు ఏమిటి? అనే అంశాలపైనా ప్రభుత్వం విచారణ జరిపించింది. గ్రామాలవారీగా సర్వే చేయించింది. ఈ సర్వే ద్వారా పలువురు వెటర్నరీ డాక్టర్ల దోపిడీ, అధికారుల చేతివాటం, దళారుల దందా కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్నిచోట్ల గొర్రెలు గ్రౌండింగ్‌ చేయకున్నా చేసినట్లు చూపించారు. తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ- రంగారెడ్డి డెయిరీ, ముల్కనూరు మహిళా డెయిరీ, కరీంనగర్‌ డెయిరీల్లోని 2లక్షల13 వేల మంది సభ్యులకు ఒక్కొక్కరికి ఒక పాడి గేదెను సబ్సిడీపై అందజేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఒక్కో పాడి పశువుకు 80 వేల రూపాయలు యూనిట్‌ ధరగా నిర్ధారించింది. దానికి అదనంగా 5 వేలు రవాణా, ఇతర ఖర్చుల కోసం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీ ఇస్తారు. మిగిలిన 25శాతం లబ్ధిదారుడు భరించాలి. ఇతరులకు 50శాతం సబ్సిడీ ఖరారు చేశారు. మిగిలిన 50 శాతం వాటాను లబ్ధిదారుడు చెల్లించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. బర్రెలను ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా కొనుగోలు చేసే స్వేచ్ఛను లబ్ధిదారుడికి ఇచ్చారు. అయితే అధికారులు, దళారులు కలిసి ఈ పథకాన్ని పక్కదారి పట్టించారు. రెండు మూడు లీటర్ల పాలు కూడా ఇవ్వని, మార్కెట్‌లో 30 వేలకు మించి ధర పలకని గేదెలను వెటర్నరీ వైద్యులు 80 వేలకు కొనిపించారు. ఒక్కో డాక్టర్‌, ఒక్కో యూనిట్‌పై 10 వేలకు తగ్గకుండా గిట్టుబాటు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. బర్రెలు తీసుకువచ్చే వాహనాల ఖర్చు కూడా రైతులతోనే పెట్టిస్తున్నట్లు స్పష్టమైంది. వివిధ జిల్లాల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో సర్కార్ అక్రమాలను అరికట్టేందుకు రంగంలోకి దిగింది.