కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు ఒకే చట్టం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు ఒకే చట్టం

ఇవాళ కేబినెట్ ఆమోద ముద్ర
హైద్రాబాద్, జూలై 16, (way2newstv.com)
జీహెచ్‌ఎంసీకి ఒక చట్టం, మున్సిపల్‌ కార్పొరేషన్లకు మరో చట్టం, మున్సిపాలిటీలకు ఇంకో చట్టం... ఒకే రాష్ట్రంలో వివిధ స్థానిక సంస్థలకు వేర్వేరు చట్టాలు అవసరమా? ఆ సంస్థల విధులు, నిధుల స్వరూపం ఒకే రీతిగా ఉన్నప్పుడు.. రకరకాల చట్టాలతో సంక్లిష్టత పెంచే బదులు ఒకే చట్టాన్ని తెస్తే సరిపోదా? ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని ఇదే. మున్సిపల్‌ చట్టాలన్నింటినీ మూలన పడేసి వాటి స్థానంలో సమగ్ర చట్టాన్ని తేవాలని నిర్ణయించింది. గతంలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని తెచ్చినట్లు కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తేబోతుంది. ప్రస్తుత చట్టాల్లో నిబంధనలు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేవు. పట్టణీకరణలోనూ నాటికీ నేటికీ తేడా వచ్చింది.ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోసం ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌- 1955’ అమల్లో ఉంది. 
కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు ఒకే చట్టం

రాష్ట్రంలోని వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండం, మహబూబ్‌నగర్‌ వంటి కార్పొరేషన్ల కోసం ‘తెలంగాణ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ యాక్ట్‌-1994’ ఉంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలీటలన్నీ... ‘తెలంగాణ మున్సిపాలిటీస్‌ యాక్ట్‌-1965’ ప్రకారం నడుస్తున్నాయి. ఈ మూడు చట్టాలను కలిపి ఒకే చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన ఈ చట్టాలను 2014లో తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా అన్వయించారు. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా చట్టాల్లో మార్పులు చేశారు. కానీ.. రాష్ట్రంలోని వేర్వేరు స్థానిక సంస్థలకు వేర్వేరు చట్టాల వల్ల పరిపాలనలో సంక్లిష్టత ఏర్పడుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు నిర్వహించే విధులు దాదాపు ఒకేలా ఉన్నా వేర్వేరు చట్టాలను అనుసరించి పాలన సాగుతోంది. ఇది మున్సిపల్‌ శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక సంస్థలన్నింటికీ కలిపి ఏదైనా జీవో జారీ చేయాలంటే... వేర్వేరుగా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒకే చట్టం కింద పని చేస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు. కొత్త చట్టంలో విధులు, నిధుల వినియోగాన్ని పునర్నిర్వచించాల్సి ఉంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనసాంద్రత ఉండేది. కానీ, ఇప్పుడు పట్టణీకరణ పెరిగిపోతోంది. గ్రామాలను వదిలి ప్రజలు పట్టణాలవైపు పరుగులు పెడుతున్నారు. రాష్ట్రంలోని 3.52 కోట్ల జనాభాలో 38.64%... అంటే 1.36 కోట్ల మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఇది జాతీయ సగటు 31.64% కంటే అధికం. వలసలతో పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పౌర సేవలను విస్తరించాల్సి వస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ నిధులను వెచ్చించాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త చట్టాన్ని తేవాలని నిర్ణయించింది.రాష్ట్రంలో పాతవి 73తో పాటు కొత్తగా ఏర్పడిన 71 కలుపుకొంటే 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటినీ చట్టంలో పొందుపర్చాల్సి ఉంది. కొత్త మున్సిపాలిటీల హద్దులు, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్ల విధులు, నిధుల నిర్వహణను నిర్వచించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడు చట్టాలను కలిపి ఒకే సమగ్ర చట్టం రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కమిషనరేట్‌ అండ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) కసరత్తు చేస్తోంది. మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారుల సూచనలు, సలహాల మేరకు సమగ్ర చట్టాన్ని రూపొందిస్తున్నారు