భారీ నష్టాల్లో మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారీ నష్టాల్లో మార్కెట్లు


ముంబై, జూలై 8  (way2newstv.com):
దేశీ స్టాక్‌మార్కెట్ సోమవారం కుప్పకూలింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ ఇన్వెస్టర్లకు నచ్చకపోవడం ఇందుకు కారణం. నిఫ్టీ 11,600 స్థాయి కిందకు పతనమైంది. సెన్సెక్స్ 39,000 మార్క్ కిందకు పడిపోయింది. మార్కెట్ ఆరంభంలోనే భారీగా నష్టపోయింది. బెంచ్ మార్క్ సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 908 పాయింట్లమేర పడిపోయింది. నిఫ్టీ 288 పాయింట్లమేర కుప్పకూలింది. చివరకు సెన్సెక్స్ 793 పాయింట్ల (2.01 శాతం) నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 253 పాయింట్ల (2.14 శాతం) నష్టంతో 11,559 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 
పతనానికి కారణాలు ఇవే.. 
✺ అంతర్జాతీయ మార్కెట్ బలహీనంగా ఉండటం. అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్టాన్ స్టాన్లీ ప్రపంచపు ఈక్విటీ మార్కెట్లను డౌన్‌గ్రేడ్ చేయడం ఇందుకు కారణం. 
✺ విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుల పెంపు. మోదీ ప్రభుత్వపు బడ్జెట్ ప్రతిపాదనల వల్ల సంపన్నులు ఎక్కువ పన్నులు చెల్లించాల్సి వస్తుంది. విదేశీ ఇన్వెస్టర్లపై ప్రభావం పడనుంది. దీంతో వారు మార్కెట్‌ నుంచి డబ్బులు వెనక్కు తీసుకుంటున్నారు. 


భారీ నష్టాల్లో మార్కెట్లు

✺ నిర్మలా సీతారామన్ లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్స్‌ వాటాను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భాగంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీని కోరింది. దీంతో ఐటీ, పీఎస్‌యూ, పలు ఎంఎన్‌సీలపై ప్రతికూల ప్రభావం పడనుంది. 
✺ జూన్ త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. వచ్చే వారం నుంచి జూన్ క్వార్టర్ ఫలితాలు వెల్లడి ప్రారంభమౌతుంది. ఈ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 
✺ టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీకి 11,700 వద్ద కీలక మద్దతు లభిస్తుంది. ఇండెక్స్‌కు 50 రోజుల ఎక్స్‌పొన్షియల్ మూవింగ్ యావరేజ్ 11,722 వద్ద ఉంది. సూచీ ఈ స్థాయి కిందకు పడిపోయింది. ఇది బుల్స్‌కు ప్రతికూల అంశం. 
మార్కెట్ హైలైట్స్.. 
✺ నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ ఏకంగా 6 శాతం పెరిగింది. 
✺ అదేసమయంలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హీరో మోటొకార్ప్ షేర్లు పడిపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఏకంగా 10 శాతానికి పైగా కుప్పకూలింది. 
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 6 శాతం పతనతమైంది. ప్రైవేట్ బ్యాంక్, మెటల్, బ్యాక్, ఫైనాన్షియల్ సర్వీసెసర్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా 3 శాతానికి పైగా క్షీణించింది. 
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.08 శాతం పెరుగుదలతో 64.28 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.07 శాతం క్షీణతతో 57.47 డాలర్లకు తగ్గింది. 
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. దాదాపు 27 పైసలు క్షీణతతో 68.69 వద్ద కొనసాగుతోంది.