రైతుల మేలు కోసమే రైతు దినోత్సవం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతుల మేలు కోసమే రైతు దినోత్సవం


కడప, జూలై 8 (way2newstv.com):
కడప గడపలో రైతు దినోత్సవానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మహానేత పుట్టిన రోజు నుంచే రైతు దినోత్సవాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు జగన్. రైతులంటే నాన్నగారికి ప్రాణం.. అందుకు ఆయన పుట్టిన రోజు నాడు.. పాదయాత్రలో రైతులు చెప్పిన మాట ప్రకారం.. రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఈ ప్రకటనతో ప్రభుత్వం రైతులపై మేలు చేయాలన్న బాధత్య పెంచిందన్నారు. రైతుల కోసం ఎంత వరకైనా వెళతాం.. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. అన్నదాతలు శ్రేయాభిలాషులమన్నారు. రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలందిస్తామని సీఎం చెప్పారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్‌ ఇస్తున్నామని.. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. వైఎస్సార్‌ పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టామని.. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రూ.2వేల కోట్లతో రైతు విపత్తు సహాయ నిధి ఏర్పాటు.. వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 అందిస్తామన్నారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని.. రైతు భరోసా కింద రూ.8వేల750 కోట్లు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 

 రైతుల మేలు కోసమే రైతు దినోత్సవం


చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్నారు జగన్. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందజేస్తామని.. వీటి నాణ్యతను పరీక్షించడానికి ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మార్కెట్ కమిటీలకు ఎమ్మెల్యేలే గౌరవ ఛైర్మన్లుగా ఉంటారని.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్కెట్ కమిటీలు కృషి చేస్తాయన్నారు. కొబ్బరికి కనీస మద్దతు ధర క కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని.. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించబోతున్నామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం విత్తనాల బకాయిలు కూడా చెల్లించలేదని, రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని సీఎం తెలిపారు. రాయలసీమలో కరవును పట్టించుకునేవారు లేరని, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ ట్యాక్స్‌ను రద్దు చేశామన్నారు. తుపాన్లు వచ్చినప్పడు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పుడు మేం ఇస్తున్నామన్నారు. అరటి రైతుల గురించి గత ప్రభుత్వం ఆలోచించలేదు.. అధికారంలోకి రాగానే పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రైతుకు జరగరానిది జరిగితే రూ.7 లక్షలు చెక్కు అందిస్తామన్నారు. రైతుల బాధల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదన్నారు.
20 వేల మంది ఉద్యోగాలు
కడప జిల్లాలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. జమ్మలమడుగులో జరిగిన సభలో పాల్గొన్నారు.. సొంత జిల్లాపై వరాలు కురిపించారు. స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లు జగన్ ప్రకటించారు. గత పాలకులు స్టీల్ ప్లాంట్‌పై ఎన్నో డ్రామాలాడారు.. కడప ఉక్కు పరిశ్రమ ఏ పనీ జరగక ఆగిపోయిన పరిస్థితిలో ఉందన్నారు. డిసెంబర్‌ 26న జగన్‌ అనే నేను వచ్చి.. అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానన్నారు. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తానని మాటిస్తున్నాను.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. కడప జిల్లాలో ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేసి.. కుందూ నదిపై రాజోలి జలదరాశి ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామన్నారు. కేసీ కెనాల్‌ కింద కడప జిల్లాలో సాగునీరు అందక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి కోసం కుందూ నదిపై జలదరాశి ప్రాజెక్టు కడతామన్నారు. డిసెంబర్‌ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానన్నారు. పనుల్ని వేగవంతం చేసి.. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దేవుడు కరుణిస్తే గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది 20 టీఎంసీలు నీరు నిల్వ చేసేలా చూస్తామన్నారు జగన్. అలాగే గండికోట నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని.. ప్రతి ఎకరాకు రూ.10లక్షల పరిహారం అందజేస్తామన్నారు. ఇలా జిల్లాలో ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేసి.. త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇక బ్రహ్మంసాగర్‌కు నీళ్లందని పరిస్థితి ఉందని.. వెలుగోడు నుంచి 100 కి.మీ దూరంలో ఉన్నా నీళ్లు లేవన్నారు జగన్. దీనిపైనా ఆలోచన చేస్తామన్నారు.