అంతా ఓపెన్ (మహబూబ్ నగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతా ఓపెన్ (మహబూబ్ నగర్)

మహబూబ్ నగర్, జూలై 12 (way2newstv.com): 
జిల్లాలో మత్తుదందా జోరుగా సాగుతోంది.  కొంతకాలంగా రహస్య ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దందా ఇప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా బహిరంగంగా సాగుతోంది. పోలీసుల కళ్లుగప్పి వ్యాపారులు ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు. చిన్న గల్లీలో ఎలాంటి సరుకులు లేని కిరాణ దుకాణంలో సిగరేట్ల వ్యాపారం జోరుగా సాగుతుందంటే కచ్చితంగా అక్కడ యువతను మత్తులో దించే గంజాయి మహమ్మారి విక్రయిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగే ద్విచక్ర వాహనంపై ఇద్దరు, ముగ్గురు యువకులు పట్టణశివారుకు వెళ్లడం, చెట్ల మధ్య నిలిచి, రాత్రివేళ చీకట్లో సిగరేట్లు కాలుస్తున్నట్లు కనిపిస్తుంటే.. వారు ప్రాణాంతకమైన గంజాయి పీలుస్తున్నారనే విషయం దగ్గరికి వెళ్లి చూసేవరకు తెలియదు. ఈ విషయం కొంతకాలంగా తల్లిదండ్రులను కలవరపెడుతుంది. రోజూ సాయంత్రం అయిందంటే యుక్త యువకులు గుంపులుగా జిల్లా కేంద్రంలోని  రహస్య ప్రాంతాలకు చేరుకుంటున్నారు. 
అంతా ఓపెన్ (మహబూబ్ నగర్)

ద్విచక్ర వాహనాల్లో వచ్చిన వారు దుకాణాల్లో లభించే సిగరెట్‌లోని పొగాకును తీసేసి అందులో గంజాయి నింపుకుని తాగుతున్నారు. రోజూ రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకు వారంతా గుంపులుగా చేరి గంజాయి పీలుస్తున్నారు. కొంతమంది పెద్దలకు ఈ విషయం తెలిసినా మనపిల్లలు కాదు కదా మనకెందుకనే భావనతో మిన్నకుండి పోతున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది. జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు రోడ్, మార్కెట్‌ యార్డు, అల్లీపూర్‌ రోడ్, తదితర ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకున్నారు. గంజాయి విక్రయదారుల 15–20ఏళ్ల వయసున్న యువకులను లక్ష్యంగా పెట్టుకుని సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది యువకులు దీనికి పూర్తిగా బానిసలు అయ్యారు. వారు రోజంతా మత్తులో ఉండటం, ఇంట్లో చిరాకుగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో చాలా మంది కనిపిస్తున్నారు.  మత్తు పదార్థాలకు మనిషి ఒక్కసారి అలవాటుపడితే వాటి నుంచి దూరం కావడం అసాధ్యం. ఆ మత్తుకు అలా బానిస కావాల్సిందే. కేవలం మత్తును ఆస్వాధించడం కోసం వినియోగించే డ్రగ్స్‌ను ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేసే సమయంలో రోగులకు నొప్పి తగ్గడానికి వైద్యులు అవసరమైన మోతాదులో రోగులకు ఇస్తుంటారు. ఇలాంటి డ్రగ్స్‌ను అవసరం అయిన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు నిత్యం కావాలనిపిస్తుటుంది. ఇలాంటి మత్తును రుచి చూసినవారికి జీవితాంతం కావాలని కోరుకుంటారు.  ఇలాంటి మత్తు ఇంజక్షన్లు పూర్తిగా నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుంది. మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి మత్తుకు అలవాటుపడిన వారికి అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం, తనకుతాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు సైతం  పాల్పడుతుంటాడు. పట్టణంలో జోరుగా సరఫరా అవుతున్న గంజాయి ఒక్కో ప్యాకెట్‌లో 12 గ్రాములు నింపి ప్యాక్‌ చేసి రూ.200 నుంచి రూ.300లకు విక్రయిస్తున్నారు. దీనిని యువకులు సిగరెట్‌లో ఉండే పొగాకులో గంజాయి కలిపి రెండింటిని కలిపి పీలుస్తున్నారు. దీంతో ఒకరకమైన మత్తుకు వారంతా అలవాటుపడ్డారు. ఈ గంజాయి పీలుస్తున్న సమయంలో యువత గ్రూప్‌లుగా ఏర్పడి ప్రత్యేక గదుల్లో, శివారు ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకుంటున్నారు. కేవలం 17నుంచి 28ఏళ్ల మధ్య ఉన్న వారితో పాటు ఆటో, జీపు డ్రైవర్లు  దీనిని అధికంగా తీసుకుంటున్నారు. కొంతమంది అజ్ఞాత వ్యక్తులు వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి చెందిన కొందరు యువకులకు గంజాయి సరఫరా చేస్తున్నారు. వారు స్థానికంగా కొంత మందిని నియమించుకుని యువతకు అంటగడుతున్నారు. గంజాయిని ఎవరికి పడితే వారికి విక్రయించకుండా తెలిసిన వ్యక్తులకు మాత్రమే విక్రయిస్తున్నారు. అనుమానం రాకుండా ఉండేందుకు పక్కాప్లాన్‌తో డ్రెస్‌కోడ్‌తో కూడిన సంచులు పట్టుకుని తిరుగుతూ కన్పిస్తుంటారు.గంజాయికి తోడు కొంత మంది యువకులు సూది మత్తు మందుకు అలవాటు పడినట్లు తెలుస్తోంది.