రియల్ భూమ్ (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రియల్ భూమ్ (నిజామాబాద్)

నిజామాబాద్, జూలై 15 (way2newstv.com): 
జిల్లాలో ‘రియల్‌’ బూమ్‌ మళ్లీ జోరందుకుంది.. పల్లె, పట్టణం తేడా లేకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా భూముల ధరలు రూ.కోట్లకు చేరాయి. ప్రధానంగా రహదారుల వెంట ఉన్న భూముల రేట్లు మూడు, నాలుగింతలు పెరిగాయి. కొన్నిచోట్ల గజం జాగా ధర రూ.లక్ష వరకు పలుకుతోంది. డబ్బు ఉన్నోళ్లంతా భూముల వెంట పడ్డారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుందామంటే రకరకాల సమస్యలు తలెత్తుతుండడం, ఫైనాన్సుల్లో పెట్టుబడులు పెడితే నమ్మకం లేకుండా పోవడంతో చాలా మంది భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులంతా రియల్‌ దందా మీదనే దృష్టి సారించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒకరి చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి మారే క్రమంలో ధర రెండింతలవుతోంది.
రియల్ భూమ్ (నిజామాబాద్)

గతంలో పట్టణ ప్రాంతాల్లోనే కనిపించిన రియల్‌ దందా ఇప్పుడు మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. దీంతో అంతటా ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ఇక రాష్ట్రీయ, జాతీయ రహదారుల వెంట  అయితే స్థలాల ధరలు రూ.కోట్లకు చేరాయి. జిల్లా మీదుగా వెళ్తున్న బెంగుళూరు–నాగ్‌పూర్‌ హైవేతో పాటు సంగారెడ్డి–నాందేడ్‌–అకోలా జాతీయ రహదారి, అలాగే కరీంనగర్‌–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, మెదక్‌–ఎల్లారెడ్డి–బాన్సువాడ–బోధన్‌ రహదారులపై భూముల ధరలు సామాన్యుడికి అందని స్థాయికి చేరాయి. 44వ జాతీయ రహదారిపై భిక్కనూరు మం డలం బస్వాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, పొం దుర్తి, కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి, క్యాసంపల్లి, రామేశ్వర్‌పల్లి, ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్, సదాశివనగర్‌ మండలంలోని కుప్రియాల్, అడ్లూర్‌ఎల్లారెడ్డి, పద్మాజీవాడి చౌరస్తా, పద్మాజివాడి, మర్కల్, కల్వరాల్, దగ్గి వరకు ఎకరా రూ.50 లక్షలకు పైనే ధర పలుకుతోంది. భిక్కనూరు, కామారెడ్డి మండలాల పరిధిలోనైతే రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు నడుస్తోంది. 161వ నంబరు జాతీయ రహదారి అయిన సంగారెడ్డి–నాందేడ్‌–అకోలా రహదారి వెంట కూడా భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ఈ రహదారిపై నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, జుక్కల్,  బిచ్కుంద, మద్నూర్‌ మండలాలు ఉన్నా యి. పిట్లం మండల పరిధిలో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నడుస్తుండగా, పెద్ద కొడప్‌గల్‌లో మాత్రం రూ.కోటి నుంచి రూ.కోటి 20 లక్షలు అమ్ముడు పోతోంది. మద్నూర్‌లో రూ.60 లక్షలు నడుస్తోంది. జాతీయ రహదారికి లోపల ఉన్న బిచ్కుంద మండల కేంద్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు నడుస్తోంది. జాతీయ రహదారులుగా గుర్తించిన మెదక్‌–ఎల్లారెడ్డి– బాన్సువాడ రోడ్డుతో పాటు కరీంనగర్‌–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం రహదారుల పక్కన గల భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎకరాకు రూ.80 లక్షల వరకు నడుస్తోంది. ఇటీవల బంజెరతండా వద్ద రూ.50 లక్షలకు ఎకరం కొనుగోలు చేశారు. మండల కేంద్రంలో గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఎల్లారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల రూ.అర కోటి నుంచి రూ.కోటి వరకు నడుస్తోంది. నిజాంసాగర్‌ మండలంలో మాత్రం రూ.30 లక్షలు పలుకుతోంది. బాన్సువాడ పట్టణ శివార్లలో ఎకరానికి రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు నడుస్తుండగా, దూరాన ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు.