మేం తలుచుకుంటే.... జగన్ సీరియస్ కామెంట్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మేం తలుచుకుంటే.... జగన్ సీరియస్ కామెంట్స్

విజయవాడ, జూలై 12, (way2newstv.com)
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సున్నా వడ్డీ రుణాలపై గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తానేదో గొప్పగా పథకాలు అమలు చేసినట్లుగా ప్రతిపక్షనేత చంద్రబాబు చెబుతున్నారని, ఆయన ప్రసంగాలు తొలిసారిగా విన్నవారికి గొప్పగా చేశారని అనిపిస్తుందని ఆయన ఆరోపించారు.
 మేం తలుచుకుంటే.... జగన్ సీరియస్ కామెంట్స్

వడ్డీలేని రుణాలపై చర్చ సందర్భంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న దస్త్రాన్ని సభలో చదివి సీఎం వినిపించారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.11,595 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.630 కోట్లు ఇచ్చారని సీఎం తెలిపారు. 2014-15లో రూ.1186 కోట్లకు గానూ రూ.44.31 కోట్లు చెల్లించి గొప్పగా చేశామని చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే 2015-16లో రూ.2238 కోట్లు కట్టాల్సి ఉంటే రూ.31 కోట్లు చెల్లించారని, 2016-17లో రూ.2,354 కోట్లకు రూ.249 కోట్లు, 2017-18లో రూ.2703 కోట్లకు రూ.182 కోట్లు చెల్లించారన్నారు. 2018-19లో రూ.3069 చెల్లించాల్సి ఉంటే రూ.122 కోట్లు చెల్లించారని, ఐదేళ్లలో మొత్తం రూ.630 కోట్లు చెల్లించి గొప్పగా చేశామంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. రైతులకు వడ్డీలేని రుణాల కింద 5 శాతం ఇచ్చి గొప్పగా చేశామంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో సీఎం ప్రసంగానికి టీడీపీ నేతలు అడ్డుతగిలారు. దీనిపై సీఎం జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మీరు 23 మందే ఉన్నారని, మేము 151 మంది సభ్యులమని గుర్తుంచుకోవాలని అన్నారు. మేమంతా లేస్తే మీ స్థానాల్లో మీరు కూర్చోలేరని అన్నారు. మేం తలుచుకుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరని ఆగ్రహించారు. ప్రతిపక్షం బుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని, పర్సనాలిటీ పెరడగం కాదు, బుర్ర పెంచుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు గూండాలను, రౌడీలను తీసుకొచ్చారని జగన్ మండిపడ్డారు.